సాక్షి, అమరావతి: అక్రమంగా మద్యం తయారీ, రవాణాపైన ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. మద్యం అక్రమ రవాణా, తయారీకి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఇదివరకే చట్టాన్ని తీసుకు వచ్చామని, దీన్ని అమలు చేయాలని ఆదేశించారు. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో కార్యకలాపాల ప్రగతిపై అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు వివరాలు అందించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మద్యం నియంత్రణలో భాగంగా రేట్లను పెంచామని వెల్లడించారు. మూడింట ఒక వంతు దుకాణాలను మూసివేశామని, బెల్టుషాపులను,పర్మిట్‌రూమ్‌ల తీసేశామని తెలిపారు. లిక్కర్ అమ్మకాలు నెలకు 34 లక్షల కేసుల నుంచి 21 లక్షల కేసులకు తగ్గాయని పేర్కొన్నారు. బీరు అమ్మకాలు నెలకు 17 లక్షల కేసుల నుంచి 7 లక్షలకు తగ్గాయన్నారు. ఇలాంటి సందర్భంలో అక్రమంగా రవాణా అవుతున్న మద్యాన్ని, మద్యం తయారీని అడ్డుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఇసుక ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు
ఇసుకను నిర్దేశించిన రేట్లకన్నా ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే మరిన్ని రీచ్‌లు, డిపోల సంఖ్య పెంచేలా చూడాలన్నారు. ఎస్‌ఈబీ కాల్‌సెంటర్ నంబర్‌పై బాగా ప్రచారం చేయాలన్నారు. అధిక రేట్లకు ఎవరైనా అమ్మితే వెంటనే వినియోగదారులు ఆ నంబర్‌కు కాల్‌చేసేలా ప్రచారం చేయాలని, సంబంధిత జిల్లాల వారీగా ఈ ప్రచారం చేయాలని సూచించారు. వచ్చే కాల్స్‌పై సత్వరమే స్పందించి అధికారులు చర్యలు తీసుకోవాలని, క్రమం తప్పకుండా అధికారులు దీనిపై పర్యవేక్షణ చేయాలన్నారు. ఆ జిల్లాల్లో రేట్ల వివరాలను తెలియజేస్తూ అడ్వర్టైజ్‌మెంట్ ఇవ్వాలని, అంతకన్నా ఎక్కువ ధరకు ఎవరైనా విక్రయిస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. సీఎం జగన్ ఇంకేమన్నారంటే..
చదవండి: ‘అమెరికన్ కార్నర్’ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం జగన్
గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం
► గంజాయ సాగు, రవాణాను అరికట్టాలి.
► క్రమం తప్పకుండా దాడులు నిర్వహించాలి.
► పోలీసు విభాగాలు సమన్వయంతో పనిచేయాలి.
డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు
► డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
► ఏ కాలేజీలోనైనా అలాంటి ఉదంతాలు కనిపిస్తే.. అక్కడ ప్రత్యేక దృష్టిపెట్టాలి.
► క్రమం తప్పకుండా విశ్వవిద్యాలయాలు, కాలేజీలపైన పర్యవేక్షణ ఉండాలి.
► కార్యాచరణ తయారుచేసి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలి.
► ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నామో వచ్చే సమావేశంలో తెలియజేయాలి.
► ఆరోగ్యానికి అత్యంత హానికరంగా మారిన గుట్కా విక్రయాలు, రవాణాపైన దృష్టిపెట్టాలి.
చదవండి: Vaccination In AP: అత్యధిక డోసులు మహిళలకే..
ఎస్‌ఈబీ కార్యకలాపాలు:
►మద్యం అక్రమ రవాణా, తయారీలకు సంబంధించి ఇప్పటివరకూ 1,20,822 కేసులు నమోదు
► 1,25,202 మంది నిందితుల అరెస్టు
► 2020లో 63,310 కేసులు నమోదు
► 2021లో 57,512 కేసులు నమోదు
► 74,311 కేసులు నమోదు చేసిన ఎస్‌ఈబీ
► 46,511 కేసులు నమోదు చేసిన పోలీసులు
► 8,30,910 లీటర్ల అక్రమ మద్యం సీజ్
► 8,07,644 లీటర్ల నాటుసారా స్వాధీనం
► 2,30,48,401 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
► 29,491 వాహనాలు సీజ్
ఇసుక అక్రమ రవాణా
► ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి 12,211 కేసులు నమోదు
► 22,769 మంది నిందితుల అరెస్టు
► 5,72,372 టన్నుల ఇసుక స్వాధీనం
► 16,365 వాహనాలు జప్తు
గంజాయి సాగు, రవాణాకు సంబంధించి 220 కేసులు నమోదు
► 384 మంది అరెస్టు
►18,686 కేజీల గంజాయి స్వాధీనం
►మార్చి 20, 2021 నుంచి మార్చి 31, 2021 మధ్య ఆపరేషన్ నయా సవేరా కింద స్పెషల్ ఆపరేషన్
►69 కేసులు నమోదు, 174 మంది అరెస్టు
►2176 కేజీల గంజాయి స్వాధీనం
►3.065 ఎండీఎం స్వాధీనం
►330 అవేర్‌నెస్ క్యాంపులు నిర్వహించామని తెలిపిన అధికారులు.
ఈ సమీక్షా సమావేశానికి ప్లానింగ్ అండ్ రిసోర్స్ మొబలైజేషన్ స్పెషల్ సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, ఇంటెలిజెన్స్ చీఫ్ కే వీ రాజేంద్రనాథ్ రెడ్డి, గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, ఎస్‌ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్, ఎస్‌ఈబీ డైరెక్టర్ (స్పెషల్ యూనిట్స్) ఏ రమేష్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment