AP Disha App: CM YS Jagan Reviews On Disha Project, Directs Officials - Sakshi
Sakshi News home page

‘దిశ’ బలోపేతం: ఇకపై ఎక్కడికక్కడే ఫిర్యాదు

Published Sat, Jul 3 2021 2:34 AM | Last Updated on Sat, Jul 3 2021 4:43 PM

CM YS Jagan Reviews On Disha Project, Directs Officials - Sakshi

విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్‌ సెంటర్‌లో యువతులతో దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించి, దాన్ని ఉపయోగించే విధానాన్ని వివరిస్తున్న మహిళా పోలీసులు

సాక్షి, అమరావతి: బాధిత మహిళ ఒక గ్రామం నుంచి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లడానికి సంకోచించవచ్చని, అలాంటి మహిళలు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న మహిళా పోలీసుల ద్వారానే ఫిర్యాదు చేసే అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫిర్యాదు చేయడానికి, కేసు పెట్టడానికి మహిళలు ఎవ్వరూ కూడా పోలీస్‌స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయాలని స్పష్టం చేశారు. ఈ ఆలోచనను మరింత అధ్యయనం చేసి మెరుగ్గా తీర్చిదిద్దాలని.. జీరో ఎఫ్‌ఐఆర్‌ అవకాశాన్ని విస్తృతంగా కల్పించాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులను మరింత క్రియాశీలకం (యాక్టివ్‌గా) చేయాలని చెప్పారు. ‘దిశ’ కింద తీసుకుంటున్న చర్యలు, అమలుపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

మహిళలు, పిల్లల భద్రత, రక్షణ కోసం ‘దిశ’ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో భాగంగా పెట్రోలింగ్‌ కోసం కొత్తగా 145 స్కార్ఫియోలు కొనుగోలు చేసేందుకు ఆమోదం తెలిపారు. విద్యా సంస్థలు, యూనివర్సిటీలు, ఇంజనీరింగ్‌ కాలేజీలతో పాటు ముఖ్యమైన ప్రాంతాలల్లోని పోలీస్‌స్టేషన్లకు ఈ స్కార్ఫియోలను అందుబాటులో ఉంచి పెట్రోలింగ్‌ నిర్వహించాలని ఆదేశించారు. దిశ యాప్‌లో ఉన్న అన్ని ఫీచర్లపై మహిళా పోలీసులకు పూర్తి స్థాయి అవగాహన, శిక్షణ కల్పించాలని చెప్పారు. ప్రతి రెండు వారాలకు ఒకసారి జిల్లా కలెక్టర్, ఎస్పీలు సమావేశమై ప్రజా సమస్యలతోపాటు, మహిళల భద్రతపైనా సమీక్ష చేయాలని సూచించారు. పోలీస్‌స్టేషన్లలో రిసెప్షన్‌ వ్యవస్థ పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, దీనిపై ఉన్నతాధికారులు సమీక్ష చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. 
 


‘దిశ’ కింద తీసుకుంటున్న చర్యలు, అమలుపై క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

18 ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై దృష్టి 
‘దిశ’ ఎలా పని చేస్తుందన్న దానిపై ప్రతి పోలీస్‌స్టేషన్‌లో డిస్‌ప్లే ఏర్పాటు చేయాలి. మహిళలపై నేరాలకు సంబంధించిన 18 ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై దృష్టి పెట్టాలి. దీనికి సంబంధించి మరోసారి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడాలి. అలాగే బాలలపై నేరాలకు సంబంధించి కూడా 19 ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. 
వారాంతంలోగా ఇప్పటికే ఉన్న డిజిగ్నేటెడ్‌ కోర్టుల్లో పూర్తి స్థాయి రెగ్యులర్‌ పీపీల నియామకం పూర్తి చేయాలి. 181 విమెన్‌ హెల్ప్‌లైన్‌ను దిశకు అనుసంధానం చేయాలి. 
 
కొత్తగా ఆరు దిశ పోలీస్‌స్టేషన్ల నిర్మాణం 
మహిళల రక్షణ, భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దు. రాష్ట్రంలో 6 కొత్త దిశ పోలీస్‌స్టేషన్ల నిర్మాణానికి సంబంధించిన నిధులను త్వరగా విడుదల చేయాలి. అదనపు సిబ్బంది ద్వారా ‘దిశ’’ కాల్‌ సెంటర్లను బలోపేతం చేయాలి. 
‘దిశ’ కింద నమోదవుతున్న కేసుల పరిశోధనలో కీలక పాత్ర పోషిస్తున్న ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లలో ఇప్పటికే 58 పోస్టులు భర్తీ చేశాం. మరో 61 మందిని నియమించడానికి చర్యలు తీసుకోవాలి. తిరుపతి, వైజాగ్‌లలో (సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌) ల్యాబ్‌ల నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. 
అనంతపురం, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, కర్నూలు, గుంటూరు, విజయవాడల్లో మూడేళ్ల కాలంలో స్పెషల్‌ అసిస్టెన్స్‌ కింద దిశ ల్యాబ్‌ల నిర్మాణం పూర్తి చేయాలి. 
గంజాయి రవాణా, సరఫరాలపై ఉక్కు పాదం మోపాల్సిందే. ఇప్పటికే పోలీసులు దాడులు చేస్తున్నారు. వీటిని మరింత విస్తృతం చేయాలి. 
 
దిశ యాప్‌లో భాగంగా అభయం  
దిశ యాప్‌లో ఫీచర్స్‌ మెరుగ్గా ఉండడంతోపాటు, అభయం ప్రాజెక్టు లక్ష్యాలు చేరుకుంటుండడంతో దిశ యాప్‌నే అభయం ప్రాజెక్టుకూ వినియోగంపై సమావేశంలో చర్చించారు. 
ఇకపై దిశ కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూంలో ‘అభయ’ కూడా భాగం కానుంది. డిసెంబర్‌ కల్లా లక్ష వాహనాలకు అభయం పరికరాలు అమరుస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. 
కొన్ని ఘటనలను పూర్తిగా వక్రీకరించి ప్రభుత్వంపై, పోలీసు విభాగంపై దుష్ప్రచారం చేస్తున్నారని హోం మంత్రి సుచరిత సమావేశంలో ప్రస్తావించారు. జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోల్లో ఉద్దేశ పూర్వరంగా కొంత భాగాన్ని ఎడిట్‌ చేసి, వైరల్‌ చేస్తూ.. ప్రభుత్వాన్ని, పోలీసు విభాగాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆమె తెలిపారు. 
ఇలాంటి ఘటనల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, ఇలాంటి సందర్భాల్లో నిజానిజాలను ప్రజల ముందు పెట్టాలని సీఎం సూచించారు.  
అఘాయిత్యాలకు గురైన బాధితురాలిని ఆదుకునే విషయంలో జాప్యానికి తావుండరాదని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. ప్రతి కేసు విషయంలో ప్రత్యేక ధ్యాస పెట్టి బాధితురాలికి న్యాయం చేయాలని చెప్పారు. 
 
సుగాలి ప్రీతి కేసులో హైకోర్టులో కౌంటర్‌ 
కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి కుటుంబానికి సహాయం విషయంలో తీసుకున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రీతి తండ్రికి ఉద్యోగం ఇస్తూ త్వరలో ఆదేశాలు ఇస్తున్నామన్నారు. ప్రీతి తల్లి కోరుకున్న విధంగా ఆమెను కర్నూలు డిస్పెన్సరీలోనే కొనసాగిస్తున్నామని చెప్పారు.  
ఈ కేసు విచారణను సీబీఐ చేపట్టేలా ప్రభుత్వం తరఫున హైకోర్టులో కౌంటర్‌ వేస్తున్నామని సీఎంకు వివరించారు. బాధితురాలి కుటుంబాన్ని ఆదుకునే చర్యల్లో భాగంగా 5 సెంట్ల ఇంటి పట్టా, 5 ఎకరాల వ్యవసాయ భూమిని ఇప్పటికే గుర్తించామన్నారు. ప్రతి కేసుపై ఈ రకంగానే దృష్టి పెట్టాలని, బాధితురాలకి న్యాయం జరిగే వరకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు.  
ఈ సమీక్షలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, హోం శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కుమార్‌ విశ్వజిత్, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ కృతికా శుక్లా, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ కే.వి.రాజేంద్రనాథ్‌ రెడ్డి, దిశ స్పెషల్‌ ఆఫీసర్‌ దీపికా పాటిల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement