సాక్షి, అమరావతి: రైతులకు 99 శాతం పంటరుణాలు ఇచ్చారని, వారి ఆదాయం రెట్టింపుపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం 213వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశం నిర్వహించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, గౌతమ్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ విపత్తులు వచ్చినప్పుడు రైతులను ఆదుకోవాలన్నారు. పెట్టుబడి వ్యయం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, రైతు భరోసా ద్వారా రూ.13,500 చెల్లిస్తున్నామని సీఎం పేర్కొన్నారు(చదవండి:అక్క చెల్లెమ్మలు బాగుంటేనే రాష్ట్రం బాగు)
‘‘వడ్డీలేని రుణాల కింద గతంలో ఉన్న బకాయిలను చెల్లించాం. పంటల బీమా రూపంలో రైతులపై భారం లేకుండా చేశాం. రైతులు కట్టాల్సిన ప్రీమియంను మేమే కడుతున్నాం. 10,641 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. విత్తనం నుంచి పంట అమ్మేవరకూ ఆర్‌బీకేలు రైతులకు అండగా ఉంటాయి. కౌలు రైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావాలి. ప్రస్తుతం ఇస్తున్న రుణాలు ఆశాజనకంగా లేవు. జగనన్న తోడు కింద చిరువ్యాపారులకు రూ.10వేలు వడ్డీలేని రుణాలిస్తున్నామని’’ సీఎం తెలిపారు(చదవండి:‘భూ’ చరిత్రలో సువర్ణాధ్యాయం)
సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
‘‘అసంఘటిత రంగంకూడా ఆర్థిక వ్యవస్థకు దోహదం చేస్తోంది. ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక వడ్డీలకు రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గుర్తించిన ఈ చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డు కూడా ఇస్తున్నాం. వారు ఏపని చేస్తున్నారో కూడా గుర్తిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వీరు చెల్లించాల్సిన వడ్డీలు చెల్లిస్తుంది. వడ్డీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఉంటుంది. చిరు వ్యాపారుల జీవితాలను మార్చడానికి బ్యాంకర్లు ముందడుగు వేయాలి.
ఆసరా, చేయూతల ద్వారా మహిళల స్వయం సాధికారితకు అడుగులు వేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల జీవితాలను మార్చేలా కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న మహిళలు కుటుంబంలో అత్యంత ప్రభావంతమైన మహిళలు, లబ్ధిదారైన మహిళకు నాలుగేళ్లపాటు నాలుగు దఫాల్లో రూ.75 వేలు అందుతాయి. ప్రతి ఏటా రూ.18750లు అందుతాయి. ఇప్పటికే ఒక ఏడాది ఇచ్చాం, తర్వాత మూడు సంవత్సరాలు కూడా ఇస్తాం. ఈ డబ్బు గ్యారెంటీగా ప్రభుత్వం ఇచ్చే సొమ్ముగా బ్యాంకర్లు పరిగణలోకి తీసుకోవాలి. ఈ డబ్బు వారి జీవితాలను మార్చేందుకు ఉపయోగపడాలి. దీని కోసం అమూల్, అలానా, ఐటీసీ, ప్రాక్టర్ అండ్ గాంబల్, హెయూఎల్, రియలన్స్ లాంటి ప్రఖ్యాత సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం.
మహిళలకు నష్టం రాకుండా, వారి కాళ్లమీద వారు నిలబడేలా కార్యక్రమాలు రూపొందించాం. వారు ఎంపిక చేసుకున్న వ్యాపారాలకు బ్యాంకర్లు ముందుకు రావాలి. ఈ ప్రాజెక్టుకు బ్యాంకర్లు ముందుకు రావాలి, గట్టిగా మద్దతు పలకాలి. సమిష్టి కృషితో ముందుకు సాగాలి. చేయూత, ఆసరా మహిళలకు అండగా నిలబడ్డానికి గ్రామ, వార్డు స్థాయిల్లో కమిటీలను కూడా ఏర్పాటు చేశాం. ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పంపిణీకి షెడ్యూల్ ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటికే పంపిణీ ప్రారంభమైంది. ఆ షెడ్యూల్ ప్రకారం మహిళలకు సహాయం అదించేలా బ్యాంకర్లు కార్యాచరణ చేసుకోవాలి.
ప్రభుత్వాధికారులు కూడా షెడ్యూల్ ప్రకారం పంపిణీ జరిగేలా బ్యాంకర్లతో అనుసంధానం చేసుకోవాలి. స్వయం సహాయక సంఘాలు 2020–21 ఏడాదికి తమ ఖాతాల్లో రూ.7500 కోట్లు జమచేశాయి. కాని బ్యాంకులు ఇస్తున్న వడ్డీ కేవలం రూ.3 శాతం. కాని అదే బ్యాంకులు సుమారు 11 శాతం, 13 శాతం వడ్డీలు వసూలు చేస్తున్నాయి. సకాలానికి కట్టే రుణాలపై ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తున్న విషయాన్ని బ్యాంకులు పరిగణలోకి తీసుకోవాలి. మహిళలను మరింత చైతన్య పరిచేలా బ్యాంకులు ముందుకు వెళ్లాలని బ్యాంకర్లను కోరుతున్నా. ఇక కుటుంబంలో ఒక మహిళ తన కాళ్లమీద తాను నిలబడిగలిగితే.. ఆ కుటుంబం వృద్ధిలోకి వస్తున్నట్టే..
ఎంఎస్‌ఎంఈలకు అండగా నిలబడాలి. వారికి తోడ్పాటునందించాలి, అప్పుడే ఆర్థిక వ్యవస్థకూడా బాగుంటుంది. ప్రతి ఎంఎస్‌ఎంఈలో కనీసం 10 మంది జీవనోపాధి పొందుతున్నారు. వారికి సహాయం అందించడంలో, రుణాలు రీస్ట్రక్చర్‌లో సహాయం చేయాలి. లక్ష్యాలను చేరుకోవాలి. 2014 నుంచి పరిశ్రమలకు రాయితీల బకాయిలను సుమారు రూ.1100 కోట్లు చెల్లించాం. అలాంటే ఫిక్స్ కరెంటు ఛార్జీల విషయంలో కూడా ఆదుకున్నాం. బ్యాంకులనుంచి కూడా వారికి పూర్తి సహాయ సహకారాలు అందించాలి టిడ్కో ఇళ్లను వీలైనంత త్వరగా ప్రభుత్వం పూర్తిచేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2.69 లక్షల యూనిట్లను 2021 డిసెంబర్, 2022 డిసెంబర్‌లోనూ విడతలుగా పూర్తిచేస్తుంది. దీనికి బ్యాంకర్లు తమ వంతు సహకారం అందించాలని’’ సీఎం జగన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment