‘దేవుడు ఎలా ఉంటారో తెలీదు.. మీరు ప్రత్యక్ష దైవం అన్నా’ | CM YS Jagan Speaks To YSR Vahana Mitra Beneficiaries | Sakshi
Sakshi News home page

‘దేవుడు ఎలా ఉంటారో తెలీదు.. మీరు ప్రత్యక్ష దైవం అన్నా’

Published Tue, Jun 15 2021 4:58 PM | Last Updated on Tue, Jun 15 2021 8:14 PM

CM YS Jagan Speaks To YSR Vahana Mitra Beneficiaries - Sakshi

సాక్షి, అమరావతి: మూడో ఏడాది వైఎస్సార్‌ వాహన మిత్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ప్రారంభించారు. తన క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి సుమారు 2.48 లక్షల మంది లబ్దిదారులకు నేరుగా రూ. 248.47 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌తో లబ్ధిదారులు తమ స్పందన తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ పాలన, పథకాల గురించి మనస్పూర్తిగా మాట్లాడారు. ముఖ్యమంత్రికి వారు ధన్యవాదాలు తెలిపారు.

ఒక అన్న ఉంటే కూడా ఇంత చేయరు..
ఈ సందర్భంగా విశాఖనగరం గాజువాకకు చెందిన మహిళా ఆటోడ్రైవర్‌ పైడిమాత మాట్లాడుతూ ‘‘జగనన్నా.. నేను విశాఖ గాజువాకలో గత ఐదేళ్లుగా ఆటో నడిపించుకుంటూ బతుకుతున్నాను, రోజంతా నడిపితే మాకు వచ్చేది రెండు మూడు వందలు, దాంతో మా బతుకులు కష్టంగా ఉన్నాయి. మీరు పాదయాత్రలో చెప్పినట్లు ప్రతీ ఆటో కార్మికుడికి రూ. పది వేలు ఆర్ధిక సాయం చేశారు, మా ఆటో కార్మికుల అందరి తరపున మీకు ధన్యవాదాలు అన్నా. మేం ఏడాది పొడవునా ఎంత సంపాదించినా ఆటో మరమ్మత్తులు, ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్, పొల్యూషన్‌ ఇలా ఖర్చులు ఉంటాయి. మీరు ఇచ్చే ఈ పదివేలు మాకు చాలా పెద్ద విషయం. మాకు నిరుడు కూడా వచ్చాయి. దేవుడు ఎలా ఉంటారో తెలీదు కానీ మీరు ప్రత్యక్ష దైవం అన్నా.. మా ఆటోవాళ్ళ కుటుంబాలకు ఇబ్బంది లేకుండా మీరు ముందుగానే సాయం చేస్తున్నారు.

మేం ఇల్లూ, వాకిలి లేక అద్దె ఇంట్లో ఉన్న సమయంలో ఇళ్ళ పట్టా ఇచ్చారు. మా పిల్లలకు అమ్మ ఒడి వచ్చింది. పిల్లలకు అన్నీ ఇస్తున్నారు. మా అత్తగారు పెన్షన్‌ తీసుకుంటున్నారు. అమ్మకి కొడుకు ఉంటే ఇంత సాయం చేస్తారో లేదో కానీ మా అమ్మ కళ్ళలో ఆనందం చూశాం. చేయూత పథకం కింద రూ. 18, 750 మొదటి సారి తీసుకున్నారు. రేషన్‌ కోసం ఇబ్బంది పడుతుంటే ఇంటికే వచ్చి ఇస్తున్నారు. దిశ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేసి మా మహిళలకు రక్షణ నిచ్చారు. అభయ యాప్‌ ద్వారా ప్రతీ ప్రయాణికుడు గమ్యాన్ని సురక్షితంగా చేరుకుంటున్నారు. నాకు ఒక అన్న ఉంటే కూడా ఇంత చేయరు, నాకు అన్న లేరని బాధపడుతుంటే మీరు వచ్చి నాకు ఎంతో సాయం చేశారు, ఇది చాలన్నా, నేనే కాదు నాలా ప్రతీ ఆడవారు కూడా మీకు రుణపడి ఉంటారు. పుడితే ఆడపిల్లగానే పుట్టాలి, ఆంధ్రప్రదేశ్‌లో జగనన్న నాయకత్వంలో పెరగాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని ముగించగా.. స్పందించిన సీఎం వైఎస్‌ జగన్‌ ధ్యాంక్యూ అమ్మా, మీ మాటలు మరింత స్పూర్తినిస్తున్నాయి. దేవుని దయతో ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. ఆల్‌ ద బెస్ట్‌ తల్లి’’ అన్నారు.

ఇంటి పెద్ద కొడుకుగా సాయం చేస్తున్నారు..
వైఎస్సార్‌ జిల్లా కడపకు చెందిన ఆటోడ్రైవర్  నాగూరు నాగయ్య మాట్లాడుతూ, ‘‘అన్నా నేను వైఎస్సార్‌ వాహన మిత్ర లబ్దిదారుడిగా ఎంపికైనందుకు సంతోషంగా ఉంది. నాడు పాదయాత్రలో మీరు మాట ఇచ్చారు, మా కష్టాలు మీకు చెప్పగానే వెంటనే పెద్ద మనసుతో హమీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే వెంటనే ఇచ్చారు. కరోనా టైంలో కూడా నిరుడు రెండో విడత ఇచ్చారు. ఇప్పుడు కూడా మూడో విడత సాయం చేస్తున్నారు. నా జీవితంలో నేను రూ. 30 వేల సంపాదన చూడలేదు. నా జీవితంలో మర్చిపోలేను, ఆదాయం చాలక అప్పులు చేసే వాళ్ళం కానీ మీరు ఇచ్చే డబ్బుతో అప్పులు చేయాల్సిన అవసరం లేదు. మేం సంతోషంగా మా కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. మాకు అమ్మ ఒడి వచ్చింది. అలాగే మా అమ్మకు వైఎస్‌ఆర్‌ చేయూత కింద సాయం అందింది. మీరు ఇంటి పెద్ద కొడుకుగా సాయం చేస్తున్నారు.

నాన్న వైఎస్సార్‌ హయాంలో రిమ్స్‌ హాస్పిటల్‌ సమీపంలో ఇందిరానగర్‌లో మా అమ్మకు ప్లాట్‌ మంజూరు అయింది, అప్పుడు రూ. 60 వేల ఆర్ధిక సాయం చేశారు. ఆ డబ్బుతో ఇల్లు కట్టుకుని అదే ఇంట్లో కాపురం ఉంటున్నాం. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నా కుటుంబంలో అనేక సంక్షేమ పథకాలు పొందుతున్నాం, ఏపీలో ఆటో కార్మికులకు గతంలో విలువ లేదు కానీ మీరు సీఎం అయిన తర్వాత మా వెనక జగనన్న ఉన్నారు అనే మంచి మాట వినిపిస్తుంది. గతంలో ఈ వృత్తిలోకి ఎందుకు వచ్చాం అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఆటో ఫీల్డ్‌లోకి రమ్మని మేమే చెబుతున్నాం. మా కుటుంబం మీకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది అన్నా’’ అని అన్నారు.

చదవండి: వరుసగా మూడో ఏడాది వైఎస్సార్‌ వాహనమిత్ర 
థర్డ్‌వేవ్‌ హెచ్చరికలు: ఏపీ సర్కార్‌ ముందస్తు ప్రణాళిక

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement