పెత్తందారుల పిల్లలు మాత్రమే ఇంగ్లీష్‌ మీడియం చదవాలా?: సీఎం జగన్‌ | CM YS Jagan Speech In Yadlapalli Public Meeting | Sakshi
Sakshi News home page

పెత్తందారుల పిల్లలు మాత్రమే ఇంగ్లీష్‌ మీడియం చదవాలా?: సీఎం జగన్‌

Published Wed, Dec 21 2022 1:05 PM | Last Updated on Wed, Dec 21 2022 1:47 PM

CM YS Jagan Speech In Yadlapalli Public Meeting - Sakshi

సాక్షి, బాపట్ల జిల్లా: పెత్తందారీ భావజాలం చూస్తుంటే బాధనిపిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. యడ్లపల్లిలో ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, కొందరు పెత్తందారులు తమ పిల్లల్ని ఇంగ్లీష్‌ మీడియంలో చదివిస్తారు. పేద పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియం చదువులు చెప్పిస్తుంటే కోర్టులకు వెళతారు’’అని అన్నారు. నా పుట్టినరోజు గురించి కాదు.. పుట్టిన బిడ్డ గురించి ఆలోచన చేస్తున్నానన్నారు.

‘‘ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి స్వీకారం చుట్టబోతున్నాం. ఆర్థిక స్థోమత వల్ల పిల్లలను చదివించుకోలేని తల్లిదండ్రుల బాధలను చూశా.  తలరాతలు మారాలంటే చదువు ఒక్కటే మార్గం. పిల్లల భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 

ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ విప్లవానికి శ్రీకారం చుట్టాం. సమాజంలో ఉన్న అంతరాలు తొలగాలి. పేద విద్యార్థులకు ఇంగ్లీష్‌ మీడియం, డిజిటల్‌ విద్య అందకూడదనే పెత్తందారీ భావజాలం చూసి బాధ వేసింది. విద్యార్థులకు అందించే చదువులో సమానత్వం ఉండాలి. మంచి విద్యా విధానంతో పిల్లల తలరాతలు మారతాయి. భావి తరాల పిల్లల భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం. చదువులో సమానత్వం ఉంటేనే ప్రతి కుటుంబం అభివృద్ధి’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

‘‘తెలుగు, ఇంగ్లీష్‌, హిందీతో పాటు దాదాపు 8 భాషల్లో పాఠ్యాంశాలు ఉంటాయి. పిల్లలకు మరింత సులువుగా పాఠాలు అర్థమయ్యేలా ట్యాబ్‌లు అందిస్తున్నాం. క్లాస్‌ టీచర్‌ చెప్పే పాఠశాలకు ఈ ట్యాబ్‌లు సపోర్ట్‌గా ఉంటాయి. పిల్లలు మంచి పేరు తెచ్చుకోవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. నా సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో పేద తల్లిదండ్రుల కష్టాలను చూశాను. మూడున్నరేళ్లలో ఎక్కడా వెనకడుగు వేయలేదు’’ అని సీఎం అన్నారు.

‘‘పిల్లలకు నష్టం జరిగే కంటెంట్‌ను ట్యాబ్‌ల్లో తొలగించాం. విద్యార్థులకు ఇచ్చే ఒక్కో ట్యాబ్‌లో బైజూస్‌ కంటెంట్‌ విలువ రూ.32 వేలు.ట్యాబ్‌ల్లో బైజూస్‌ కంటెంట్‌ అప్‌లోడ్‌ చేసి అందిస్తున్నాం.రూ.686 కోట్ల విలువైన 5,18,740 ట్యాబ్‌లను ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. నెట్‌తో సంబంధం లేకుండా పాఠ్యాంశాలు చూసే వెసులుబాటు కల్పించాం’’ అని సీఎం పేర్కొన్నారు.
చదవండి: క్యాంప్‌ కార్యాలయంలో బర్త్‌డే వేడుకలు.. కేక్‌ కట్‌ చేసిన సీఎం జగన్‌ 

‘‘నా పుట్టిన రోజు నాడు నాకెంతో ఇష్టమైన చిన్నారుల భవిష్యత్తు కోసం చేస్తున్న మంచి కార్యక్రమంలో పలు పంచుకోవడం దేవుడు నాకిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. మన పిల్లలు అంటే.. మన తర్వాత కూడా ఉండే మనం. పిల్లలు బాగుండాలని తమకన్నా కూడా బాగా ఎదగాలని, తమకన్నా మంచిపేరు ఇంకా తెచ్చుకోవాలని, ప్రతి తల్లీదండ్రీకూడా మనసారా కూడా కోరుకుంటారు. అలా కోరుకునే అనేక హృదయాలు రకరకాల కారణాల వల్ల అంటే తమ కులం వల్లనో, ఆర్థిక స్తోమత కారణంగానో సరిగ్గా చదివించుకోలేకపోతున్నామని వారు భావించినప్పుడు వారి మనస్సులు తల్లిడిల్లిపోతాయి. దీన్ని స్వయంగా నేను చూశాను.’’ అని సీఎం అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement