![CM YS Jagan started construction of permanent buildings on JNTU Campus in a virtual manner - Sakshi](/styles/webp/s3/article_images/2020/08/18/dds.jpg.webp?itok=p-xtAaaG)
నరసరావుపేటలోని జేఎన్‌టీయూ క్యాంపస్ భవనాల నిర్మాణ పనులను క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభిస్తున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి, నరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేటలోని జేఎన్‌టీయూ క్యాంపస్ శాశ్వత భవనాల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తన క్యాంప్ ఆఫీస్ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా నరసరావుపేటలో శిలా ఫలకాలను ఆవిష్కరించారు. ప్రస్తుతం రూ.80 కోట్ల వ్యయంతో కళాశాల శాశ్వత భవనాల నిర్మాణం చేపడుతున్నామని, వచ్చే ఏడాది మరో రూ.40 కోట్లు మౌలిక సదుపాయాల కోసం వ్యయం చేస్తామని, నరసరావుపేట జేఎన్టీయూ కోసం మొత్తం రూ.120 కోట్లు వెచ్చిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే...
వెనుకబడ్డ పల్నాడుకు మేలు..
► నరసరావుపేట జేఎన్టీయూలో 2016లో ఫస్ట్ బ్యాచ్‌లో చేరిన విద్యార్థులు ఇప్పుడు ఫైనల్ ఇయర్‌కు వచ్చారు. వారికోసం కాలేజీ కట్టాలన్న ఆలోచన గత ప్రభుత్వం ఏనాడూ చేయలేదు. ఇప్పటిదాకా ప్రైవేట్ కాలేజీలు, ల్యాబుల్లో నడుపుతూ వచ్చారు.
ఈ పరిస్థితిని మారుస్తాం.
► వెనుకబడ్డ పల్నాడు ప్రాంతానికి మంచి చేయాలన్నది మా సంకల్పం. చిత్తశుద్ధితో చేపట్టిన ఈ కార్యక్రమమే అందుకు ఉదాహరణ.
► మొన్ననే 1,100 టీచింగ్ పోస్టుల భర్తీకి ఆదేశాలు ఇచ్చాం. ఆ పోస్టుల్లో నరసరావుపేట జేఎన్‌టీయూకు చెందినవీ ఉన్నాయి. యుద్ధ ప్రాతిపదికన భవనాల నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. ల్యాబులు కూడా అందుబాటులోకి తెస్తాం.
గత సర్కారు ఐదేళ్లు కాలయాపన
గత సర్కారు జేఎన్‌టీయూ భవనాలు కట్టకుండా ఐదేళ్లు కాలయాపన చేస్తే మీరు (సీఎం జగన్) వచ్చి నిధులిచ్చారు. పీజీ కళాశాల కూడా మంజూరు చేయాలని కోరుతున్నాం.
– ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
కాకాని వద్ద నిర్మాణం
► పల్నాడు రోడ్డులో ప్రస్తుతం జేఎన్‌టీయూను నిర్వహిస్తుండగా నరసరావుపేట మండలం కాకాని గ్రామం వద్ద శాశ్వత భవనాలు నిర్మించనున్నారు.
► స్థానిక లింగంగుంట్ల కాలనీ ఎన్‌ఎస్పీ స్థలంలో రూ.20 కోట్లతో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ ప్రభుత్వ వైద్యశాలను జిల్లా ఇన్‌చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రారంభించారు.
► సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉన్నత విద్యా శాఖకు చెందిన అధికారులతో పాటు యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. నరసరావుపేట నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుతోపాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కాసు మహేష్‌రెడ్డి, విడదల రజని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కలెక్టర్ శామ్యూల్, కళాశాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment