అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. దేశ భక్తిని, జాతీయ భావాన్ని పెంపొందించేలా పలు కార్యక్రమాలు రూపొందించామన్నారు.ఇందులో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు రాష్ట్రంలో 1.62 కోట్ల జాతీయ పతాకాలు ఆవిష్కరించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా న్యూఢిల్లీ నుంచి ఆదివారం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే..
‘మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం జగన్
దిగ్విజయం చేసేలా ఏర్పాట్లు
► పౌరుల్లో దేశ భక్తి భావనను పెంపొందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.
► హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి వివిధ విభాగాలతో పలుమార్లు సమీక్షలు నిర్వహించి, సమగ్ర కార్యాచరణ రూపొందించింది.
► ఈ కార్యక్రమం గురించి ప్రజలకు తెలియజెప్పడంలో భాగంగా పత్రికల్లో ప్రకటనలు, హోర్డింగ్స్, గీతాలు, పోస్టర్లు, సినిమా హాళ్లలో సంక్షిప్త చిత్రాల ప్రదర్శన, ర్యాలీలు, సైకిల్ ర్యాలీలు నిర్వహిస్తున్నాం.
► రాష్ట్రంలో పరిశ్రమలు, ఇతర సంస్థలు, దుకాణాలు, వాణిజ్య సముదాయాలు.. అన్నింటిపైనా జాతీయ పతాకాన్ని ఎగురవేసేలా వారిని చైతన్య పరిచాం. సీఎస్‌ఆర్ కార్యక్రమంలో భాగంగా వారి ఉద్యోగులకు జాతీయ పతాకాన్ని పంపిణీ చేయాలని నిర్దేశించాం. ప్రభుత్వ కార్యాలయాల వద్ద, ఇళ్ల వద్ద జాతీయ జెండా ఆవిష్కరించాలని అధికారులు, ఉద్యోగులకు చెప్పాం.
► 5.24 లక్షల రేషన్ దుకాణాలు, 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎగుర వేస్తున్నారు. అంగన్‌వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు కూడా వారి వారి కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగుర వేస్తారు.
► 1.20 లక్షల గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, 2.60 లక్షల మంది వలంటీర్లు జాతీయ జెండాలను పంపిణీ చేయడం ద్వారా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారు. 1.62 కోట్ల జాతీయ పతాకాలను ప్రతి ఇంటికీ, ప్రతి సముదాయానికి పంపిణీ చేస్తారు. ప్రతి ఇంటిపై, సముదాయంపై జాతీయ పతాకాన్ని ఎగరవేయడం ద్వారా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం.
► ఈ కార్యక్రమంలో సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మన్యం వీరుడు పుస్తకం ఆవిష్కరణ
‘హర్ ఘర్ తిరంగా’పై కేంద్ర మంత్రి అమిత్ షా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ‘మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు’ పుస్తకాన్ని, అల్లూరి చిత్రపటాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఏపీ భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ రేగుళ్ల మల్లికార్జునరావు ఈ పుస్తకాన్ని రచించారు.
Comments
Please login to add a commentAdd a comment