సాక్షి. విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం విశాఖపట్నానికి చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎన్ జగన్ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలతో భేటీ అయ్యారు. గంటపాటు కొనసాగిన ఈ సమావేశం ముగిసింది. సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన అనంతరం కార్మిక సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. ‘సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాటపై మాకు నమ్మకం ఉంది. ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై అందరూ కలిసికట్టుగా పోరాడాలి’ అని వారు పేర్కొన్నారు.
శారదా పీఠ వార్షికోత్సవం వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్
పెందుర్తి మండలం చినముషిడివాడలో శ్రీ శారదా పీఠం వార్షికోత్సవంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర స్వామి, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యే అదీప్ రాజ్ స్వాగతం పలికారు. శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న తొలి రోజు కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. నేటి నుంచి శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాలు ప్రారంభమవ్వగా.. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతిల ఆధ్వర్యంలో అయిదు రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి.
బుధవారం ఉదయం 7:30 గంటలకు స్వరూపానందేంద్ర సరస్వతి ఉత్సవాలకు అంకురార్పణ చేసి పీఠం ప్రాంగణంలోని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. దేశ రక్షణ, లోక కల్యాణార్థం రాజశ్యామల యాగం వేదోక్తంగా ప్రారంభమైంది. శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొన్న అనంతరం సీఎం జగన్ అక్కడ స్వామీజీలతో కలిసి గోపూజ, శమీవృక్షం ప్రదక్షిణలో పాల్గొంటారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment