సాక్షి, అమరావతి/విమానాశ్రయం (గన్నవరం): రాష్ట్ర నూతన గవర్నర్‌గా నియమితులైన సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాదర స్వాగతం పలికారు. జస్టిస్ అబ్దుల్ నజీర్, ఆయన కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి 8.15 గంటలకు ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.
జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను సీఎం జగన్ శాలువాతో సత్కరించారు. అనంతరం ఇంటర్నేషనల్ టెర్మినల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్దకు జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్ చేరుకున్నారు.
అక్కడ శాసన మండలి చైర్మన్ మోషెన్ రాజు, మంత్రి జోగి రమేశ్, ప్రభుత్వప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రేవు ముత్యాలరాజు, కృష్ణా జిల్లా కలెక్టర్ పి. రంజిత్‌బాషా, ఎస్పీ పి. జాషువా, విజయవాడ పోలీస్ కమిషనర్ టి.కె.రాణా, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, పలువురు న్యాయమూర్తులు జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు స్వాగతం పలికారు. అనంతరం విజయవాడలోని రాజ్‌భవన్‌కు చేరుకున్న జస్టిస్ అబ్దుల్ నజీర్, ఆయన కుటుంబ సభ్యులకు గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, ఇతర అధికారులు స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment