బద్వేలుకు రాలేకపోతున్నా: వైఎస్‌ జగన్‌ ఆత్మీయ లేఖ | CM YS Jaganmohan Reddy Letter To Badvel Constituency People Bypoll | Sakshi
Sakshi News home page

CM YS Jagan: బద్వేలుకు రాలేకపోతున్నా

Published Tue, Oct 26 2021 3:17 AM | Last Updated on Tue, Oct 26 2021 1:17 PM

CM YS Jaganmohan Reddy Letter To Badvel Constituency People Bypoll - Sakshi

సాక్షి కడప: బద్వేలు నియోజకవర్గంలోని అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు..అందరికీ నిండు మనసుతో హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఉప ఎన్నికల సందర్భంగా, నా కుటుంబ సభ్యులైన మీతో బద్వేలు వచ్చి గడపాలని, ప్రత్యక్షంగా మిమ్మల్ని బహిరంగసభ ద్వారా ఓట్లు అడగాలని భావించాను. కానీ కోవిడ్‌ నిబంధనలు, ఎన్నికల కమిషన్‌ నిబంధనల నేపథ్యంలో నేను ప్రత్యక్షంగా బద్వేలు రాలేకపోతున్నా. మిమ్మల్ని అక్కడికి వచ్చి ఓటు అడగలేకపోతున్నా. నేను ప్రత్యక్షంగా అక్కడికి వస్తే.. భారీగా మన అక్కచెల్లెమ్మలు ఒక్కసారిగా గుమికూడితే వారిలో ఏ కొందరికైనా కోవిడ్‌ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వారి ఆరోగ్యాలను, వారి ప్రాణాలను, వారి కుటుంబాలను దృష్టిలో ఉంచుకునే నా పర్యటన రద్దు చేసుకుంటున్నాను. ఈ పరిస్థితుల్లో నా భావాలను మీతో ప్రత్యక్షంగా పంచుకునేందుకు వీలుగా ఈ ఉత్తరం రాస్తున్నాను. 

నా కుటుంబ సభ్యులైన నా అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు అవ్వాతాతలకు.. మీ ఇంటిలోని వారికి వైఎస్సార్‌ ఆసరా, జగనన్న అమ్మ ఒడి,జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, వైఎస్సార్‌ రైతు భరోసా, వైఎస్సార్‌ సున్నా వడ్డీ (డ్వాక్రా) పథకాలు అందాయని తెలిసి సంతోషించాను. ప్రతి ఇంట్లో ప్రతి అవసరాన్ని మన అజెండాగా మార్చుకుని పాలన చేస్తున్నాం. మీ అవసరాలు తెలుసుకుని ఎన్నికల్లో వాగ్ధానం చేసినవే కాకుండా ఎన్నికల్లో వాగ్ధానం చేయని కొత్త పథకాలు కూడా అమలు చేస్తున్నాం. ఇది మన ప్రభుత్వం. ఇది మనందరి ప్రభుత్వం. మనందరి ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ బద్వేలు శాసనసభ ఉప ఎన్నికల్లో కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఫ్యాను గుర్తు మీదే ఓటు వేసి మన అభ్యర్థి దాసరి సుధ గారికి తిరుగులేని మెజార్టీతో అఖండ విజయం అందించాలని సవినయంగా మీ అందరినీ కోరుతున్నాను.

2019లో జరిగిన ఎన్నికల్లో వెంకట సుబ్బయ్యగారు బద్వేలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన అకాల మరణంతో వచ్చిన ఈ ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి శ్రీమతి దాసరి సుధ గారిని, డాక్టరమ్మను మన అభ్యర్థిగా నిలబెట్టాం. గతంలో శ్రీ వెంకటసుబ్బయ్య గారికి వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీతో శ్రీమతి దాసరి సుధ గారిని గెలిపించాలని.. పనిచేస్తున్న మనందరి ప్రభుత్వానికి, ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని కోరుకుంటున్నాను.  

ముందుగా రైతన్నల కోసం ఏం చేశాం అన్నది మీ ముందుంచుతున్నాను  
►రాష్ట్రంలో 18.70 లక్షల రైతులకు పగటిపూట 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తు ఇచ్చేందుకు ఇప్పటివరకు రూ. 18,000 కోట్ల మేరకు ఖర్చు  చేశాం.

►ప్రతి రైతుకూ పెట్టుబడి భరోసా ఇస్తూ యేటా రూ. 13,500 వైఎస్సార్‌ రైతు భరోసాగా అందిస్తున్నాం.

►విత్తనం నుంచి పంట అమ్మకం వరకు రైతుకు తోడుండే రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) మన గ్రామాల్లోనే ఏర్పాటు చేశాం.

►ఈ 28 నెలల కాలంలో వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా ద్వారా అక్షరాలా 31.07 లక్షల రైతులకు రూ. 3,788 కోట్లు అందించాం. వైఎస్సార్‌ సున్నా వడ్డీ ద్వారా 67.50 లక్షల రైతులకు మరో రూ. 1261 కోట్లు ఖర్చు చేశాం. రూ. 2000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధిని, రనూ. 3,000  కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం.

►గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ. 960 కోట్ల ధాన్యం సేకరణ బకాయిల్ని, గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన రూ. 9,000 కోట్ల విద్యుత్‌ బకాయిల్ని, గత ప్రభుత్వం వదిలేసిన రూ. 384 కోట్ల విత్తన బకాయిల భారాన్ని కూడా మనమే చిరునవ్వుతోనే మోశాం. 
కేవలం ఈ 28 నెలల్లోనే ఏం మార్పులు వచ్చాయో..ఎలాంటి మార్పులు వచ్చాయో ఒక్కసారి గమనించండి

►మన పిల్లల్లో నుంచి ప్రతి 2000 మందికి 12 శాశ్వత ఉద్యోగాలతో, అక్షరాలా 13 లక్షల శాశ్వత ఉద్యోగాలు కల్పించి...500కు పైగా సేవలతో ఒక గ్రామ/వార్డు సచివాలయం ఏర్పాటు ద్వారా పౌర సేవల్లో దేశంలోనే సరికొత్త విప్లవం తీసుకు వచ్చాం. 

►1వ తేదీ సూర్యోదయానికి ముందే అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువుల పింఛన్లు వారి తలుపుతట్టి మరీ ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా 2.7 లక్షల మంది వలంటీర్లు ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్లే వ్యవస్థ కేవలం మనకే సొంతం. 

మన పిల్లల చదువుల కోసం ఏం చేశామో చూడండి 
ఈరోజు బడిలో ఉన్న ప్రతి పాప, ప్రతి బాబు..ప్రతి ఒక్కరూ కనీసం డిగ్రీ లేదా ప్రొఫెషనల్‌ విద్యను ఒక హక్కుగా చదువుకునే వాతావరణం కల్పిస్తున్నాం. 
►గవర్నమెంటు స్కూళ్లను కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దే విధంగా మన బడి నాడు–నేడు ద్వారా రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్‌ పాఠశాలలు, కాలేజీల రూపురేఖల్ని మారుస్తున్నాం.  

►జగనన్న విద్యా కానుక ద్వారా గవర్నమెంటు స్కూళ్లలో పిల్లలకు కుట్టుకూలీతోసహా మూడు జతల యూనిఫాంలు, స్కూలు బ్యాగు, బైలింగ్యువల్‌ టెక్స్‌బుక్స్, నోట్‌ బుక్స్, వర్క్‌బుక్స్, బెల్టు, షూస్, సాక్సులు వీటితోపాటు డిక్షనరీ...ఇవన్నీ ఉచితంగా అందిస్తున్నాం.  

►వైఎస్సార్‌–జగనన్న కాలనీల ద్వారా అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. గృహ నిర్మాణం ద్వారా దాదాపు 1.25 కోట్ల మందికి అంటే రాష్ట్ర జనాభాలో నాలుగింట ఒక వంతు మందికి లబ్ధి చేకూరుతోంది.   

►దేశ చరిత్రలోనే తొలిసారిగా నామినేటెడ్‌ పదవుల్లో... నామినేషన్‌ కాంట్రాక్టుల్లో 50 శాతం కచ్చితంగా అక్కచెల్లెమ్మలకే ఇచ్చే విధంగా ఏకంగా చట్టం చేశాం.  

►అక్కచెల్లెమ్మల భద్రతకు టాప్‌ ప్రియారిటీ ఇస్తూ దిశ బిల్లు, దిశ పోలీసుస్టేషన్లు, దిశ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, దిశ యాప్‌లకు రూపకల్పన చేసిన ప్రభుత్వం మనది.  
బద్వేలు ఉప ఎన్నికల్లో మన పార్టీ నిలబెట్టిన దాసరి సుధమ్మకు తిరుగులేని మద్దతు పలకాలని అభ్యర్థిస్తున్నాను. ఫ్యాను గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజార్టీతో నా చెల్లెమ్మను గెలిపించాలని సవినయంగా కోరుతున్నాను. 

సామాజిక న్యాయానికి అర్థం చెబుతూ... 
►వైఎస్సార్‌ కాపు నేస్తం, వైఎస్సార్‌ మత్స్యకార భరోసా, వైఎస్సార్‌ నేతన్న నేస్తం, వైఎస్సార్‌ వాహనమిత్ర, జగనన్న తోడు, జగనన్న చేదోడు ద్వారా నిరుపేదలకు అండగా నిలుస్తున్నాం. అగ్రిగోల్డ్‌ బాధితులకు బాసటగా రూ. 905 కోట్లు రెండు విడతలుగా అందించాం.  

►మేనిఫెస్టోయే భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తామన్న మాటకు కట్టుబడి, అధికారంలోకి వచ్చిన 28 నెలల్లోనే 95 శాతం వాగ్దానాలు అమలు చేసిన పాలన మనది.  దేవుని దీవెనలు. మీ అందరి ఆశీస్సులతో గతంలో ఏ ప్రభుత్వం చేయనంతగా మంచి చేసిన ప్రభుత్వం మనది. మరింతగా మీ అందరికీ మంచి చేసేందుకు దేవుని దయ, మీ చల్లని దీవెనలు కోరుతున్నాను.  
 – వైఎస్‌ జగన్‌

(చదవండి: గెస్ట్‌ ‘హౌస్‌’ బాబు.. కుప్పంపై చంద్రబాబు కపటప్రేమ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement