సాక్షి, అమరావతి: బీసీ కులాల అభివృద్ధి దిశగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బలమైన బాటలు వేసింది. ఎన్నికల హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 139 బీసీ కులాలకు 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి పాలక మండళ్లను నియమించారు. 56 మంది చైర్మన్లలో 29 మంది మహిళలు కాగా 27 మంది పురుషులు ఉన్నారు. 672 మంది బీసీలకు డైరెక్టర్లుగా పదవులు దక్కాయి. ఎప్పుడూ లేని విధంగా బీసీ వర్గాలకు ఇన్ని పదవులు దక్కడంతో అన్ని జిల్లాల్లో పండుగ వాతావరణం నెలకొంది. దేశ చరిత్రలో ఇంతవరకు ఎవరూ ఇటువంటి సాహసోపేత నిర్ణయం తీసుకోలేదని, ఎన్నో ఏళ్లుగా బీసీ కులాలు కంటున్న కలలు నిజమయ్యాయని పేర్కొంటున్నారు.
బీసీల్లో ఎంతో మంది సంచార జాతుల వారున్నారు. ఇకపై వారంతా ప్రభుత్వ సాయాన్ని పొందేందుకు ఓ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి అదే కులానికి చెందిన వారిని చైర్మన్‌గా నియమించి భరోసా కల్పించింది. అతి తక్కువ జనాభా కలిగిన బీసీ కులాలు కూడా అందరితో సమానంగా ప్రయోజనం పొందేలా చర్యలు చేపట్టింది. బీసీల్లో కొన్ని కులాల జనాభా 500 లోపే ఉంది. మరికొన్ని కులాల గురించి పెద్దగా తెలియని పరిస్థితులు కూడా ఉన్నాయి. వీరందరికీ కార్పొరేషన్ల ద్వారా లబ్ధి చేకూరనుంది. కులాల ప్రాతిపదికన ఇంత పెద్ద సంఖ్యలో కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి.
50 శాతం మహిళా రిజర్వేషన్..
బీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో 13 జిల్లాలకు ప్రాతినిథ్యం దక్కింది. డైరెక్టర్లు, చైర్మన్లుగా నామినేటెడ్ పదవుల నియామకాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించారు. ఇచ్చిన మాట ప్రకారం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్లను అమలు చేయడంతో మహిళల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
2.71 కోట్ల మందికి రూ.33,500 కోట్లు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన 16 నెలల వ్యవధిలోనే 2,71,37,253 మంది బీసీల సంక్షేమం కోసం రూ.33,500 కోట్లు ఖర్చు చేసింది. బీసీల కోసం ఇంత భారీ స్థాయిలో ఖర్చు చేసిన ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు లేదు. బీసీలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికే దక్కింది.
కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక సాయం..
బీసీ కార్పొరేషన్ల ద్వారా సంక్షేమ ఫలాలు అందించేందుకు ఏడాదికి దాదాపు రూ.20 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. బీసీలకు అన్ని రకాల ఆర్థిక సాయాలను ఈ కార్పొరేషన్ల ద్వారా అందచేయాలని నిర్ణయించింది. లబ్ధిదారులకు డబ్బులు పంపిణీ చేసే అధికారాన్ని కూడా కార్పొరేషన్ ఎండీకి కల్పిస్తారు.
బీసీలకు బాసటగా..
Published Mon, Oct 19 2020 3:26 AM | Last Updated on Mon, Oct 19 2020 3:26 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment