ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ యూనిట్‌ ప్రారంభం..రోజుకు రెండున్నర టన్నుల రీసైక్లింగ్‌ | Commencement of plastic Recycling Unit In Visakhapatnam | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ యూనిట్‌ ప్రారంభం..రోజుకు రెండున్నర టన్నుల రీసైక్లింగ్‌

Published Mon, Dec 12 2022 1:58 PM | Last Updated on Mon, Dec 12 2022 3:20 PM

Commencement of plastic Recycling Unit In Visakhapatnam - Sakshi

మధురవాడ (భీమిలి): నగరంలోని మధురవాడ జోన్‌–2 పరిధిలోని కాపులుప్పాడ డంపింగ్‌ యార్డులో రోటరీ ఫౌండేషన్, రోటరీ క్లబ్‌లు, ఎన్‌జీవోలు, పలు సంస్థలు సహాయ సహకారాలతో ప్లాస్టిక్‌ వేస్ట్‌ రీసైక్లింగ్‌ ప్రాజెక్టును ఆదివారం సాయంత్రం రోటరీ ఇంటర్నేషనల్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌. స్టీఫెన్‌ ఉర్షిక్‌ ప్రారంభించారు.

రోటరీ క్లబ్‌ క్లబ్‌ ఆఫ్‌ లేక్‌ డిస్ట్రిక్ట్‌ మొయినాబాద్‌ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. దీనికి రోటరీ ఫౌండేషన్, ఆమెరికాలోని నేపర్‌ విల్లే, సన్‌రైజ్, అరోరా, డారియన్, బ్రాడ్లీబోర్బోనైస్, ఓక్‌ పార్క్‌ రివర్‌ ఫారెస్ట్, సోనోమా వ్యాలీ రోటరీ క్లబ్‌ సహకారం, భారతీ తీర్థ, నార్త్‌ సౌత్‌ ఫౌండేషన్‌ వంటి ప్రభుత్వేతర సంస్థలు, అరబిందో ఫార్మా ఫౌండేషన్, విహాన్‌ కియా వంటి సంస్థలు తమ సీఎస్‌ఆర్‌ నిధులు సమకూర్చాయి. ఈ ప్రాజెక్టు ఇండియా యూత్‌ ఫర్‌ సొసైటీ (ఐవైఎఫ్‌ఎస్‌) వంటి పర్యావరణ పరిరక్షణ రంగంలో చురుగ్గా పనిచేస్తున్న ఎన్‌జీవో ద్వారా అమలు చేయనున్నట్టు నిర్వాహకులు చెప్పారు. వివిధ ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ బాటిల్స్‌ను సేకరించి రోజుకు రెండున్నర టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు రీసైక్లింగ్‌ చేస్తున్నట్టు చెప్పారు. 

ఒక కిలోకి 60–70 బాటిల్స్‌ ఉంటాయన్నారు. ఈ వ్యర్థాలతో టూత్‌ బ్రష్‌లు, దువ్వెనలు, ప్లాస్టిక్‌ సంచులు తయారు చేస్తున్నట్టు తెలిపారు. దాదాపు అరెకరం విస్తీర్ణంలో ఈ ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ యూనిట్‌ను రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసి తాజాగా మొయినాబాద్‌ సహకారంతో ప్రారంభించినట్టు తెలిపారు. దీని ద్వారా ప్లాస్టిక్‌ వ్యర్థ రహిత విశాఖగా మారే అవకాశం ఉందన్నారు. 

రోటరీ ఇంటర్నేషనల్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌. స్టీఫెన్‌ ఉర్షిక్‌ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ రోటరీ 7 ప్రాధాన్యతల్లో  ఒకటని చెప్పారు. ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌కు అమెరికా, ఇండియాలతో రోటరీ ప్రతినిధులు కలిసి పనిచేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ ప్రాజెక్టు ఇక్కడ విజయవంతమైతే ప్రపంచంలో మరిన్ని చోట్ల ఆయా రోటరీ క్లబ్‌లతో కలసి అమలుకు కృషి  చేస్తామని చెప్పారు. 

పూర్వ రోటరీ ఇంటర్నేషనల్‌ ప్రెసిడెంట్‌ శేఖర్‌ మెహతా మాట్లాడుతూ రోటరీ గ్లోబల్‌ గ్రాంట్‌తో ఇండియా,అమెరికా క్లబ్‌ కలిసి పనిచేశాయన్నారు. తద్వారా మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. రోటరీ క్లబ్‌  లేక్‌ డిస్ట్రిక్ట్‌ మొయినా బాద్‌ ప్రెసిడెంట్‌ పతాంజలి రామ్‌ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ఇక్కడ బాటిల్‌ రీసైక్లింగ్‌ చేస్తుందని, భవిష్యత్‌లో మరిన్ని నిధులు వెచ్చించి వేరే రకాల ప్లాస్టిక్‌ కూడా రీసైక్లింగ్‌ చేసేవిధంగా రూపకల్పన చేస్తామన్నారు.

అరబిందో ఫార్మా చైర్మన్‌ రఘనాథన్‌ కన్నన్‌ మాట్లాడుతూ వేరే ప్రాంతాల్లో కూడా అమలు చేసే విదంగా ఈ ప్రాజెక్టులు డిజైన్, ప్లానింగ్‌ చేశామన్నారు. అలాగే యువత కూడా పర్యాటక ప్రదేశాల్లో ప్లాస్టిక్‌ వినియోగించిన అనంతరం సక్రమంగా డస్ట్‌బిన్స్‌లో వేయాలని సూచించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్‌ సెక్రటరీ నీరజ్‌ జెల్లి, ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ సునీల్‌ వడ్లమాని, సర్వీస్‌ ప్రాజెక్టు చైర్మన్‌ ఉదయ్‌ పిలానీ, ప్రాజెక్టు కో ఆర్డినేటర్‌ అంజు బ్రిజేష్, రోటరీ క్లబ్‌ అమెరికా ప్రతినిధి శ్రీ నమశ్శివాయం, రోటరీ క్లబ్‌ వైజాగ్‌ ఎలైట్‌ ప్రతినిధి రవీంధ్ర నాథ్‌ డొక్కా తదితరులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement