సాక్షి, విశాఖపట్నం: ఎటువంటి బాల్ నైనా కూల్‌గా బౌండరీ దాటించే ఈ కెప్టెన్ ఆటలో ఎపుడూ అసహనం కనిపించదు. లక్ష్యం వైపే గురి.. అవరోధాలను అవలీలగా అధిగమించి విజయం సాధించే గడుసరి. అపుడు క్రికెట్ కెప్టెన్‌గా – ఇపుడు సిటీ పోలీసు టీమ్ కెప్టెన్‌గా ఒకటే పనితీరు– కూల్.. కూల్. విధి నిర్వహణలో ఎలాంటి సమస్యనైనా– తనదైన స్టైల్‌లో సామరస్యంగా పరిష్కరించడం.. తప్పు జరిగితే తుప్పు వదిలించడం కూడా ఆయనకే సాధ్యం. కెరీర్ ‘సరిలేరు నీకెవ్వరూ’– అంటూ సాగుతున్న సిటీ పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా హృదయరాగం ఈ సండే స్పెషల్.
టర్నింగ్ పాయింట్
ప్రాథమిక స్థాయి నుంచే టాపర్‌గా ఉన్న ఆర్.కె.మీనా ఇంటర్ నుంచి కామర్స్ సబ్జెక్ట్‌పై ఆసక్తి పెంచుకున్నారు. కామర్స్‌లోనే ఇంటర్, డిగ్రీ, పీజీ (ఎం.కామ్) పూర్తి చేశారు. ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌గా ఉద్యోగం కూడా పొందారు. అలా ఢిల్లీలో ఉద్యోగం చేస్తూ.. జీవితం సాగిపోతున్న వేళ.. ఆయన మామయ్య భగవత్ ప్రసాద్ మీనా ఇచ్చిన సలహా సీపీ జీవితాన్నే మార్చేసింది. ఆర్.కె.మీనాకు సమస్యలపై స్పందించే గుణం ఉండడం, సామాజిక పరిస్థితులు, స్థితిగతులు, జనరల్ నాలెడ్జ్, సేవాతత్వం, రాజకీయ పరిణామాలపై ఆసక్తి ఉండటాన్ని ఆయన గమనించారు. ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారిగా ఆయన ప్రస్థానం ఆగిపోకూడదని భావించి.. ‘సివిల్స్ సాధించే సత్తా నీలో ఉంది.. సివిల్స్‌కు ప్రిపేర్ అవ్వు.. ఐపీఎస్ సాధించు‘ అని ఆర్.కె.మీనాకు సలహా ఇచ్చారు. ఆయన సలహానే ‘స్ఫూర్తిగా’ తీసుకుని సివిల్స్‌లో ఆర్.కె.మీనా ఉత్తమ ర్యాంక్ సాధించి ఐపీఎస్ అయ్యారు. ఉత్తమమైన పని తీరు కనబరుస్తూ.. అందరిచేత ప్రశంసలు పొందారు. అడిషనల్ డీజీగా పదోన్నతి పొందిన రాజీవ్‌కుమార్ మీనా విశాఖ సీపీగా తన ముద్ర వేసుకున్నారు.
కుటుంబ నేపథ్యం
ఆర్.కె.మీనా తల్లిదండ్రులు దప్పోదేవి మీనా, భగవాన్ సాహీ మీనా. అతని తండ్రి ప్రభుత్వ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు. తమ్ముడు ఢిల్లీలో ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. పెద్ద చెల్లి ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌గా, చిన్న చెల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలిగా ఉన్నారు. ఆయనది వ్యవసాయ ఆధారిత కుటుంబం. ఆర్.కె.మీనా తాతయ్యకు వ్యవసాయం అంటే ఇష్టం. అప్పుడప్పుడు ఈయన కూడా తాతకు వ్యవసాయంలో సాయం చేసేవారు. మీనాకు పశువుల పెంపకం అంటే ఇష్టం. ఉద్యోగ బాధ్యతలు చూసుకుంటూనే.. వాటి పెంపకం చేపడుతున్నారు.
విద్యాభ్యాసం
ఆర్.కె.మీనా సొంత గ్రామం రాజస్థాన్ రాష్ట్రం అల్వార్ పట్టణం. అల్వార్‌లోని ప్రభుత్వ నెహ్రూ పాఠశాలలో ఒకటి నుంచి 8వ తరగతి వరకు, 9వ తరగతి నుంచి 10 వరకు అల్వార్‌లోని ప్రతాప్ సెకండరీ స్కూల్, ఇంటర్ యశ్వంత్ హైయర్ సెకండరీ స్కూల్, డిగ్రీ, పీజీలు రాజ్ రిషి కళాశాలలో పూర్తి చేశారు. యు.కె.లోని బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఇన్ పబ్లిక్ అడ్మినిష్ట్రేషన్ చదివారు.
అనామికాతో కల్యాణం
ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారి పనిచేస్తున్న సమయంలోనే జైపూర్‌కు చెందిన అనామికా మీనాను సీపీ వివాహం చేసుకున్నారు. ఆమె ఎమ్మెస్సీ పూర్తి చేశారు. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం.
క్రికెట్, ఫుట్‌బాల్, రన్నింగ్ అంటే ఇష్టం
ఆర్.కె.మీనాకు అవుట్‌డోర్ గేమ్స్ అంటే చాలా ఇష్టం. చిన్నతనం నుంచి ఆయన ఎక్కువగా ఆటలు ఆడేవారు. స్కూల్, కాలేజీల్లో ఫుట్‌బాల్, క్రికెట్ జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించేవారు. పరుగుపందెంలో ఎన్నో బహుమతులు సాధించారు. హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణలో ఉన్నప్పుడు రన్నింగ్‌లో(10కె) మొదటి బహుమతి గెలుపొందారు.
తెలుగులో శ్రీరామదాసు సినిమా ఇష్టం
శ్రీ రామదాసు సినిమా అంటే చాలా ఇష్టం. అందులో హీరో నాగార్జున నటన చాలా బాగుంటుంది. సంగీతం కూడా అద్భుతం. నేను ఖమ్మం ఎస్పీగా ఉన్న సమయంలో ఆ సినిమా ఆడియో రిలీజ్ భద్రాచలంలో నాచేతుల మీదుగా జరిగింది ఈ సినిమా రిలీజ్ బెనిఫిట్ షోకి వెళ్లాను. సినిమా చూసిన వెంటనే హీరో నాగార్జునకి ..మూవీ బావుందని చెప్పాను.
ముంబై లాంటిది విశాఖ..
2014 సంవత్సరంలో 16వ బెటాలియన్ ఐజీగా పనిచేస్తున్నప్పుడు విశాఖజిల్లా ఆనందపురం మండలంలోని పేకేరు గ్రామాన్ని దత్తత తీసుకున్నాను. అప్పటి నుంచి విశాఖ నగరమంటే అమితమైన ప్రేమ. ఉద్యోగ జీవితంలో చాలా చోట్ల పని చేశాను. ...నాకు నచ్చిన ప్రాంతం విశాఖనగరం. ఇది ఓ అందమైన నగరం. దేశ ఆర్థిక రాజధాని ముంబై తరహా అన్ని వనరులున్న ఏకైక నగరం ఇది.
అంకుల్ సలహానే టర్నింగ్ పాయింట్
సామాజిక పరిస్థితులు, రాజకీయాలపై నాకున్న అవగాహన గమనించిన మామయ్య భగవత్ మీనా ప్రసాద్.. సివిల్స్ సాధించే సత్తా నాలో ఉందని స్ఫూర్తి నింపారు. ఆయన ఇచ్చిన సలహాలతోనే ఇన్‌కమ్ ట్యాక్ ఆఫీసర్‌గా ఉన్న నేను.. సివిల్స్‌కు ప్రిపేర్ అయి ఐపీఎస్ సాధించాను.
హిందీ సినిమాలు ఎక్కువగా చూస్తారు
ఆర్.కె.మీనా హిందీ సినిమాలు ఎక్కువగా చూస్తారు. అయితే ఇష్టమైన సినిమా మాత్రం రాజస్థానీ(హిందీ) మూవీ ‘ఖామోషీ’. హీరో సంజీవ్ కుమార్, హీరోయిన్ వహీదా రెహమాన్‌లకు ఆయన అభిమాని.
సమర్థ పనితీరుకు ప్రశంసలు
‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన ములుగుకు ఏఎస్పీగా తొలుత బాధ్యతలు స్వీకరించాను. తర్వాత నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబాబాద్, ఖమ్మంలో కూడా పనిచేశాను. అనంతరం యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్‌లో డైరెక్టర్‌గా కూడా విధులు నిర్వర్తించాను. ఆ సమయంలో సమర్థవంతమైన విధులు నిర్వహించినందుకు గానూ ప్రశంసలు పొందాను.
నా ఉద్యోగ జీవితంలో ఆ క్షణాలు మరిచిపోలేను’ అని సీపీ గుర్తు చేసుకున్నారు. తప్పుదారి పడుతున్న సమాజాన్ని సన్మార్గంలో నడిపించే నాయకులను ఆయన ఆరాధిస్తారు. సీపీకు బి.ఆర్.అంబేడ్కర్, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అంటే అమితమైన గౌరవం. అదే తరహాలో సమాజంలో మార్పునకు విశేష కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అంటే అభిమానం, ఇష్టమని సీపీ తెలిపారు.
బెస్ట్ ఫ్రెండ్ ఉమేష్
ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సమయంలో సహచర ఉద్యోగి ఉమేష్‌కుమార్‌తో ఆయనకు స్నేహం ఏర్పడింది. ఆర్.కె.మీనాకు బెస్ట్ ఫ్రెండ్ ఆయనే. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏదైనా సమస్య గానీ, ఆలోచన గానీ, సంతోషంగానీ కుటుంబ సభ్యుల తర్వాత ఆయనతోనే పంచుకుంటారు.
గ్రామాల దత్తత
ఆర్.కె.మీనా ఢిల్లీలో ఐటీ మంత్రికి పీఎస్‌గా పనిచేస్తున్న సమయంలో అల్వార్ మండలంలో రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఆ రెండు గ్రామాల్లో ప్రజలకు విద్య, వైద్య భవనాల నిర్మాణం, పిల్లల చదువులకు పుస్తకాలు, పాఠశాలకు సామగ్రి అందజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2014లో 16వ బెటాలియన్ ఐజీగా పని చేస్తున్నప్పుడు విశాఖ జిల్లాలో ఆనందపురం మండలంలోని పీకేరు గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.
యువతా మేలుకో..
‘చేతనైతే సాయం చేయి.. సాయం చేసే వారిని విమర్శించొద్దు’. అని ఆర్.కె.మీనా పిలుపునిస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో పేదలకు సాయం చేసిన దాతలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నారు. ‘సమయాన్ని వృథా చేసుకోకుండా.. నిజాయితీతో పనిచేయండి. కష్టపడి లక్ష్యాన్ని చేరుకోండి.. లక్ష్యసాధనలో గెలుపు మనదైతే.. పది మందికి సాయం చేసే స్థాయికి మనం ఎదుగుతాం’ అని ఆర్.కె.మీనా యువతకు
సూచిస్తున్నారు.
తల్లిదండ్రులు: దప్పో దేవి మీనా, భగవాన్ సాహి మీనా
భార్య: అనామికా మీనా
పిల్లలు: హర్షుల్ మేవాల్ (ఐఐటీ ఢిల్లీ), యశి్వన్ మేవాల్ (10వతరగతి, టింపనీ స్కూల్, విశాఖపట్నం)
ఇష్టమైన క్రీడ: ఫుట్‌బాల్, క్రికెట్, రన్నింగ్, బ్యాడ్మింటన్
ఇష్టమైన క్రికెటర్ : వినోద్ కాంబ్లీ
ఇష్టమైన సినిమా : ఖామోషీ (రాజస్థానీ మూవీ)
ఇష్టమైన హీరో: సంజీవ్ కుమార్
హీరోయిన్: వహీదా రెహమాన్
ఇష్టమైన ఆహారం: ఖీర్, దాల్‌బాటి, చుర్మా (రాజస్థానీ వంటకాలు)
ఇష్టమైన భాష: హిందీ, తెలుగు
ఇష్టమైన నగరాలు: విశాఖపట్నం, జైపూర్
ఇష్టమైన పుస్తకాలు: ప్రేమ్‌చంద్ చారిత్రక పుస్తకాలు హిందీలో ‘కర్మభూమి’
అలవాట్లు: ఉదయం వాకింగ్, వ్యాయామం చేయడం
అవార్డులు: ఇండియా పోలీస్ మెడల్ (ఐపీఎం)
Comments
Please login to add a commentAdd a comment