యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈవో మణిమేఖలై
228వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో వెల్లడి
ఏపీలో పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణ అద్భుతం: నాబార్డు డీఎండీ రావత్
డిజిటల్ కరెన్సీకి పైలెట్ ప్రాజెక్టుగా కాకినాడ, కృష్ణా జిల్లాలు: ఆర్‌బీఐ ఏపీ ఆర్‌ఆర్‌డీ ఏవో బషీర్
కౌలు రైతులకు ఉదారంగా రుణాలు మంజూరు చేయండి: మంత్రి అచ్చెన్నాయుడు
సాక్షి, అమరావతి: 2024–25 వార్షిక రుణ ప్రణాళిక కింద తొలి త్రైమాసికంలో జూన్ 30 నాటికి రాష్ట్రంలోని వివిధ వర్గాలకు ఆశించిన స్థాయిలో రుణాలు మంజూరు చేశామని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈవో ఏ మణిమేఖలై స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో 228వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం జరిగింది. పలువురు బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్న ఈ సమావేశంలో మణిమేఖలై మాట్లాడుతూ.. 2024–25 వార్షిక రుణ ప్రణాళిక కింద ప్రాధాన్యతా రంగాలకు రూ.3.75 లక్షల కోట్ల రుణాలు అందించాల్సి ఉండగా, తొలి త్రైమాసికంలో జూన్ 30 నాటికి రూ.1.36లక్షల కోట్లు (36శాతం) రుణాలు అందించామన్నారు.
అలాగే వ్యవసాయరంగానికి రూ.2.64లక్షల కోట్ల రుణాలు అందించాల్సి ఉండగా రూ.89,438 కోట్లు (34శాతం) ఇచ్చామని తెలిపారు. ఎంఎస్‌ఎంఈ రంగానికి 87వేల కోట్ల రుణాలు అందించాల్సి ఉండగా రూ.44వేల కోట్లు (51 శాతం) అందించామన్నారు. ప్రాధాన్యేతర రంగాలకు రూ.1.65లక్షల కోట్లు అందించాల్సి ఉండగా, 87,731 కోట్లు (53 శాతం) అందించినట్లు వివరించారు.
నాబార్డు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ జీఎస్ రావత్ మాట్లాడుతూ..ఏపీలో పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణ అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. ఆర్‌బీఐ ఏపీ రీజీయన్ రీజనల్ డైరెక్టర్ ఏవో బషీర్ మాట్లాడుతూ డిజిటల్ టాన్స్‌ఫర్మేషన్‌లో క్యూఆర్ కోడ్‌ను వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డిజిటల్ కరెన్సీకి సంబంధించి కాకినాడ, కృష్ణా జిల్లాల్లో పైలెట్‌ప్రాజెక్టుగా ఆర్బీఐ ప్రారంభించిందని తెలిపారు.
వ్యవసాయ శాఖమంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కౌలు రైతులకు రుణాలు అందించడంలో బ్యాంకులు మానవతా దృక్పథంతో ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఐదేళ్లలో 50లక్షల ఎకరాలను ప్రకృతి వ్యవసాయం కిందకు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించిందన్నారు. ఎంఎస్‌ఎంఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు బ్యాంకులు ముందుకు రావాలన్నారు.
తొలుత ఫైనాన్షియల్ లిటరసీపై రిజర్వు బ్యాంక్ ప్రచురించిన పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. కేంద్ర ఫైనాన్షియల్ సర్విసెస్ శాఖ కార్యదర్శి నాగరాజు మద్దిరాల, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీ రాజశేఖర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్, ఎస్‌ఎల్‌బీసీ కన్వినర్ సీవీఎన్ భాస్కరరావు, సిడ్బీ సీఎండీ మనోజ్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment