సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జనసేనతో జట్టు కట్టినా సరే వచ్చే ఎన్నికల్లో 2019 కంటే ఘోర పరాజయం తప్పదని టీడీపీ అగ్రనేతలకు అర్థమైంది. దీంతో వారు దిక్కుతోచని స్థితిలో పడిపోవడంతో టీడీపీ శ్రేణులు పూర్తిగా నీరుగారిపోయాయి. అందుకే రాజకీయంగా టీడీపీ ఉనికిని కాపాడేందుకు పచ్చదండు గురువు రామోజీరావు.. అభూతకల్పనలు, పచ్చి అబద్ధాలు రంగరించి వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురదజల్లుతూ రోజూ ‘ఈనాడు’లో తప్పుడు కథనాలు అచ్చేస్తున్నారు.
మంత్రులు, కీలక ఎమ్మెల్యేలపై ఆధారాలు లేకుండా రోతరాతలు రాస్తూ టన్నుల కొద్దీ విషం చిమ్మి.. వారి ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించడం నిత్యకృత్యమైపోయింది. ఇలాగైనా టీడీపీ శ్రేణుల్లో నైతిక స్థైర్యాన్ని నింపాలన్నది రామోజీ ఎత్తుగడ. అందుకే ఆదోని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్‌రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ‘ఆయనో భూచోడు’ శీర్షికన అడ్డగోలుగా తప్పుడు కథనాన్ని మంగళవారం ‘ఈనాడు’లో అచ్చేశారు. ఆ కథనంలోని ప్రతి అక్షరంలో ఎమ్మెల్యేపై రామోజీరావుకున్న అసూయ, ద్వేషం ప్రతిబింబిస్తోంది.
క్లీన్‌స్వీప్ లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ..
రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్ చేయడం ఖాయమని.. ప్రతిపక్ష టీడీపీ, జనసేన కలిసి పోటీచేసినా ఘోర పరాజయం తప్పదని పలు జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లో తేలింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలుచేయడం.. అర్హతే ప్రామాణికంగా అందరికీ సంక్షేమ పథకాలు అందించడం.. సుపరిపాలనతో విప్లవాత్మక మార్పులు తెచ్చిన సీఎం వైఎస్ జగన్‌కు రోజురోజూకూ ప్రజల్లో పెరుగుతున్న ఆదరణే వైఎస్సార్‌సీపీ తిరుగులేని విజయానికి బాటలు వేస్తాయని ఆ సర్వేలు విశ్లేషించాయి.
ఇక వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘సామాజిక సాధికార యాత్ర’, ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమాలకు ప్రజలు నీరాజనాలు పలుకుతుండటం.. టీడీపీ, జనసేన చేపట్టిన కార్యక్రమాలకు జన స్పందన కన్పించకపోవడంతో ప్రధానంగా ప్రతిపక్ష టీడీపీ దిక్కుతోచని స్థితిలో పడింది. ప్రజల ఆశీర్వాదం కోరుతూ 175కు 175 అసెంబ్లీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ దూసుకెళ్తుంటే.. అధిక స్థానాల్లో పోటీచేయడానికి కూడా అభ్యర్థులు దొరక్క చంద్రబాబుతోపాటు ఆ పార్టీ అగ్రనేతలు విలవిల్లాడుతున్నారు.
వైఎస్సార్‌సీపీ నేతలప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్రలు..
ఇక ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూలు రానుంది. మార్చిలో నోటిఫికేషన్ వెలువడుతుంది. ఇందుకు కేవలం మూడు నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని అర్థమవడంతో టీడీపీ అగ్రనేతలు ఎన్నికలకు ముందే కాడి దించేస్తున్నారు. ఇది ఆ పార్టీ శ్రేణుల్లో నైతిక స్థైర్యాన్ని పూర్తిగా దెబ్బతీసింది.
ఇలాగైతే టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమని ఆందోళన చెందుతున్న చంద్రబాబు.. దుష్టచతుష్టయంలోని తన గురువైన రామోజీరావుతో కలిసి ప్రభుత్వంతోపాటు మంత్రులు, వైఎస్సార్‌సీపీ కీలక ఎమ్మెల్యేలపై బురదజల్లుతూ ఈనాడులో క్షుద్ర రాతలను అచ్చేయడం ద్వారా వారి ప్రతిష్టను దెబ్బతీసేందుకు నిత్యం కుట్రలు చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రభుత్వంపై, మంత్రులపై, కీలక ఎమ్మెల్యేలపై విచ్చలవిడిగా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ విషం కక్కుతున్నారు.
మరోవైపు.. ఇదే అంశాన్ని ప్రతి సభలోనూ సీఎం వైఎస్ జగన్ ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నారు. పెత్తందార్ల ప్రయోజనాల కోసం పనిచేస్తున్న దుష్టచతుష్టయం కుట్రలను చిత్తు చేయాలంటూ ఇస్తున్న పిలుపునకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పాత్రికేయ విలువలకు వలువలు వదిలేసి.. టీడీపీ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే రామోజీరావు తప్పుడు కథనాలు అచ్చేస్తున్నారని ప్రజలు గ్రహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment