
సీఫేజ్ విన్యాసాల్లో అదరగొట్టిన నాలుగు దేశాలు
భారత్, యూఎస్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల పరస్పర సహకారం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా ఈ నెల 8న ప్రారంభమైన మలబార్–2024 విన్యాసాలు శనివారం ముగిశాయి. హార్బర్, సీ ఫేజ్‌లో మొత్తం రెండు దశల్లో విన్యాసాలు జరిగాయి. భారత నౌకాదళంతో పాటు యునైటెడ్ స్టేట్స్ నేవీ (యూఎస్‌ఎన్), జపాన్ మేరీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ (జెఎంఎస్‌డీఎఫ్), రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ (ఆర్‌ఏఎన్) నౌకాదళాలు సీ ఫేజ్‌లో నిర్వహించిన సముద్ర ఉపరితల, గగన తల విన్యాసాలు శత్రుదేశాలకు హెచ్చరికలు పంపినట్లుగా సాగాయి.
చివరి రోజున బంగాళాఖాతంలో యాంటీ సబ్ మెరైన్ వార్‌ఫేర్ ఆపరేషన్స్, క్రాస్‌డెక్ ల్యాండింగ్స్, సీమ్యాన్ షిప్ విన్యాసాలు జరిగాయి. విన్యాసాలు ఆద్యంతం అలరించాయి. అనంతరం నాలుగు దేశాలకు చెందిన ప్రతినిధుల సమక్షంలో ముగింపు సమావేశం జరిగింది. ఏ సమస్య వచ్చినా.. కలిసి ఎదుర్కొనేందుకు అవసరమైన సాంకేతికత, శిక్షణ, అవగాహన, సహకారం తదితర అంశాలపై కలిసి పనిచేయాలని తీర్మానిస్తూ.. మలబార్–2024కి వీడ్కోలు పలికారు.