ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాకు సమాధానమిచ్చేలా నాలుగు దేశాల ప్రణాళిక
నేటి నుంచి విశాఖలో మలబార్–2024 విన్యాసాలు
పాల్గొననున్న భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా
సాక్షి, విశాఖపట్నం: ఇండో పసిఫిక్ రీజియన్‌పై పట్టు సాధించేందుకు భారత్ దూకుడుగా వ్యవహరిస్తోంది. కొన్నేళ్లుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా కుటిలయత్నాలకు చెక్ చెప్పేందుకు భారత్ వేస్తోన్న ప్రతి అడుగూ విజయం దిశగా సాగుతోంది. మరోసారి హిందూ మహా సముద్రంతో పాటు పసిఫిక్ రీజియన్ విషయంలో జోక్యం చేసుకుంటే తిప్పలు తప్పవనే హెచ్చరికలు చైనాకు జారీ చేసేందుకు అగ్రరాజ్యాలన్నీ మలబార్–2024 విన్యాసాల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. నేటి నుంచి విశాఖలో ప్రారంభమవుతున్న విన్యాసాల్లో భారత్‌తో పాటు జపాన్, యూఎస్, ఆస్ట్రేలియా నౌకాదళాలు సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాయి.
8 నుంచి 18వ తేదీ వరకూ హార్బర్, సీ ఫేజ్‌ల్లో 2 దశల్లో విన్యాసాలు జరగనున్నాయి. ఇందులో భారత నౌకాదళం, యునైటెడ్ స్టేట్స్ నేవీ (యూఎస్‌ఎన్), జపాన్ మేరీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ (జేఎంఎస్‌డీఎఫ్), రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ (ఆర్‌ఏఎన్) నౌకాదళాలు పాల్గొంటున్నాయి. మలబార్–2024 ఎడిషన్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఈ దేశాలు సమగ్ర ప్రణాళికను రూపొందించాయి. ఇప్పటి వరకూ జరిగిన మలబార్లతో పోలిస్తే ఇది భిన్నంగా ఉంటుందని నేవీ వర్గాలు తెలిపాయి. హార్బర్ ఫేజ్‌లో భాగంగా 9న 4 దేశాల నౌకాదళ కీలకాధికారులు విశాఖలో సమీక్ష చేపట్టనున్నారు. దీనికి భారత్ నుంచి తూర్పు నౌకాదళాధిపతి రాజేష్ పెంథార్కర్ ప్రాతినిథ్యం వహించనున్నారు.
ఓపెన్ ఫ్రీగా ఇండో పసిఫిక్
ఇండో పసిఫిక్ రీజియన్‌లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం అవకుండా ఓపెన్ ఫ్రీగా మార్చాలన్నదే మలబార్ విన్యాసాల ప్రధాన ఉద్దేశం. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో పాటు మలబార్‌లోకి ఎవరు వచ్చినా సాదరంగా ఆహ్వానిస్తామని ఈ నాలుగు దేశాలూ ప్రకటించాయి. మలబార్ విన్యాసాల్లో భాగంగా..యాంటీ సబ్ మెరైన్ వార్‌ఫేర్ ఆపరేషన్స్, క్రాస్‌డెక్ ల్యాండింగ్స్, సీ మ్యాన్ షిప్ విన్యాసాలు జరగనున్నాయి. గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్లు, యుద్ధనౌకలు, జలాంతర్గాములు, ఫిక్స్‌డ్ వింగ్ ఎంఆర్‌లు, ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్సŠ, హెలికాప్టర్లతో సహా భారతీయ నావికాదళ ప్లాట్‌ఫారంలు పాల్గొంటాయి. ఆస్ట్రేలియా తరఫున ఎంహెచ్–60ఆర్ హెలికాప్టర్, పీ8 మారీటైమ్ పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్‌తో అంజాక్ క్లాస్ ఫ్రిగేట్ హెచ్‌ఎంఏఎస్ స్టువర్ట్ యుద్ధ నౌకను మోహరించింది. అమెరికా అర్లీ బర్క్–క్లాస్ డిస్ట్రాయర్ వార్‌షిప్ యూఎస్‌ఎస్ డ్యూయీనినీ రంగంలోకి దింపగా..మురసమే–క్లాస్ డిస్ట్రాయర్ జేఎస్ అరియాకేతో జపాన్ ఈ విన్యాసాల్లో పాల్గొంటోంది.
Comments
Please login to add a commentAdd a comment