malabar
-
సరికొత్త తూనీగ జాతి.. భలే వెరైటీగా ఉంది!
సన్నని వెదురు గొట్టం మాదిరిగా ఉండే సరికొత్త తూనీగ జాతిని కేరళలో పశ్చిమ కనుమల ప్రాంతంలో తాజాగా గుర్తించారు. దీని పొట్ట భాగం పొడవైన స్థూపాకృతిలో అచ్చం సన్నటి వెదురు గొట్టాన్ని తలపించేలా ఉంటుంది. అందుకే దీనికి అగస్త్యమలై బాంబూటెయిల్ (వెదురుతోక) అని పేరు పెట్టారు. దీని శాస్త్రీయనామం మెలనోనౌరా అగస్త్యమలైకా. ఇది మెలనోనౌరా జెనస్ కుటుంబానికి చెందినది. ఆ కుటుంబంలో వెలుగులోకి వచ్చిన రెండో జాతి ఇదని సైంటిస్టులు చెబుతున్నారు.ఈ తూనీగలు కేరళలో తిరువనంతపురం జిల్లాలో పెప్పర వణ్యప్రాణి సంరక్షణ కేంద్రంలో మంజడినిన్నవిల ప్రాంత పరిధిలో పుణెలోని ఎంఐటీ వరల్డ్ పీస్ వర్సిటీ, కేరళ క్రైస్ట్ కాలేజీ సైంటిస్టుల బృందం కంటబడ్డాయి. అనంతరం పొన్ముడి కొండల్లో కూడా వీటి ఉనికిని గుర్తించారు. మెలనోనౌరా కుటుంబంలో తొలి తూనీగ జాతిగా మలబార్ బాంబూటెయిల్ గుర్తింపు పొందింది. దాన్ని కూర్గ్–వయనాడ్ ప్రాంతంలో తొలుత గుర్తించారు.చదవండి: అడవిలో అమ్మప్రేమ.. జంతువులు, పక్షుల్లో అరుదైన మమకారం!వాటితో పోలిస్తే అగస్త్యమలై తూనీగ (Agasthyamalai Damselfly) జాతిలో దాదాపు 7 శాతం దాకా జన్యూపరమైన తేడాలున్నట్టు తేలింది. పొడవాటి నల్లని శరీరం, నీలిరంగు చారికలు దీని సొంతం. ఇంతటి జీవ వైవిధ్యానికి నిలయమైన పశ్చిమ కనుమలను మరింతగా సంరక్షించాల్సిన అవసరం ఎంతో ఉందని ఎంఐటీ వర్సిటీకి చెందిన డాక్టర్ పంకజ్ కోర్పడే అభిప్రాయపడ్డారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ముగిసిన మలబార్–2024 విన్యాసాలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా ఈ నెల 8న ప్రారంభమైన మలబార్–2024 విన్యాసాలు శనివారం ముగిశాయి. హార్బర్, సీ ఫేజ్‌లో మొత్తం రెండు దశల్లో విన్యాసాలు జరిగాయి. భారత నౌకాదళంతో పాటు యునైటెడ్ స్టేట్స్ నేవీ (యూఎస్‌ఎన్), జపాన్ మేరీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ (జెఎంఎస్‌డీఎఫ్), రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ (ఆర్ఏఎన్) నౌకాదళాలు సీ ఫేజ్‌లో నిర్వహించిన సముద్ర ఉపరితల, గగన తల విన్యాసాలు శత్రుదేశాలకు హెచ్చరికలు పంపినట్లుగా సాగాయి. చివరి రోజున బంగాళాఖాతంలో యాంటీ సబ్ మెరైన్ వార్ఫేర్ ఆపరేషన్స్, క్రాస్‌డెక్ ల్యాండింగ్స్, సీమ్యాన్ షిప్ విన్యాసాలు జరిగాయి. విన్యాసాలు ఆద్యంతం అలరించాయి. అనంతరం నాలుగు దేశాలకు చెందిన ప్రతినిధుల సమక్షంలో ముగింపు సమావేశం జరిగింది. ఏ సమస్య వచ్చినా.. కలిసి ఎదుర్కొనేందుకు అవసరమైన సాంకేతికత, శిక్షణ, అవగాహన, సహకారం తదితర అంశాలపై కలిసి పనిచేయాలని తీర్మానిస్తూ.. మలబార్–2024కి వీడ్కోలు పలికారు. -
విశాఖ తీరంలో కళ్లుచెదిరే విన్యాసాలు (ఫోటోలు)
-
విన్యాసాలు కాదు.. వార్నింగ్‌లే!
సాక్షి, విశాఖపట్నం: ఇండో పసిఫిక్ రీజియన్‌పై పట్టు సాధించేందుకు భారత్ దూకుడుగా వ్యవహరిస్తోంది. కొన్నేళ్లుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా కుటిలయత్నాలకు చెక్ చెప్పేందుకు భారత్ వేస్తోన్న ప్రతి అడుగూ విజయం దిశగా సాగుతోంది. మరోసారి హిందూ మహా సముద్రంతో పాటు పసిఫిక్ రీజియన్ విషయంలో జోక్యం చేసుకుంటే తిప్పలు తప్పవనే హెచ్చరికలు చైనాకు జారీ చేసేందుకు అగ్రరాజ్యాలన్నీ మలబార్–2024 విన్యాసాల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. నేటి నుంచి విశాఖలో ప్రారంభమవుతున్న విన్యాసాల్లో భారత్‌తో పాటు జపాన్, యూఎస్, ఆస్ట్రేలియా నౌకాదళాలు సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాయి.8 నుంచి 18వ తేదీ వరకూ హార్బర్, సీ ఫేజ్‌ల్లో 2 దశల్లో విన్యాసాలు జరగనున్నాయి. ఇందులో భారత నౌకాదళం, యునైటెడ్ స్టేట్స్ నేవీ (యూఎస్‌ఎన్), జపాన్ మేరీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ (జేఎంఎస్‌డీఎఫ్), రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ (ఆర్ఏఎన్) నౌకాదళాలు పాల్గొంటున్నాయి. మలబార్–2024 ఎడిషన్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఈ దేశాలు సమగ్ర ప్రణాళికను రూపొందించాయి. ఇప్పటి వరకూ జరిగిన మలబార్లతో పోలిస్తే ఇది భిన్నంగా ఉంటుందని నేవీ వర్గాలు తెలిపాయి. హార్బర్ ఫేజ్‌లో భాగంగా 9న 4 దేశాల నౌకాదళ కీలకాధికారులు విశాఖలో సమీక్ష చేపట్టనున్నారు. దీనికి భారత్ నుంచి తూర్పు నౌకాదళాధిపతి రాజేష్ పెంథార్కర్ ప్రాతినిథ్యం వహించనున్నారు.ఓపెన్ ఫ్రీగా ఇండో పసిఫిక్ఇండో పసిఫిక్ రీజియన్‌లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం అవకుండా ఓపెన్ ఫ్రీగా మార్చాలన్నదే మలబార్ విన్యాసాల ప్రధాన ఉద్దేశం. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో పాటు మలబార్‌లోకి ఎవరు వచ్చినా సాదరంగా ఆహ్వానిస్తామని ఈ నాలుగు దేశాలూ ప్రకటించాయి. మలబార్ విన్యాసాల్లో భాగంగా..యాంటీ సబ్ మెరైన్ వార్ఫేర్ ఆపరేషన్స్, క్రాస్‌డెక్ ల్యాండింగ్స్, సీ మ్యాన్ షిప్ విన్యాసాలు జరగనున్నాయి. గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్లు, యుద్ధనౌకలు, జలాంతర్గాములు, ఫిక్స్డ్ వింగ్ ఎంఆర్‌లు, ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్సŠ, హెలికాప్టర్లతో సహా భారతీయ నావికాదళ ప్లాట్‌ఫారంలు పాల్గొంటాయి. ఆస్ట్రేలియా తరఫున ఎంహెచ్–60ఆర్ హెలికాప్టర్, పీ8 మారీటైమ్ పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్‌తో అంజాక్ క్లాస్ ఫ్రిగేట్ హెచ్ఎంఏఎస్ స్టువర్ట్ యుద్ధ నౌకను మోహరించింది. అమెరికా అర్లీ బర్క్–క్లాస్ డిస్ట్రాయర్ వార్‌షిప్ యూఎస్ఎస్ డ్యూయీనినీ రంగంలోకి దింపగా..మురసమే–క్లాస్ డిస్ట్రాయర్ జేఎస్ అరియాకేతో జపాన్ ఈ విన్యాసాల్లో పాల్గొంటోంది. -
మలబార్ యుద్ధ విన్యాసాలు ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: ప్రతిష్టాత్మక 30వ మలబార్ యుద్ధ విన్యాసాలు జపాన్‌లో గురువారం ప్రారంభమయ్యాయి. జపాన్‌లోని యెకొసోకు సాగరతీరంలో ఈ నెల 15వ తేదీ వరకు నిర్వహించనున్న యుద్ధ విన్యాసాల్లో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన యుద్ధనౌకలు పాల్గొంటున్నాయి. ఇండో–పసిఫిక్ సముద్ర జలాల్లో స్వేచ్ఛ, ఓపెన్ నేవిగేషన్ వ్యవస్థలను పరిరక్షించడంతోపాటు ఈ ప్రాంతంలో ఆధిపత్యం కోసం చైనా కుటిల ప్రయత్నాలకు చెక్ చెప్పడమే ప్రధాన లక్ష్యంగా భారత నౌకాదళంతోపాటు యునైటెడ్ స్టేట్స్ నేవీ (యూఎస్‌ఎన్), జపాన్ మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ (జేఎంఎస్‌డీఎఫ్), రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ(ఆర్ఏఎన్) నౌకాదళం సంయుక్తంగా యుద్ధ విన్యాసాలను ప్రదర్శిస్తున్నాయి. ఇందులో భాగంగా యాంటీ సబ్ మెరైన్ వార్ఫేర్ ఆపరేషన్స్, క్రాస్‌డెక్ ల్యాండింగ్స్, సీమ్యాన్ షిప్ విన్యాసాలు ప్రదర్శిస్తాయి. భారతదేశం తరఫున ఐఎన్ఎస్ కమోర్తా, ఐఎన్ఎస్ శివాలిక్ యుద్ధ నౌకలు, మారిటైమ్ పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్లతోపాటు మెరైన్ కమాండోలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భారత నౌకాదళ ఈస్ట్రన్ ఫ్లీట్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండ్ రియర్ అడ్మిరల్ సంజయ్ భల్లా, యూఎస్ఏ నేవీ కమాండర్ వైస్ అడ్మిరల్ కార్ల్ థామస్, ఆస్ట్రేలియా ఫ్లీట్ కమాండర్ రియర్ అడ్మిరల్ జోనాథన్, జపాన్ ఫ్లీట్ కమాండర్ వైస్ అడ్మిరల్ యూసా హెడికీ పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఇండో పసిఫిక్ రీజియన్‌లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఓపెన్ ఫ్రీగా మార్చాలన్నదే మలబార్ విన్యాసాల ప్రధాన ఉద్దేశమని ఆయా దేశాల ప్రతినిధులు ప్రకటించారు. క్వాడ్ దేశాలతో (భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా) పాటు మలబార్‌లోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని వెల్లడించారు. భారత్–అమెరికాతో మొదలు... ఇండో–పసిఫిక్ సముద్ర జలాల్లో స్వేచ్ఛ, ఓపెన్ నేవిగేషన్ వ్యవస్థల పరిరక్షణ కోసం భారత్–అమెరికా నౌకాదళాలు సంయుక్తంగా 1992లో మలబార్ విన్యాసాలు ప్రారంభించాయి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం రెండు దేశాలు సంయుక్తంగా యుద్ధ విన్యాసాలు కొనసాగిస్తున్నాయి. ఈ రెండు దేశాలతో 2015లో జపాన్ కూడా చేరడంతో అప్పటి నుంచి మూడు దేశాలు పాల్గొంటున్నాయి. 2020లో రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ చేరడంతో ప్రస్తుతం నాలుగు దేశాల నౌకాదళాలు కలిసి యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. -
పులి లాంటి ఈ పుల్లటి పండు తింటే ఒబెసిటీ పరార్!
-
కొనసాగుతున్న మలబార్ విన్యాసాలు
దొండపర్తి(విశాఖ దక్షిణ): అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి భారత నౌకాదళం బంగాళాఖాతంలో నిర్వహిస్తున్న మలబార్ రెండో దశ విన్యాసాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు బుధవారం జరిగిన ప్రదర్శనలో భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ రన్విజయ్(డీ55), ఐఎన్ఎస్ సత్పుర (ఎఫ్ 48) నౌకలు పాల్గొన్నాయి. వీటితో పాటు యూఎస్ ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్ యూఎస్ఎస్ కారల్ విన్సన్, జపనీస్ హెలికాఫ్టర్ కారియర్ జేఎస్.. ఇలా తొమ్మిది యుద్ధనౌకలు ఈ విన్యాసాల్లో భాగస్వామ్యమయ్యాయి. యూఎస్ నేవీ ఆపరేషన్స్ చీఫ్ అడ్మిరల్ మైఖిల్ గిల్డే సతీసమేతంగా బుధవారం తూర్పు నావికాదళం ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా విశాఖకు వచ్చిన ఆయన తూర్పునావికాదళపతి వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్‌తో సమావేశమై పలు విషయాలపై చర్చించారు. -
మలబార్ సీఫేజ్ విన్యాసాలు ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: ప్రతిష్టాత్మక 25వ మలబార్–2021లో సీఫేజ్ విన్యాసాలు గురువారం ప్రారంభమయ్యాయి. అమెరికాలోని గువాన్ సముద్ర జలాల్లో నాలుగు దేశాలు సంయుక్తంగా ఈ విన్యాసాల్లో తమ సత్తా చాటాయి. భారత నౌకాదళంతో పాటు యునైటెడ్ స్టేట్స్ నేవీ (యూఎస్‌ఎన్), జపాన్ మారిటైమ్ సెల్ఫ్‌డిఫెన్స్ ఫోర్స్(జేఎంఎస్‌డీఎఫ్)తో పాటు రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ (ఆర్ఏఎన్) నౌకాదళం ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. ఈ విన్యాసాల్లో భారత యుద్ధనౌకలు ఐఎన్ఎస్ శివాలిక్, ఐఎన్ఎస్ కద్మత్‌తో పాటు పీ8ఐ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పీ8 ఎయిర్‌క్రాఫ్ట్ విన్యాసాలు, యాంటీ సబ్ మెరైన్ వార్ఫేర్ ఆపరేషన్స్, క్రాస్‌డెక్ ల్యాండింగ్స్, సీమ్యాన్ షిప్ విన్యాసాలు, వెపన్ ఫైరింగ్‌తో నౌకాదళాలు సత్తా చాటాయి. ఈస్ట్రన్ ఫ్లీట్ కమాండింగ్ ఫ్లాగ్ ఆఫీసర్ రియర్ అడ్మిరల్ తరుణ్‌సోబ్తి నేతృత్వంలో భారత బృందాలు విన్యాసాల్లో పాల్గొన్నాయి. ఈ నెల 29వ తేదీతో మలబార్ విన్యాసాలు ముగియనున్నాయని నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. -
యుద్ధ వాతావరణం.. నౌకా విన్యాసం!
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో జరుగుతున్న 24వ మలబార్ విన్యాసాలు బుధవారం రెండో రోజుకు చేరుకున్నాయి. భారత యుద్ధ నౌకలు మరోసారి తమ సత్తా చాటాయి. అండమాన్ సముద్ర జలాల్లో నిర్వహించిన విన్యాసాల్లో భారత నౌకాదళంతో పాటు యునైటెడ్ స్టేట్స్ నేవీ (యూఎస్‌ఎన్), జపాన్ మేరిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ (జెఎంఎస్‌డీఎఫ్)తో పాటు తొలిసారిగా రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ (ఆర్ఏఎన్)కి చెందిన నౌకలు చేసిన విన్యాసాలు యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ముఖ్యంగా భారత్‌కు చెందిన ఐఎన్ఎస్ రణ్విజయ్, ఐఎన్ఎస్ శివాలిక్, ఐఎన్ఎస్ శక్తి, ఐఎన్ఎస్ సుకన్యతో పాటు సింధురాజ్ సబ్మెరైన్లు సముద్ర జలాల్లో కలియ తిరుగుతూ అద్భుత ప్రదర్శన కనబర్చాయి. -
మలబార్ 2020 విన్యాసాలు
-
చైనాకు 'చెక్' లక్ష్యంగా..
సాక్షి, విశాఖపట్నం: ఇండో–పసిఫిక్ రీజియన్‌పై పట్టు సాధిస్తూ.. శత్రు దేశం చైనా కుటిల యత్నాలకు, దాని దూకుడుకు చెక్ చెప్పేందుకు భారత్ వేస్తున్న ప్రతి అడుగూ విజయం దిశగా సాగుతోంది. రెండున్నర దశాబ్దాలుగా భారత్, యూఎస్, జపాన్ దేశాలు కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మలబార్ యుద్ధ విన్యాసాల్లో ఈసారి రాయల్ ఆస్ట్రేలియా నౌకాదళం జత కలిసింది. మంగళవారం ప్రారంభమైన 24వ మలబార్ విన్యాసాల్లో పాల్గొనేందుకు నాలుగు దేశాల యుద్ధ నౌకలు బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవుల ఉత్తర సముద్ర తీరానికి చేరుకున్నాయి. ఈ నెల 6వ తేదీ వరకూ తొలి దశ యుద్ధ విన్యాసాలు జరగనున్నాయి. ఆ తరువాత ఇదే నెల 17 నుంచి 20వ తేదీ వరకూ మలబార్ రెండో దశ విన్యాసాలను అరేబియా సముద్రంలో నిర్వహించనున్నట్టు భారత నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. భారత నౌకాదళంతో పాటు యునైటెడ్ స్టేట్స్ నేవీ (యూఎస్‌ఎన్), జపాన్ మేరీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ (జెఎంఎస్‌డీఎఫ్)తోపాటు తొలిసారిగా రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ (ఆర్ఏఎన్) నౌకాదళం పాల్గొన్నాయి. కోవిడ్–19 నేపథ్యంలో తొలిసారిగా ‘నాన్ కాంటాక్ట్–ఎట్ సీ’ పద్ధతిలో విన్యాసాలు చేపట్టారు. ఇండో–పసిఫిక్ సముద్ర జలాల్లో స్వేచ్ఛ, ఓపెన్ నావిగేషన్ వ్యవస్థల్ని పరిరక్షించడం, ఈ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్న చైనా కుటిల యత్నాలకు చెక్ చెప్పడమే ప్రధాన లక్ష్యంగా ఈ కూటమి జత కట్టినట్టు ఆయా దేశాల నౌకాదళ వర్గాలు పరోక్ష హెచ్చరికలు జారీ చేశాయి. ఐఎన్ఎస్ రణ్విజయ్, ఐఎన్ఎస్ శివాలిక్, ఐఎన్ఎస్ శక్తి, ఐఎన్ఎస్ సుకన్యతో పాటు సింధురాజ్ సబ్మెరైన్లు భారత్ తరఫున విన్యాసాల్లో పాల్గొన్నాయి. యునైటెడ్ స్టేట్స్ నేవీకి చెందిన యూఎస్ఎస్ జాన్ మెక్‌కైన్, హెచ్‌ఎంఎఎస్ బలారత్, జపాన్‌కు చెందిన జేఎస్ ఒనామీతో పాటు రాయల్ ఆస్ట్రేలియన్ నేవీకి చెందిన యుద్ధ నౌకలు తొలి రోజు విన్యాసాల్లో కనువిందు చేశాయి. యాంటీ సబ్ మెరైన్ వార్ఫేర్ ఆపరేషన్స్, క్రాస్‌డెక్ ల్యాండింగ్స్, సీమ్యాన్ షిప్ విన్యాసాలతో సత్తా చాటాయి. నాలుగు దేశాల యుద్ధ నౌకలు సముద్ర జలాల్లో కలియ తిరుగుతూ.. విన్యాసాలకు తెర తీశాయి. భారత్–అమెరికా నౌకాదళాలు సంయుక్తంగా తొలిసారిగా 1992 నుంచి మలబార్ విన్యాసాలు ప్రారంభించాయి. 2015లో జపాన్ కూడా చేరడంతో అప్పటి నుంచి మూడు దేశాలు పాల్గొంటున్నాయి. తాజాగా రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ చేరడంతో.. ఈ సంఖ్య నాలుగుకు చేరింది. గతేడాది సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 4 వరకూ జపాన్ తీరంలో మలబార్ విన్యాసాలు నిర్వహించారు. -
నేటి నుంచి మలబార్–2020 ఎక్సర్సైజ్
దొండపర్తి (విశాఖ దక్షిణ): ఇండో–పసిఫిక్ సముద్ర ప్రాంతంలో సమన్వయాన్ని పెంపొందించడానికి భారత నావికాదళం తన సముద్ర మిత్ర దేశాలతో కలిసి మంగళవారం నుంచి జరిగే మలబార్–2020 ఉమ్మడి నావికాదళ వ్యాయామంలో పాల్గొననుంది. 2 దశల్లో జరగనున్న ఈ ఎక్సర్సైజ్లో యూఎస్ నేవీ (యూఎస్‌ఎన్), జపాన్ మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ (జేఎంఎస్‌డీఎఫ్), రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ (ఆర్ఏఎన్)లతో కలిసి సంయుక్తంగా భారత నావికాదళం సముద్రంలో కసరత్తులు చేయనుంది. మలబార్–2020 మొదటి దశ ఈనెల 3 నుంచి 6 వరకు విశాఖ తీరంలో జరగనుంది. -
మళ్లీ సరికొత్తగా ‘క్వాడ్’
పదమూడేళ్లనాటి జపాన్ ప్రతిపాదన అనేకానేక మలుపులు తిరిగి చివరకు సాకారం కాబోతోంది. చతుర్భుజ కూటమి (క్వాడ్) దేశాల ఆధ్వర్యంలో బంగాళాఖాతంలోని మలబార్ సాగర జలాల్లో వచ్చే నెలలో నిర్వహించబోయే నావికా దళ విన్యాసాలకు మన దేశం ఆస్ట్రేలియాను సోమవారం ఆహ్వానించింది. చైనాకు సహజంగానే ఇది ఆగ్రహం కలిగించే చర్య. క్వాడ్ పురుటి నొప్పులు అన్నీ ఇన్నీ కాదు. 2007లో మొదట ఈ ప్రతిపాదన మొగ్గతొడిగి భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లు సమావేశమైనప్పుడే చైనా ఉరిమింది. తనకు వ్యతిరేకంగానే కూటమి కడుతున్నారంటూ నాలుగు దేశాలకూ దౌత్యపరమైన నిరసనలు తెలియజేసింది. అయితే చైనా భయాందోళనలు వాస్తవం కాదని, కేవలం పరస్పరం ప్రయోజనం వున్న అంశాలపై పనిచేయడమే కూటమి ఆంతర్యమని జపాన్ చెప్పింది. మన దేశం కూడా ఆ మాటే అంది. జపాన్‌తో తమకున్న వాణిజ్య ఒప్పందానికి అనుబంధంగా ఈ భద్రతా ఒప్పందం అవసరం గనుకే ఇందులో చేరామని తెలిపింది. కూటమి ఆధ్వర్యంలో టోక్యోలో 2007 మే నెలలో తొలి నావికాదళ విన్యాసాలు జరిగాయి. దానికి కొనసా గింపుగా బంగాళాఖాతంలోనూ విన్యాసాలు నిర్వహించారు. తీరా జపాన్‌లో షింజో అబే అధికారం కోల్పోయి ఆయన స్థానంలో టారో అసో వచ్చాక క్వాడ్‌లో కొనసాగదల్చుకోలేదని ప్రకటించారు. అటు ఆస్ట్రేలియాలో కూడా 2008లో జాన్ హోవార్డ్ నిష్క్రమించి కెవిన్ రుడ్ రావడంతో ఆ దేశం కూడా క్వాడ్‌కు మొహం చాటేసింది. అదే ఏడాది అప్పటి చైనా అధినేతలు మన దేశంలో పర్యటించబోతుండగా నాటి మన ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ‘చైనాను కట్టడి చేసే ఎలాంటి కూట మిలోనూ భారత్ భాగస్వామ్యం కాబోద’ని ప్రకటించారు. అలా ముగిసిన ముచ్చట కాస్తా అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ వచ్చాక మళ్లీ కదలబారింది. ఆయన మళ్లీ అందరితో మాట్లాడి ఒప్పిం చాక 2017లో క్వాడ్ చర్చలు మొదలయ్యాయి. అప్పటికి దక్షిణ చైనా సముద్ర జలాల్లో చైనా కార్య కలాపాలు పెరిగాయి. అక్కడ పగడాల దిబ్బలు, ఇసుకమేటలు తమవేనని చైనా ప్రకటించి, స్ప్రాట్లీ దీవుల చుట్టూ ఏడు కృత్రిమ దీవుల నిర్మాణాన్ని ప్రారంభించింది. ఇది జపాన్ను చికాకు పర్చడం, ఆ దేశానికి అమెరికా అండగా నిలవడంతో క్వాడ్ మళ్లీ ప్రాణం పోసుకుంది. అయితే మునుపటిలా కాదు... క్వాడ్ ఈసారి గట్టిగా పనిచేయదల్చుకున్నట్టే కనబడుతోంది. ఎప్పుడూ ఏదో ఒక శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా తప్ప ప్రత్యేకించి కూటమి కోసమే సమా వేశాలు జరిగిన చరిత్ర క్వాడ్‌కు లేదు. కలిసేది నాలుగు దేశాలైనా ‘ఆసియాన్’ సమావేశాల సమ యాల్లో లేదా ఐక్యరాజ్యసమితి సమావేశాల సమయాల్లో మాత్రమే నేతలు కలిసేవారు. కానీ ఈసారి అందుకు భిన్నంగా జరిగింది. గత నెలాఖరులో క్వాడ్ దేశాల సీనియర్ అధికారుల సమావేశం జరి గింది. ఆ వెనకే ఈ నెల మొదట్లో విదేశాంగమంత్రులు సమావేశమయ్యారు. మలబార్ విన్యాసాలపై ఆ సమావేశంలో అంగీకారం కూడా కుదిరింది. కానీ ఆస్ట్రేలియా అందులో పాల్గొనడం విషయంలో కొంత సందిగ్ధత ఏర్పడింది. కానీ వారం రోజుల అనంతరం చివరకు ఆస్ట్రేలియాను ఆహ్వానిం చడానికే మన దేశం నిర్ణయించింది. చైనాకు ఆగ్రహం కలిగినంత మాత్రాన క్వాడ్ నాటో తరహాలో ఇప్పటికప్పుడు సైనిక కూటమిగా రూపొందుతుందని భావించనవసరం లేదు. అటు అధికారుల సమావేశంలోనూ, ఇటు విదేశాంగమంత్రుల సమావేశంలోనూ ప్రధానంగా చర్చకొచ్చింది కరోనా అనంతర పరిస్థితుల గురించే. అలాగే ఇకపై ప్రపంచ పంపిణీ వ్యవస్థ తీరుతెన్నులెలా వుండాలో, సభ్య దేశాలు సమష్టిగా కదిలి ఆర్థికంగా ఎదగడానికి చేయాల్సిందేమిటో కూడా చర్చించారు. మరో మూడు దేశాలు– న్యూజిలాండ్, దక్షిణ కొరియా, వియత్నాంలు కూడా పాలుపంచుకున్నాయి. కనుక క్వాడ్ త్వరలో మరింత విస్తరించడం ఖాయం. అయితే ‘అమెరికా ఫస్ట్’ పేరిట మిత్ర దేశాలపై కూడా రకరకాల ఆంక్షలు విధిస్తూ స్వీయ ప్రయోజనాలు తప్ప మరేమీ పట్టని ట్రంప్‌ను నమ్మి ఇందులో దిగడం ఎంతవరకూ సమంజసమన్న సంశయం ఈ దేశాలకు లేకపోలేదు. ఆసియాన్‌తో మన దేశానికి సంబంధబాంధవ్యాలు ఏర్పడి అర్థ శతాబ్ది దాటుతోంది. చారిత్రకంగా ఆ దేశాలు అమెరి కాతో సన్నిహితంగా మెలిగేవి. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అందుకే వాటితో మన సంబంధాలు అంతంతమాత్రం. ఇప్పుడు ఆ బంధాలు బలపడ్డాయి. ప్రస్తుతం ఆసియాన్ మరిన్ని దేశాలను కలుపుకొని విస్తరించాలనుకుంటోంది. ఇదే సమయంలో తనకు సమాంతరంగా ఈ ప్రాంతంలో క్వాడ్లాంటి మరో కూటమి మొగ్గతొడుగుతుండటం, అది సైతం విస్తరించాలనుకోవటం ఆసి యాన్‌కు సమస్యే. ఈ వైరుధ్యాన్ని మన దేశం ఎలా పరిష్కరించుకుంటుందో చూడాలి. లద్దాఖ్‌లో చైనాతో మనకు ఏర్పడిన లడాయి, ఆ దేశం అనుసరిస్తున్న మొండివైఖరి మలబార్ విన్యాసాలకు ఆస్ట్రేలియాను ఆహ్వానించాలన్న మన నిర్ణయానికి కారణం కావొచ్చు. కానీ క్వాడ్‌ను పరస్పర ఆర్థిక, వాణిజ్య, భద్రతాపరమైన ప్రయోజనాలకు అనువుగా రూపొందించాలి తప్ప అమె రికా కనుసన్నల్లో నడిచే మరో నాటో కూటమిగా దాన్ని మార్చనీయకూడదు. నాటో కూటమివల్ల యూరప్ కంటే అమెరికాయే ఎక్కువగా లాభపడింది. ప్రపంచ పోలీస్‌గా వ్యవహరిస్తూ, సమస్యా త్మక ప్రాంతాలకు ఆ కూటమి సైన్యాన్ని తరలిస్తూ ప్రపంచంపై తన పట్టు నిలుపుకోవడంలో అది విజయం సాధించింది. అయితే సైనిక కూటమిగా మారకపోవడం చైనా చర్యలపై కూడా ఆధార పడివుంటుంది. వుహాన్ శిఖరాగ్ర సదస్సు అనంతరం క్వాడ్ విషయంలో మన దేశం ఆచితూచి వ్యవహరించింది. చైనాకు ఇబ్బంది కలిగించవద్దన్నదే దాని వెనకున్న ఉద్దేశం. కానీ అంతక్రితంనుంచీ దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో చూపిస్తున్న దూకుడునే గల్వాన్ లోయలో కూడా ప్రదర్శించి తాజా నిర్ణయానికి చైనా ప్రధాన కారణమైంది. ఏదేమైనా క్వాడ్ మళ్లీ ప్రాణం పోసుకోవడం ప్రపంచంలో రానున్న కాలంలో సరికొత్త పరిణామాలకు దారితీస్తుందనటంలో సందేహం లేదు. -
మలబార్ డ్రిల్‌లో ఆస్ట్రేలియా
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం రగులుతున్న నేపథ్యంలో ఇదొక అత్యంత కీలక పరిణామం. కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు చెక్ పెట్టడానికి భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు ఒక్కతాటిపైకి వస్తున్నాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో నవంబర్‌లో జరగనున్న మలబార్ విన్యాసాల్లో అమెరికా, జపాన్‌తోపాటు ఆస్ట్రేలియా పొల్గొంటుందని భారత్ సోమవారం ప్రకటించింది. ఉమ్మడి శత్రువైనా చైనాకు వ్యతిరేకంగా భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు చతుర్భుజ కూటమి(క్వాడ్) పేరిట జట్టు కట్టిన సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం జరిగే ఈ విన్యాసాల్లో భారత్, అమెరికా, జపాన్ నావికా దళాలు పాల్గొనడం పరిపాటి. తాజాగా ఇందులో ఆస్ట్రేలియా కూడా చేరింది. క్వాడ్‌లోని నాలుగు సభ్య దేశాలు సైనిక స్థాయిలో ఒకే వేదికపైకి రానుండడం ఇదే మొదటిసారి. తూర్పు లద్దాఖ్‌లో భారత్‌లో చైనా తరచుగా ఘర్షణకు దిగుతున్న నేపథ్యంలో నాలుగు దేశాల డ్రిల్ ప్రాధాన్యం సంతరించుకుంది. దీని ద్వారా చైనాకు బలమైన హెచ్చరికలు పంపినట్లవుతుందని నిపుణులు చెబుతున్నారు. మలబార్ ఎక్సర్సైజ్ ద్వారా నాలుగు దేశాల నావికా దళాల మధ్య సహకారం మరింత పెరుగుతుందని భారత రక్షణశాఖ పేర్కొంది. -
ఇండో పసిఫిక్ మెగా నేవీ డ్రిల్
వాషింగ్టన్ : మలబార్ నావికాదళ విన్యాసాలలో పొల్గొనేందుకు భారత్ ఆస్ర్టేలియాను ఆహ్వానించాలని యోచిస్తోంది. ఈ అంశానికి సంబంధించి రాబోయే రెండు వారాల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో క్వాడ్ సభ్యులతో పాటు కాన్బెర్రా పాల్గొనడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, పరస్పర ప్రయోజనాలను కాపాడుకోవచ్చని అమెరికాకు చెందిన దౌత్యవేత్త స్టీవెన్ బీగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 1992 లో ప్రారంభమైన వార్షిక నావికాదళ విన్యాసాల్లో భాగంగా భారత్, జపాన్, అమెరికా పాల్గొంటుండగా తాజాగా ఆస్ర్టేలియా కూడా ఇందులో పాలుపంచుకోనుంది. కాగా 2015లో జపాన్ ఈ క్వాడ్‌లో శాశ్వత సభ్యుదేశంగా మారిన సంగతి తెలిసిందే. ఇండో-పసిఫిక్‌లో శాంతి, సుస్థిరితను నెలకొల్పాలనే లక్ష్యంతో క్వాడ్‌ను ఏర్పాటు చేశారు. (దక్షిణ చైనా సముద్రంలో అమెరికా యుద్ధ విన్యాసాలు ) ప్రపంచ వ్యాప్తంగా ఇండో- పసిఫిక్ దేశాలతో అమెరికా సహకారం ఎప్పుడూ ఉంటుందని, ఆసియా దేశాలతో కలిసి పనిచేస్తున్నామని స్టీవెన్ బీగన్ అన్నారు. 'తమ విధానం నాలుగు స్తంఢాలపై నిలుస్తుంది. మొదటిది ఐక్యత, రెండోది మా మిత్రదేశాలతో భాగస్వామ్యం, మూడివది సైనిక నిరోధకత, చివరిగా నాలుగవది చైనాకు శక్తివంతమైన ఆర్థిక ప్రత్యామ్నాయం' అని స్టీవెన్ బీగన్ వెల్లడించారు. దక్షిణ చైనా సముద్రం చుట్టుపక్కల ఉన్న ఆయిల్, గ్యాస్ నిల్వలపై కన్నేసే ఇతర దేశాలతో చైనా గొడవపడుతోందని అమెరికా గతంలో ఆరోపించింది. దక్షిణ చైనా సముద్రంలో ఉన్న ఆయిల్, గ్యాస్ నిల్వల్లో 90 శాతం తనదేననేది చైనా వాదన. దీనిపై బ్రూనై, ఫిలిప్పీన్స్, మలేసియా, తైవాన్, వియత్నాం దేశాలు అభ్యంతరం చెబుతున్నాయి. తమకూ ఈ సహజ నిల్వలపై హక్కు ఉందంటున్నాయి. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కూడా దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ప్రాంతంలో చైనా తన ప్రాదేశిక ఆశయాల కోసం ప్రయత్నిస్తోందని ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్ దేశాలతో సత్సంబంధాలు మరింత బలోపేతం అవుతున్నాయని స్టీవెన్ పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ('గ్లోబల్ కామన్స్‌లో ఇది కూడా ఒక భాగమే' ) -
చైనాకు ఇదో సమాధానం
న్యూఢిల్లీ: మలబార్ విన్యాసాల పేరుతో అమెరికా, భారత్, జపాన్ల నావికాదళాలు నిర్వహిస్తున్న కసరత్తులు చైనాకు ఓ సమాధానమని అమెరికా కమాండర్ రియర్ అడ్మిరల్ విలియం బైర్న్ జూనియర్ అన్నారు. విన్యాసాలు జరుగుతున్న ఐఎన్ఎస్ జలశ్వలో మీడియాతో మాట్లాడుతూ.. ఐదు రోజుల పాటు జరిగే మలబార్ విన్యాసాలు మూడు దేశాల మధ్య వ్యూహాత్మక రక్షణ విధానాన్ని మరింత పెంపొందిస్తాయని తెలిపారు. యావత్ ప్రపంచానికి ఈ విన్యాసాలు ఒక సమాధానమని ఆయన అన్నారు. భారత్, చైనా, భూటాన్‌ల సరిహద్దుల్లోని ట్రైజంక్షన్‌లో వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఈ నావికాదళ విన్యాసాలు కీలక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే విన్యాసాలకు, ఉద్రిక్తతలకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఏడాది ముందే వీటి నిర్వహణకు ప్రణాళిక రూపొందించామని భారత నావికాదళ అధికారులు స్పష్టం చేశారు. ఉత్తర కొరియాతోనూ సమస్య కొనసాగుతున్న తరుణంలో వీటిని నిర్వహించడంపై అమెరికా కమాండర్ మాట్లాడుతూ ప్రపంచంలో అనేక ప్రమాదకరపరిస్థితులు ఏర్పడివున్నాయని కానీ వీటిని దృష్టిలో పెట్టుకొని నిర్వహించడం లేదని చెప్పారు. ఈ విన్యాసాల్లో 95 యుద్ధవిమానాలు, 16 యుద్ధనౌకలు, 2 జలంతర్గాములు పాల్గొంటున్నాయి. గత రెండు దశాబ్దాలుగా అమెరికా-భారత నావికాదళాలు ప్రతి ఏటా వీటిని నిర్వహిస్తున్నాయి. కొంతకాలం క్రితం జపాన్ కూడా చేరింది. ఎలాంటి విపత్కర పరిస్థితులనయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేందుకు వీలుగా విన్యాసాలను జరుపుతుంటారు. -
ద లవ్ క్వీన్ ఆఫ్ మలబార్
అది 1999వ సంవత్సరం, నవంబర్ మాసం... అరవై అయిదేళ్ల మహిళ ఫోన్ రిసీవర్ పట్టుకొని ఉంది. అవతల 38 ఏళ్ల యువకుడు. ఉర్దూలో తనకిష్టమైన కవితాపంక్తులను చదివి వినిపిస్తున్నాడు. వింటున్న ఆమె పెదవులపై చిరునవ్వు. 65 ఏళ్ల ముదిమిని ఓడిస్తున్న పసితనం కనపడుతోంది ఆమె ముఖంలో. వర్చస్సు, మేథస్సు పోటీపడ్తున్నట్టుండే ఆ తేజోమూర్తికి వివరిస్తున్నాడు యువకుడు.. తనను పెళ్లి చేసుకుంటే ఆమెనెంత అపురూపంగా చూసుకోగలడో అన్నది. ఇవతల అదే సమ్మోహన దరహాసం! తర్వాత మూడురోజులకు.. ఆమె అతని భార్య అయింది. అతను ముస్లిం. పేరు సాదిక్ అలీ. ఇస్లామిక్ స్కాలర్, ముస్లింలీగ్ ఎంపీ. ఆమెను ముస్లిం మతం తీసుకొమ్మని కోరాడు సాదిక్. అతని కోరికను సమ్మతించిందామె. అప్పటి నుంచి కమలాసురయ్యాగా మారిపోయింది... కమలాదాస్. మలయాళ, ఇంగ్లిష్ సాహిత్యాభిమానులకు కమలామాధవికుట్టిగా అత్యంత ఇష్టురాలు. కేరళలోని త్రిస్సూర్జిల్లా పున్నవర్కుళంలో పుట్టింది. సనాతన బ్రాహ్మణ సంప్రదాయంలో పెరిగింది. కానీ ఆమె రచనలను మాత్రం స్త్రీవాద, ప్రజాస్వామిక సిరాతోనే రాసింది. విగ్రహారాధనకు వ్యతిరేకి. తిరుగుబాటు ధోరణి, ధైర్యం ఆమె నైజం కాబట్టే 65 ఏళ్ల వయసులో ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకొని ఇస్లాం మతం స్వీకరించగలిగింది. అదో పెద్ద సంచలనం. ఇరుగుపొరుగు, బంధువులు, రచయితలు, సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. ఆమె ముస్లింగా మారడాన్ని ఓ డ్రామాగా విమర్శించారు. అందుకే ఈ పెళ్లి తర్వాత జరిగిన పరిణామాల గురించి తన స్నేహితురాలు, కెనడియన్ రైటర్మెర్రిలీ వీజ్బోర్డ్కి ఉత్తరం రాసింది. ‘విమర్శల నుంచి నన్ను నేను రక్షించుకోవడానికే బుర్ఖాను ధరించాను’ అని చెప్పింది. అయితే తర్వాత తన వివాహం గురించి, ఇస్లాంను స్వీకరించడం గురించి కూడా అంతే ధైర్యంగా పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసింది. కమల పుట్టింది మలబార్ తీరంలోనైనా పెరిగింది మాత్రం కోల్‌కతాలో. తండ్రి వి.ఎమ్. నాయర్ తొలుత మలయాళం డైలీ ‘మాతృభూమి’కి మేనేజింగ్ ఎడిటర్. ఆ తర్వాత కోల్‌కతా వెళ్లాడు. వాల్ఫోర్డ్ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో సీనియర్ ఆఫీసర్‌గా చేరాడు. ఆమె బాల్యం అక్కడే గడిచింది. తల్లి నలప్పాట్ట్ బాలమణమ్మ మలయాళీ కవయిత్రి. రాసే కళను అమ్మనుంచే పుచ్చుకున్నా రాయడంలో ప్రేరణ మాత్రం మేనమామ నలప్పాట్ట్ నారాయణ మీనన్ ద్వారానే. ఆయనలాగే కమల చాలా చిన్నవయసులోనే కలంతో కవితలు అద్దడం మొదలుపెట్టింది. పదిహేనేళ్లకే గృహిణి అయింది. భర్త మాధవదాస్ బ్యాంక్ ఆఫీసర్. కమలలోని రచనాసక్తిని గమనించి ప్రోత్సహించాడు. కమల ప్రేమపిపాసి. రచన ఆమె తొలి ప్రేమే కాదు.. ఆమె వచనానికి అంశం కూడా. మలయాళంలో ఎన్నో కథలు, ఆంగ్లంలో ఇంకెన్నో కవితలు.. రెండు భాషల్లో మరెన్నో కథలు, కవితలు ఆమె కలానికి గొప్ప పరిచయాన్నిచ్చాయి. కాలమిస్ట్‌గా కూడా మారింది. స్త్రీల సమస్యల నుంచి రాజకీయాల దాకా అన్నిటి మీదా పాళీని పరిగెత్తించింది. పేరుమోసిన కవులు, రచయితలందరూ మూస పదాలు, సంప్రదాయబద్ధమైన భావవ్యక్తీకరణలతో పాఠకులకు ఉక్కపోత సృష్టిస్తున్నవేళ.. కొత్త ఒరవడితో చల్లని తెమ్మెరలా వాళ్ల మనసులను తాకింది కమలాదాస్ కలం! ప్రేమ.. అది పంచే కోరిక.. ఏదైనా పురుషుడి నుంచి స్త్రీకి అందాలి. తప్ప స్త్రీ తనకు తానుగా కోరకూడదు.. పంచకూడదు అనే నియమాలు సాహిత్యానికీ వర్తిసున్న సమయంలో వాటిని ఉండచుట్టి చెత్త బుట్టలో పడేసింది. ఫ్రెష్‌గా ప్రేమ, కోరికకు కొంగొత్త నిర్వచనం రాయడం మొదలుపెట్టింది. అదే నిజాయితీ, ముక్కుసూటి తనంతో 42 ఏళ్లకే ‘మై స్టోరీ’ పేరుతో ఆటోబయోగ్రఫీ రాసుకుంది. రాజకీయాలతో పెద్దగా చెలిమి లేకపోయినా... అనూహ్యంగా ‘లోక్ సేవా పార్టి’ అనే జాతీయ రాజకీయ పార్టీని స్థాపించింది. 1984 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది. ప్రేమను శ్వాసించిన కమల... ఆ ప్రేమను పొందిన క్షణాలను ఆస్వాదిస్తూ తన 75వ యేట 2009, మే31 పుణెలో తుది శ్వాస విడిచింది. ఆమె స్నేహితురాలు మెర్రిలీ విస్బోర్ ్డ కమలను ‘ద లవ్ క్వీన్ ఆఫ్ మలబార్’గా వర్ణిస్తుంది. అదే పేరుతో పుస్తకాన్నీ రాసింది. జీవితం ఎందుకంత చిన్నదో నన్ను అడగండి. అందులో ప్రేమ ఎంత చిన్నదో కూడా అడగండి. సంతోషం గురించి దాని విలువ గురించి కూడా అడగండి. ఎందుకంటే... వాటన్నిటినీ నేను చదివేశాను - కమలాదాస్ - రమ -
మలబారులో తెలుగు వెలుగులు
ఒక ప్రాంత సంస్కృతి గురించి తెలుసుకోవాలంటే అక్కడ విహారయాత్రలు చేయనక్కర్లేదు.. ఒక ప్రాంత జీవనశైలిని అర్థం చేసుకోవాలంటే వారితో కలిసి జీవించనక్కర్లేదు.. అధ్యయనం ద్వారా మరో ప్రాంత సంస్కృతీ సంప్రదాయాల గురించి చాలా సులభంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే ఆలోచనతో తమ కళాశాల విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు కాలికట్‌లోని మలబార్ క్రిస్టియన్ కాలేజీ వాళ్లు. ప్రత్యేకించి తెలుగు వారి జీవన శైలి గురించి, తెలుగు సంస్కృతి గురించి, ఈ సంస్కృతిలోని ప్రముఖ వ్యక్తుల గురించిన వివరాలను అందించేందుకు ఈ ప్రదర్శన నిర్వహించారు. ఇటీవలే ఈ కార్యక్రమం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను ఆ కాలేజీ చరిత్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ వశిష్ట్ అందించారు. తాము ప్రతియేటా తమకళాశాల విద్యార్థుల కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటామని ఆయన తెలిపారు. తెలుగు సినిమా, తెలుగు సంస్కృతుల గురించి ప్రత్యేకమైన ఆసక్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. 2007 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రతియేటా నిర్వహిస్తున్నామన్నారు. తెలుగు భాష గురించి, తెలుగు సినిమా గురించి ఆసక్తితో ఉన్న విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని ఆయన తెలిపారు. దాదాపు 1,200 మంది స్ట్రెంగ్త్ ఉన్న తమ కాలేజీలో ఈ కార్యక్రమానికి మంచిస్పందన వచ్చిందని ఆయన వివరించారు. ప్రత్యేకించి కేరళ యువతలో తెలుగు సినిమా గురించి విపరీతమైన ఆసక్తి ఉందని, అనేక తెలుగు సినిమాలు మలయాళంలోకి డబ్బింగ్ అవుతున్నాయని వశిష్ట్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రదర్శన నిర్వహించడం తెలుగు సినిమాలపై ఆసక్తి ఉన్న యువతకు ఆకర్షణీయంగా మారిందన్నారు. సినిమాల ద్వారా జాతీయ సమగ్రతను చాటడానికి, తెలుగు సంస్కృతిపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతోందని వశిష్ట్ పేర్కొన్నారు. ఈ ఏడాది నిర్వహించిన కార్యక్రమానికి ’ది లెజెండ్స్ ఆఫ్ తెలుగు సినిమా’ అని పేరుపెట్టుకొన్నామని, ఈ కార్యక్రమాన్ని ఇటీవలి కాలంలోనే రెండుసార్లు నిర్వహించామని తెలిపారు. దీనిపై మంచి స్పందన వచ్చిందని, విద్యార్థులతో పాటు బయటి వాళ్లు కూడా ప్రదర్శనను చూడటానికి వచ్చారని ఆయన తెలిపారు. తెలుగు సినిమా ప్రముఖులు, వారి సినిమా బయోగ్రఫీ, తెలుగు వార్తాపత్రికలు, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ ప్రాంతాలకు సంబంధించిన ఫోటోలను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో తెలుగు వారి మనస్సాక్షి ’సాక్షి’కి ప్రముఖ స్థానం దక్కింది. ఐదేళ్ల ప్రస్థానం పూర్తి చేసుకొన్న సాక్షిని ప్రతిష్టాత్మక పత్రికగా అభివర్ణిస్తూ నిర్వాహకులు ప్రదర్శనలో స్థానమిచ్చారు.