నెల్లూరు(టౌన్): జిల్లాలో నిర్వహించిన టీడీపీ అంతర్గత సమావేశంలో గందరగోళం నెలకొంది. సమావేశంలో నేతల మధ్య విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఈ ఘటన ఉదయమే చోటు చేసుకోవడంతో ఏ పరిస్థితికి దారి తీస్తుందోనని నేతలు ఆందోళనకు గురయ్యారు. శుక్రవారం నెల్లూరులోని ఎస్‌వీజీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో జోన్–4కు సంబంధించి ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల టీడీపీ క్లస్టర్, యూనిట్, మండల పార్టీ నాయకులతో అంతర్గత సమావేశం నిర్వహించారు. దీనికి ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు వచ్చారు.
అయితే ఆయన అనుచరులకు అనుమతి లేదని రిజిస్ట్రేషన్ కౌంటర్‌లో ఉండే వారు నిలిపివేశారు. దీంతో కోపోద్రిక్తుడైన కొమ్మి ఆత్మకూరు టీడీపీకి చెందిన కన్నబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మా అనుచరులకు అనుమతి లేకుండా వేరే వాళ్లను ఎలా పంపిస్తారని వాగ్వాదానికి దిగారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లకు డబ్బులు పంచాలని కన్నబాబుకు ఇస్తే.. ఎక్కడా పంచకుండా దాచుకున్నాడని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఉండి వ్యాపారాలు చేసుకుంటూ నెలకో, రెండు నెలలకో ఆత్మకూరుకు వచ్చే కన్నబాబుకు ఏ విధంగా ప్రాధాన్యం ఇస్తారని దుర్భాషలాడారు.
దీంతో కన్నబాబు అనుచరులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో నాయకులు ఇరువర్గాలకు సర్ది చెప్పి పంపించారు. దీంతో అసంతృప్తికి లోనైన కొమ్మి సమావేశానికి చంద్రబాబు వచ్చిన తర్వాత కనిపించలేదు. ఇంకా భోజనాల దగ్గర మీడియా ప్రతినిధులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు తోసుకునే వరకు వెళ్లింది. ఇంకా నెల్లూరు నగరం నుంచి రానున్న ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ప్రచారం చేసుకుంటున్న మాజీ మంత్రి నారాయణ ముఖ్యమైన సమావేశానికి హాజరుకాకపోవడాన్ని ఆ పార్టీ నాయకులే విమర్శిస్తున్నారు. చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో క్లస్టర్, యూనిట్ ఇన్‌చార్జి నుంచి ప్రతిస్పందన కరువైంది.
Comments
Please login to add a commentAdd a comment