సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో పేదల కోసం 15.60 లక్షల ఇళ్లను ఒకేసారి నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. ఈ మహా యజ్ఞానికి జూన్ 1న శ్రీకారం చుడుతోంది. ఇళ్ల నిర్మాణాలను నిరాటంకంగా కొనసాగించాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ మహత్తర కార్యక్రమానికి చర్యలు చేపట్టారు. వైఎస్సార్–జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన సామగ్రితో పాటు నీటి సరఫరా, ఇతర వసతులను ఈ నెలాఖరు కల్లా కల్పించేందుకు సంబంధిత శాఖలు వేగంగా చర్యలను చేపడుతున్నాయి. నీటి సౌకర్యం కల్పించిన కాలనీల్లో జూన్ 1 నుంచి పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు చేపట్టాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. కోవిడ్ సంక్షోభంలో ఈ కార్యక్రమం భారీ ఎత్తున చేపడుతుండటంతో కూలీలకు చేతినిండా పని దొరకడంతోపాటు ఆర్థిక ప్రగతికి బాటలు వేయనుంది.
తొలి దశలో రూ.46,084 కోట్ల వ్యయం
తొలి దశలో చేపట్టే ఇళ్ల నిర్మాణాలకు రూ.28,084 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. అలాగే తొలి దశలో వైఎస్సార్–జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.18 వేల కోట్లు వ్యయం అవుతుందని అంచనా. మొత్తంగా రూ.46,084 కోట్లు ఖర్చయ్యే ఈ మహా యజ్ఞానికి సంబంధించి సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను రూపొందిస్తున్నట్టు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. తొలి దశలో చేపట్టే 8,798 కాలనీల్లో నీటి వసతి కల్పించాల్సిన అవసరం ఉందని గుర్తించారు. ఇప్పటికే 2,284 కాలనీల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. మిగతా కాలనీల్లో కూడా బోర్లు వేయడం, వాటికి మోటార్లు, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం వంటి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరోపక్క గృహ నిర్మాణ శాఖ ఇళ్లు నిర్మించే కాలనీలకే అవసరమైన సిమెంట్, స్టీల్ సరఫరా చేసేలా జిల్లాల్లో 489 గోదాములను అద్దెకు తీసుకుంది. 71,400 టన్నుల సిమెంట్‌కు కొనుగోలుకు ఆర్డర్ ఇవ్వగా.. ఇందులో 41,157 మెట్రిక్ టన్నుల సిమెంట్ గోదాములకు చేరింది. 24,022 టన్నుల స్టీల్ కొనుగోలుకు ఆర్డర్ ఇవ్వగా.. 2,577 టన్నుల స్టీల్ గోదాములకు చేరింది. ఇసుక కూడా సిద్ధంగా ఉంది.
15.10 లక్షల ఇళ్ల నిర్మాణాలకు ఇప్పటికే పరిపాలనా అనుమతి
తొలి దశలో 15.60 లక్షల ఇళ్లను నిర్మించనుండగా.. 15.10 ఇళ్ల నిర్మాణాలకు పరిపాలన అనుమతిని మంజూరైంది. అలాగే 14.89 లబ్ధిదారుల మంజూరు పత్రాలు కూడా ఇచ్చారు. ఈ గృహాల్లో ఇప్పటికే 97 శాతం మ్యాపింగ్ పూర్తి కాగా.. 79 శాతం గృహాలకు జియో ట్యాగింగ్ సైతం పూర్తయింది. గృహ నిర్మాణ శాఖ వెబ్‌సైట్‌లో 90 శాతం లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది. తొలి దశలో చేపట్టే ఇళ్ల నిర్మాణాల ద్వారా 21.7 కోట్ల పని దినాలు కల్పించనున్నారు. అలాగే 69.70 లక్షల టన్నుల సిమెంట్, 7.44 లక్షల టన్నులు స్టీల్, 310 లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక అవసరం అవుతుందని అంచనా. కాలనీలకు మంచినీటి సరఫరా కోసం రూ.920 కోట్ల వ్యయం అవుతందని అంచనా వేశారు. పల్లెలు, పట్టణాల్లో వ్యక్తిగత గృహ నిర్మాణాలతో పాటు కొత్తగా ఏర్పాటు చేసే కాలనీల్లో మంచినీటితో పాటు విద్యుత్, రహదారులు, ఇతర అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. ప్రతి ఇంట్లో బెడ్ రూమ్, లివింగ్ రూమ్ (హాల్), కిచెన్, బాత్ రూమ్ కమ్ టాయిలెట్, వరండా ఉండేలా నిర్మాణాలు చేపడతారు.
జూన్ 1 నుంచి పనులు ప్రారంభం : అజయ్ జైన్
వైఎస్సార్–జగనన్న కాలనీల్లో నీటి సరఫరా సౌకర్యాన్ని ఈ నెలాఖరులోగా కల్పించి.. జూన్ 1వ తేదీ నుంచి పెద్దఎత్తున ఇళ్ల నిర్మాణాలు చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ తెలిపారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో లబ్ధిదారులు నియోజకవర్గాల కేంద్రాలకు వెళ్లి మెటీరియల్ తీసుకోవాల్సి వచ్చేదని, దీంతో వారికి రవాణా చార్జీలు అయ్యేవని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గ్రామ సచివాలయాలు లేదా ఆయా గ్రామాల్లోనే అవసరమైన మెటీరియల్ నిల్వ చేసి లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాల వద్దకే మెటీరియల్ సకాలంలో సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు.
Andhra Pradesh: ఊరూరా ఇళ్ల నిర్మాణాల సందడి
Published Sat, May 29 2021 3:27 AM | Last Updated on Sat, May 29 2021 7:54 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment