సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉండే (హై ఇంపాక్ట్) మరో 202 రోడ్లను రూ.784.22 కోట్లతో పూర్తిస్థాయిలో మరమ్మతులతోపాటు పునర్నిర్మాణం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 26 జిల్లాల్లో 1,035 కిలోమీటర్ల మేర ఈ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. రాష్ట్రంలో 258 రోడ్లు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం పరిధిలో ఉండగా.. వాటిలో 56 రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం గతంలోనే అనుమతులు ఇవ్వగా.. పనులు పురోగతిలో ఉన్నాయి. మిగిలిన 202 రోడ్ల పునర్నిర్మాణ పనుల కోసం పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
టెండర్ల ప్రక్రియ షురూ!
ఈ పనులకు సంబంధించి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ మొదలైంది. ఈ నెల 6వ తేదీ నుంచి ఆన్‌లైన్ విధానంలో కాంట్రాక్టర్లు బిడ్లు దాఖలు ప్రక్రియను మొదలు పెట్టినట్టు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఈఎన్‌సీ బాలు నాయక్ తెలిపారు. 14 రోజుల పాటు టెండర్ల దాఖలుకు గడువు ఉంటుందని.. నవంబర్ నెలాఖరు నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి డిసెంబర్ మొదటి వారంలోనే ఆయా రోడ్ల పనులను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన చెప్పారు. కాగా.. ఆర్ అండ్ బీ శాఖ పరిధిలో గుర్తించిన హై ఇంపాక్ట్ కేటగిరీ రోడ్లకు ప్రభుత్వం ఆ శాఖ ఆధ్వర్యంలో అనుమతులు మంజూరు చేసింది. ఆ పనులు కూడ మొదలైనట్టు అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment