సాక్షి, అమరావతి/ సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రాన్ని వణికించిన మిచాంగ్ తుపాను బలహీనపడి అల్పపీడనంగా కొనసాగుతోంది. మంగళవారం మధ్యాహ్నం బాపట్ల సమీపంలో తీరం దాటిన తర్వాత క్రమేపీ బలహీన పడినప్పటికీ, దాని ప్రభావంతో పలు జిల్లాల్లో బుధవారం కూడా భారీ వర్షాలు కురిశాయి. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఏలూరు జిల్లా తాడువాయిలో మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల వరకు 29.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
అనకాపల్లి జిల్లా దార్లపల్లిలో 29.5, ఏలూరు జిల్లా రేచర్లలో 26, తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 25 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. బుధవారం మధ్యాహ్నం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టాయి. గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, 8 జిల్లాల పరిధిలో 137 మండలాల్లోని సుమారు వెయ్యి గ్రామాలపై మిచాంగ్ తుపాను ప్రభావం చూపింది.
♦ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల రైతులు వణికి పోయారు. పెనుగంచిప్రోలు మండలం లింగగూడెం వద్ద గండివాగు, ముచి్చంతాల వద్ద వాగు, అనిగండ్లపాడు వద్ద దూళ్లవాగు, కూచివాగు పొంగటంతో వరి పైరు నీట మునిగింది. పూత, పిందె దశలో ఉన్న మిర్చి పంట నేలకు వంగిపోయింది. గంపలగూడెం మండలంలో కట్టెలేరులో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది.
♦ అనకాపల్లి జిల్లాలో బుధవారం కూడా వర్షాలు పడ్డాయి. అధికారుల ముందస్తు చర్యలతో ప్రాణ, ఆస్తినష్టం తప్పింది. అనకాపల్లి జిల్లా పెద్దేరు జలాశయంలోకి 4 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో అంతే వరద నీరు 3 ప్రధాన గేట్ల ద్వారా పెద్దేరు నదిలోకి విడుదల చేస్తున్నారు. జిల్లాలోని 12 మండలాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా కనిపించిందని.. వందల ఎకరాల్లో వరి పంట నీట మునిగిందని కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి తెలిపారు. విద్యుత్ శాఖకు రూ.21 లక్షల నష్టం వాటిల్లిందన్నారు. నాలుగు జెర్సీ ఆవులు చనిపోయాయని, 25 ఇళ్లు, 86 పూరిళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు.
♦ అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరితోపాటు రాజ్‌మా, కూరగాయ పంటలకు నష్టం వాటిల్లింది. చింతూరు డివిజన్‌లో పత్తి, మిరప పంటలు నీట మునిగాయి. ప్రధాన గెడ్డలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పరదానిపుట్టు కాజ్‌వే అవతల ఉన్న పెదబయలు, పాడేరు మండలాల్లోని 150 గ్రామాలకు రవాణా నిలిచిపోయింది. పెదబయలు మండలం పరదానిపుట్టుకు చెందిన కిల్లో రామకృష్ణ (40) మత్స్యగెడ్డలో చేపలు వేటాడుతూ జారి పడి కొట్టుకుపోయి మృతిచెందాడు.
♦ కాకినాడ జిల్లాలో ఈదురు గాలులు, భారీ వర్షాలతో పలు మండలాల్లో వరి పంట నేలకొరిగింది. పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం మేడపాడులో పూరిపాక కూలిపోయి ముక్కుర్తి నాగరాజు(62) మృతిచెందాడు. చేబ్రోలులో చెరువుకు గండిపడింది. కొత్తపల్లి కొండవరంలో సుడిగాలితో సుమారు 50 ఇంటి పైకప్పులు ఎగిరిపోగా, మరికొన్ని ఇళ్ల పైకప్పులు ధ్వంసమయ్యాయి. సుడిగాలికి దెబ్బతిన్న పిఠాపురం మండలం పి.దొంతమూరు, కొత్తపల్లి మండలం కొండెవరంలలో 100 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించి భోజన, వసతి సదుపాయాలు కల్పించారు. జగ్గంపేట నియోజకవర్గంలో బుధవారం భారీ వర్షం కురిసింది.
♦ అమలాపురంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఇళ్లలోకి నీరు చేరింది. పలు గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల కాలనీలు ముంపునకు గురయ్యాయి.
♦ తిరుపతి జిల్లాలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాళంగి నుంచి 44 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వచ్చింది. రిజర్వాయర్లన్నీ నిండిపోవటంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వాగులు, వంకల నుంచి వచ్చే వరద నీటితో జాతీయ రహదారిపై 5, 6 అడుగుల ఎత్తున నీరు ప్రవహించింది. గూడూరు డివిజన్‌లో ఇప్పటికీ కొన్ని గ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment