సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని, వైరస్ తీవ్రత వచ్చే నెల నాటికి మరింతగా తగ్గే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి అన్నారు. టీటీడీ ఈవోగా బదిలీపై వెళుతున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా చివరిసారి గురువారం మీడియాతో మాట్లాడారు. కరోనా విషయంలో అజాగ్రత్తగా ఉంటే ప్రమాదమేనని, ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. మాస్కులు, శానిటైజర్, భౌతిక దూరం.. ఈమూడే కోవిడ్ నియంత్రణకు సూత్రాలని చెప్పారు. ఇటీవలి కాలంలో పోస్ట్ కరోనా (కరోనా వచ్చి తగ్గాక) సమస్యలు వస్తున్నాయని, ముందస్తు జాగ్రత్తే మంచిదని సూచించారు. భారీగా నియామకాలు, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చేయూతనివ్వడం వల్లే దేశంలోనే ఏపీ కోవిడ్ నియంత్రణలో ముందంజలో ఉందని తెలిపారు. (చదవండి: ఎమ్మెల్యే భూమనకు మరోసారి కరోనా)
స్కూళ్లకు వెళ్లే ప్రతి విద్యార్థి మాస్కు ధరించాలన్నారు. వీలైతే వరండాల్లో, చెట్ల కింద పాఠాలు చెప్పడం మంచిదని సూచించారు. చాలా రాష్ట్రాల్లో వైరస్ నియంత్రణకు మౌలిక వసతుల కల్పన కేంద్రీకృతంగా చేశారు, కానీ మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ వికేంద్రీకరణ చేసి, విస్తరించడం వల్లే నియంత్రణ సాధ్యమైందని తెలిపారు. 17 శాతమున్న పాజిటివిటీ రేటు ఇప్పుడు 7కు చేరిందని, కొద్ది రోజుల్లోనే 5 కంటే తగ్గిపోతుందని అంచనా ఉందని వెల్లడించారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో జవహర్‌రెడ్డి పాల్గొన్నారు.
టీటీడీ చైర్మన్‌ను కలిసిన జవహర్‌రెడ్డి
టీటీడీ నూతన ఈవోగా నియమితులైన కేఎస్ జవహర్‌రెడ్డి.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని టీటీడీ చైర్మన్ కార్యాలయంలో గురువారం ఇరువురు భేటీ అయ్యారు. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలతో పాటు, పలు అంశాలను వారు ఈ సందర్భంగా చర్చించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment