పెదమైనవానిలంకలో ఉప్పు సాగు
సాక్షి, నరసాపురం: ఉప్పు సాగుపై గతేడాది మాదిరిగా ఈ ఏడాది కూడా కరోనా ప్రభావం పడింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం తీరంలో తక్కువ విస్తీర్ణంలో రైతులు ఉప్పు సాగు చేస్తున్నారు. గతేడాది కరోనాతో ఎగుమతులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సీజన్‌లో అదే పరిస్థితి ఉంటుందనే భయంతో తక్కువ విస్తీర్ణంలో సాగు చేపట్టారు. ఎండ తీవ్రతతో ఈ ఏడాది దిగుబడులు బాగుంటాయని రైతులు చెబుతున్నారు.
500 కుటుంబాలకు ఆధారం
నరసాపురం ప్రాంతంలో 19 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉంది. తీర గ్రామాలైన పెదమైనవానిలంక, తూర్పుతాళ్లు, వేములదీవి, చినమైనవానిలంక, బియ్యపుతిప్ప, పేరుపాలెం గ్రామాల్లో సుమారు 3 వేల ఎకరాల్లో ఉప్పు సాగు ఉంది. దాదాపు 500 కుటుంబాలు ఉప్పు సాగుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. వీరిలో 90 శాతం మత్స్యకారులే కావడం గమనార్హం.
ఎం లంకలో ఉప్పుమడులు
కష్టంతో కూడిన సాగు
ఉప్పు సాగు కష్టంతో కూడుకున్నది. ముఖ్యంగా మండే ఎండల్లో చేయాలి. చిన్న పాటి మడులను ఏర్పాటుచేసి ఉప్పు సాగు చేస్తారు. ఎకరానికి 60 నుంచి 70 వరకు మడులు కడతారు. ముందుగా మడుల్లో మట్టిని కాళ్లతో తొక్కి చదును చేసి తర్వాత సముద్రంలోని ఉప్పు నీటిని ఆ మడుల్లో నింపుతారు. సాగు ప్రారంభమైన నాటి నుంచి మడుల్లో 60 రోజుల పాటు 6 నుంచి 10 మంది శ్రమిస్తేనే గాని ఉప్పు తయారీ కాదు.
తక్కువ విస్తీర్ణంలో..
గత కొన్నేళ్లుగా ఉప్పు సాగు సవ్యంగా సాగడం లేదు. ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టపోతున్నారు. తుపాన్లు, వర్షాలతో మడులు చెరువులుగా మారుతున్నాయి. దీంతో చాలా మంది రైతులు ఉప్పు సాగుకు స్వస్తి చెప్పారు. గతేడాది కరోనా దెబ్బతో నష్టపోవడంతో ఈ ఏడాది కేవలం 1,500 ఎకరాల్లో మాత్రమే సాగు చేపట్టారు. సగానికి పైగా విస్తీర్ణంలో ఉప్పు సాగు తగ్గింది.
దళారులదే రాజ్యం
ఎకరా ఉప్పు సాగుకు రైతుకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చవుతుంది. తయారైన ఉప్పును దళారులు ద్వారానే విక్రయించాల్సిన పరిస్థితి. నేరుగా దళారులు రైతుల వద్దకు వచ్చి బస్తాకు ఇంతని ధర నిర్ణయిస్తారు. ప్రస్తుతం దళారులు రైతుల వద్ద బస్తా (90 కిలోలు) రూ.220కు కొనుగోలు చేస్తున్నారు. బయట మార్కెట్‌లో బస్తా ధర రూ.1,000 వరకు పలుకుతుంది. మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకునేలా నిల్వ చేసుకునేందుకు గిడ్డంగులు సౌకర్యాలు లేవు. దీంతో రైతులు ఉత్పత్తి అయిన వెంటనే ఉప్పును అయినకాడికి అమ్మేస్తుంటారు. అప్పటివరకు మడుల వద్ద రాశులుగా పోసి ఉప్పును ఉంచుతారు. తయారైన వెంటనే ఉప్పును విక్రయించకపోతే అకాల వర్షాలతో నష్టపోతామని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా సెకండ్‌వేవ్ ప్రభావంతో అమ్మకాలు పూర్తిస్థాయిలో లేవని, ఇక దళారులు చెప్పిన ధరకు అమ్మాల్సిందేనని అంటున్నారు. ఉప్పును జాతీయ పంటగా గుర్తించాలనే డిమాండ్ చాలా కాలం నుంచి ఉన్నా అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. స్థానికంగా గిడ్డంగుల ఏర్పాటుతో పాటు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
పెట్టుబడులు రావడమే కష్టం: ఉప్పుసాగు గిట్టుబాటు కాకపోవడంతో ఈ ఏడాది చాలా మంది సాగు చేయలేదు. విస్తీర్ణం తగ్గినా సాగు బాగా సాగింది. అయితే అమ్మకాలు లేకుండా పోయాయి. కరోనా ఇబ్బందులు ఉండవని భావించి సాగులో ముందుకు వెళ్లాం. ఇప్పుడు పెట్టుబడులు రావడమే అనుమానంగా ఉంది. అందరి కష్టాలు తీరుస్తున్న సీఎం జగన్ మా సమస్యలను పరిష్కరిస్తారని ఎదురుచూస్తున్నాం. -సంకరపు లక్ష్మణుడు, ఉప్పు రైతు, పెదమైనవానిలంక
సగం కూడా అమ్ముడు కాలేదు: ఈ ఏడాది ఉప్పు బాగా çపండుతోంది. అయితే మాకు ఆనందం నిలవలేదు. ఫిబ్రవరి నుంచి సాగు ప్రారంభించాం. ఎప్పుడు పండిన పంటను అప్పుడే కొనుక్కుని వెళ్లిపోయేవారు. అయితే ఈ ఏడాది సగం కూడా అమ్ముడు కాలేదు. కరోనాతో ఎగుమతులు అంతగా లేవు. చాలా తక్కువగా బేరాలు వస్తున్నాయి. బస్తాకు రూ.200, రూ.220 ఇస్తున్నారు. ఆ రేటుకే అమ్ముకుంటున్నాం.-మైల విష్ణుమూర్తి, ఉప్పురైతు, చినమైనవానిలంక
Comments
Please login to add a commentAdd a comment