కరోనా వ్యాక్సిన్‌ భారత్‌తోనే సాధ్యం | Corona Vaccine Is Only Possible With India | Sakshi
Sakshi News home page

కరోనా వ్యాక్సిన్‌ భారత్‌తోనే సాధ్యం

Published Mon, Nov 23 2020 4:11 AM | Last Updated on Mon, Nov 23 2020 4:11 AM

Corona Vaccine Is Only Possible With India - Sakshi

మాట్లాడుతున్న డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్యా స్వామినాథన్‌

పుట్టపర్తి అర్బన్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు భారతదేశమే త్వరగా వ్యాక్సిన్‌ తయారు చేసే అవకాశం ఉందని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్యా స్వామినాథన్‌ అభిప్రాయపడ్డారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఆదివారం నిర్వహించిన సత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌ 39వ స్నాతకోత్సవంలో ఆమె వర్చువల్‌ విధానం ద్వారా ప్రసంగించారు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా కరోనాతో వణికిపోయాయన్నారు. ప్రసుత్తం కరోనా వ్యాక్సిన్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా 45 క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయని చెప్పారు. ఇండియన్‌ జనరిక్‌ కంపెనీ త్వరలోనే కరోనా వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తుందన్నారు.

ప్రపంచంలో 40 నుంచి 50 శాతం మందికి వ్యాక్సిన్‌ అందజేసే సామర్థ్యం భారత్‌కు ఉందన్నారు. వర్సిటీ చాన్సలర్‌ కె.చక్రవర్తి, వైస్‌ చాన్సలర్‌ సీబీ సంజీవి, సెంట్రల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌ తదితరులు మాట్లాడుతూ.. సత్యసాయి మానవీయ విలువలే ప్రామాణికంగా విద్యా విధానాన్ని రూపొందించారన్నారు. అనంతరం 15 మందికి బంగారు పతకాలు, ఏడుగురికి డాక్టరేట్‌లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారుచేసిన ర్యాపిడ్‌ కోవిడ్‌–19 టెస్ట్‌ కిట్‌ను ప్రశాంతి నిలయంలో ఆవిష్కరించారు. కాగా.. సోమవారం సత్యసాయిబాబా 95వ జయంతి వేడుకలు ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్‌ మందిరంలో వైభవంగా జరగనున్నాయి.

కోవిడ్‌ సేవల్లో ‘అనంత’ ముందంజ
కోవిడ్‌ బాధితులకు సేవలందించడంలో అనంతపురం జిల్లా ముందంజలో ఉంది. తరువాత స్థానంలో వైఎస్సార్‌ జిల్లా నిలిచింది. కోవిడ్‌ ఆస్పత్రుల వారీగా డాక్టర్ల సేవలు, నర్సింగ్, పారిశుధ్యం వంటి 12 విభాగాలను పరిశీలించి పాయింట్లు ఇచ్చారు. జిల్లాల వారీగా ఈ పాయింట్లు లెక్కించారు. 2,500 పాయింట్లకు మించి సాధించిన జిల్లాను సగటుకు మించి సేవలు అందించినవిగాను, అంతకంటే తక్కువ పాయింట్లు సాధించిన వాటిని సగటు కంటే తక్కువ సేవలందించినవిగాను లెక్కించారు. అనంతపురం జిల్లా 2,710.39 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది.

ప్రస్తుతం అనంతపురం జిల్లాలో 9 ఆస్పత్రులు కోవిడ్‌ సేవలు అందిస్తున్నాయి. 2,676.99 పాయింట్లతో వైఎస్సార్‌ జిల్లా రెండో స్థానంలో ఉంది. ఈ జిల్లాలో 11 ఆస్పత్రులు కోవిడ్‌ సేవల్లో ఉన్నాయి. ప్రకాశం, శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు 2,500 పాయింట్లకంటే తక్కువలో ఉన్నాయి. సగటున అన్ని జిల్లాలు కలిపి లెక్కిస్తే 2,500.55 పాయింట్లతో ఉన్నాయి. రాష్ట్రంలో కోవిడ్‌ వచ్చిన తొలిరోజుల్లో 248 ఆస్పత్రులు కోవిడ్‌కు వైద్యసేవలందిస్తుండగా, ఇప్పుడా సంఖ్య 149కి తగ్గింది. ప్రస్తుతం అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 20 ఆస్పత్రులు, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో మూడు ఆస్పత్రులు కోవిడ్‌ సేవల్లో ఉన్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement