ఢిల్లీ ట్రేడ్ ఫెయిర్‌లో అందర్నీ ఆకర్షిస్తున్న అంత్యక్రియల స్టాల్ సుకాంత్ అంతిమ సంస్కార్
వారిది ఉన్నత కుటుంబం. వృద్ధాప్య సమస్యలతో ఆస్పత్రి పాలైన ఆ దంపతులిద్దరూ రెండు మూడు రోజుల్లో మరణిస్తారని వైద్యులు చెప్పేశారు. అనుకున్నట్టుగానే వృద్ధ దంపతులిద్దరూ ఒకేసారి మరణించారు. కడసారి చూసేందుకు ‘ఆ నలుగురు’ కాదు కదా.. ఏ ఒక్కరూ రాలేదు. అంత్యక్రియలను మీరే నిర్వహించండంటూ వారసుల నుంచి పురోహితుడి అకౌంట్‌కు క్షణాల్లో నగదు బదిలీ అయ్యింది. ఆ దంపతుల చివరి కోరిక మేరకు రాజమహేంద్రవరంలో గోదావరి గట్టున అంత్యక్రియలతోపాటు కర్మకాండలను సైతం ‘పురమాయింపు’ వ్యక్తులే జరిపించారు. ఈ కార్యక్రమాన్ని వీడియో కాల్ ద్వారా చూసి తరించిన వారసులు ఘన నివాళులే అర్పించారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది ఇటీవల జరిగిన యథార్థ ఘటన. ఇలాంటి వారి కోసమే పురోహితుని నుంచి పాడె మోయడం.. దహన సంస్కారాల వరకు నిర్వహించే ‘ఆన్‌లైన్ అంతిమ సంస్కార’ సంస్థలు పుట్టుకొస్తున్నాయి. అంత్యక్రియలనూ ఆన్‌లైన్ వ్యాపారంగా మార్చేసి కార్పొరేట్ మెట్లెక్కిస్తున్నాయి.
సాక్షి, అమరావతి: నానాటికీ దిగజారుతున్న మానవ సంబంధాలు కొత్త వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నాయి. ఉన్నత చదువులు చదివిన పిల్లలు ఉద్యోగాలు నిమిత్తం దూర దేశాలకు వెళ్లిపోయి.. కనీసం తల్లిదండ్రుల చివరి చూపునకు కూడా రాలేనంత బిజీ అయిపోయారు. వారసులు అంత గొప్ప ప్రయోజకులయ్యారని మురిసిపోవాలో... లేక చివరి క్షణాల్లో పిల్లలు ఉన్నా అనాథగా మిగిలిపోయామని బాధపడాలో తెలియని దుస్థితి తలెత్తింది. ఈ మధ్యనే రాజమహేంద్రవరంలో జరిగిన ఘటన కళ్లు చెమ్మగిల్లేలా చేసింది.
వృద్థాప్యంతో హాస్పిటల్‌లో చేరిన తల్లిదండ్రులకు సపర్యలు చేసే నిమిత్తం.. విదేశాల్లో స్థిరపడిన వారసులు ఆయాలను ఏర్పాటు చేశారు. వారిద్దరూ రెండు మూడు రోజుల్లోనే తుది శ్వాస విడుస్తారని తెలియడంతో.. ఆ దంపతుల కోరిక మేరకు గౌతమీ ఘాట్ వద్ద అంత్యక్రియలు జరిపించాలంటూ పురోహితుడి అకౌంట్‌కు వారిద్దరూ బతికుండగానే నగదు బదిలీ చేశారు.
అంత్యక్రియల కార్యక్రమాన్ని వీడియో కాల్ ద్వారా చూపిస్తే తాము ఉన్న దేశం నుంచే నివాళి అర్పిస్తామన్నారు. ఆ పిల్లల వైఖరిని స్వయంగా చూసిన ఆ ముసలివాళ్ల మనసులు ఎంత తల్లడిల్లి పోయి ఉంటాయో. సరిగ్గా ఇలాంటి వారి కోసమే ఇప్పుడు అంత్యక్రియలు కూడా పెద్ద వ్యాపార వస్తువుగా మారిపోయాయి. పుట్టిన ప్రతి వాడూ గిట్టక మానడు కాబట్టి ఇది కూడా కార్పొరేట్ రూపు సంతరించుకుంటోంది. ఇందుకోసం అంతిమ సంస్కార్, గురూజీ, అంతేష్టి, లాస్ట్‌రైట్స్ వంటి పేర్లతో పలు సంస్థలు పుట్టుకొస్తున్నాయి.
అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిర్‌లో ప్రత్యేక ఆకర్షణ
న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఏటా అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ వాణిజ్య సంస్థలు తమ ఉత్పత్తులను అక్కడ ప్రదర్శించడం ద్వారా మార్కెటింగ్ చేసుకుంటాయి. అలాంటి అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిర్‌లో ఏర్పాటు చేసిన ఒక స్టాల్ సందర్శకులను విస్తుపోయేలా చేసింది. ‘సుకాంత్ అంతిమ సంస్కార్’ పేరుతో అంత్యక్రియల కోసం ఏర్పాటైన ఒక కార్పొరేట్ కంపెనీ తాను అందించే సేవలను వివరిస్తూ పెట్టిన స్టాల్‌ను చాలామంది కన్నార్పకుండా చూశారు.
ఇద్దరు కలిపి.. ‘ఆ నలుగురు’ ఏర్పాట్లు
ముంబైకి చెందిన రవీంద్ర పాండురంగ్ సోనావాలే, సంజయ్ కైలాష్ రాముగుడ్ అనే ఇద్దరు కలిసి సుకాంత్ ఫ్యూనరల్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేశారు. వివిధ మతాలు, కులాల వారి ఆచార వ్యవహారాలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహించడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. అంత్యక్రియలకు అవసరమైన పాడె.. దాన్ని మోసే మనుషుల నుంచి పురోహితులు, మంగలి, రామ్ నామ్ సత్యహై అనే నినాదాలిచ్చే వంటివన్నీ ఒక ప్యాకేజీ కింద అందిస్తున్నారు.
ప్రారంభం ప్యాకేజీ ధర రూ.37,500గా నిర్ణయించారు. అస్థికలను పవిత్ర నదుల్లో కలిపేదాన్ని బట్టి ప్రత్యేక రుసుములు తీసుకుంటున్నారు. ఇప్పటికే 5 వేలకు పైగా అంత్యక్రియలను నిర్వహించిన ఈ సంస్థ రూ.50 లక్షలకు పైగా లాభాన్ని నమోదు చేసింది. రానున్న కాలంలో ఈ సంస్థ టర్నోవర్ రూ.2 వేల కోట్లకు చేరుకోనుందనే అంచనాలతో పలు సంస్థలు ఇందులో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయాన్ని ముందే గ్రహించిన శ్రీశ్రీ ‘స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్’ అన్నాడేమో.
Comments
Please login to add a commentAdd a comment