సాక్షి, అమరావతి: దేశంలోని పలు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వోద్యోగుల వేతనాల వ్యయం భారీగా పెరిగింది. అదే సమయంలో పెన్షన్ల వ్యయం కూడా భారీగానే అయింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) 2022–23 ఆర్థిక ఏడాదికి సంబంధించిన ప్రాథమిక గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
ఏడాది వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం భారీగా పెరిగింది. మరోపక్క.. తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాల కన్నా ఏపీలోనే ఉద్యోగుల వేతనాల వ్యయం అధికంగా ఉందని కాగ్ తెలిపింది. నివేదిక ముఖ్యాంశాలు ఏమిటంటే..
♦ 2021–22తో పోలిస్తే రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగుల వేతనాల వ్యయం 2022–23లో రూ.8,068.39 కోట్లు పెరిగింది.
♦ ప్రభుత్వోద్యోగుల పెన్షన్ల వ్యయం 2021–22తో పోలిస్తే 2022–23లో రూ.2,257.29 కోట్లు పెరిగింది.
♦ 2021–22 ఆర్థిక ఏడాదిలో ప్రభుత్వోద్యోగుల వేతనాల వ్యయం ఏపీలో రూ.40,895.83 కోట్లు ఉండగా 2022–23లో అది ఏకంగా రూ.48,964.22 కోట్లకు పెరిగింది.
♦ అలాగే, 2021–22లో ప్రభుత్వోద్యోగుల పెన్షన్ల వ్యయం రూ.20,326.67 కోట్లు కాగా, 2022–23లో అది రూ.22,583.96 కోట్లకు పెరిగింది.
..ఇలా రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం ఏటేటా పెరుగుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 11వ పీఆర్సీని అమలుచేయడంతో పాటు ఉద్యోగులకు డీఏలు ఇవ్వడంతో వేతనాల వ్యయం భారీగా పెరుగుతోంది. మరోవైపు.. వైద్య ఆరోగ్య శాఖలో ఏ ఒక్క పోస్టు ఖాళీలేకుండా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment