అడుగడుగునా మేసేశారు | Countless irregularities in maintenance of medical devices during Chandrababu era | Sakshi
Sakshi News home page

అడుగడుగునా మేసేశారు

Published Wed, Apr 7 2021 5:13 AM | Last Updated on Wed, Apr 7 2021 5:13 AM

Countless irregularities in maintenance of medical devices during Chandrababu era - Sakshi

సాక్షి, అమరావతి: విశాఖలోని కింగ్‌ జార్జి ఆస్పత్రి (కేజీహెచ్‌)లో పనిచేయని సిటీ స్కాన్‌ మెషిన్‌ను పని చేస్తున్నట్టు చూపించారు. దాని విలువ రూ.2 కోట్లుగా చూపించి.. ఆ మొత్తంపై 7.45 శాతం చొప్పున నిర్వహణ సేవల పేరుతో బిల్లులు కొట్టేశారు. కర్నూలు జీజీహెచ్‌లో ఎంఆర్‌ఐ స్కానింగ్‌ మెషిన్‌ ధరను రూ.3.60 కోట్లుగా రికార్డుల్లో చూపించారు. వాస్తవానికి మార్కెట్లో దీని విలువ రూ.1.69 కోట్లు. జెమిని అనే ప్రైవేట్‌ సంస్థ అప్పటికే పదేళ్ల ఒప్పందంతో దాని నిర్వహణ బాధ్యతలు చూస్తోంది. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం టెండర్‌ ఇచ్చిన బెంగళూరు టీబీఎస్‌ సంస్థ కూడా నిర్వహణ సేవల పేరుతో బిల్లులు పెట్టి నిధులు గుంజేసింది. అంటే ఒకే ఎంఆర్‌ఐ స్కానింగ్‌ మెషిన్‌ నిర్వహణ పేరిట రెండు సంస్థలకు బిల్లులు ఇవ్వడమే కాకుండా, మార్కెట్‌ ధర కంటే రెట్టింపు చూపించి ఏడాదికి రూ.26.82 లక్షలను నిర్వహణ చార్జీల పేరిట అదనంగా తినేశారు. ఈ విధంగా వైద్య పరికరాల నిర్వహణ పేరిట అడుగడుగునా ప్రజాధనాన్ని మేసేశారు. ఈ కుంభకోణం తీరును లోతుగా పరిశీలిస్తే లెక్కలేనన్ని అక్రమాలు బయటపడుతున్నాయి. 

ప్రాథమిక ఆధారాలు సేకరించిన సీఐడీ
చంద్రబాబు పాలనలో ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో వైద్య పరికరాల నిర్వహణ కాంట్రాక్ట్‌ స్కామ్‌పై సెక్షన్‌ 420, 406, 477 కింద నేర పరిశోధన విభాగం (సీఐడీ) కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రాథమిక ఆధారాలు సేకరించిన సీఐడీ పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. ప్రాథమిక ఆధారాలను పరిశీలిస్తే... కోట్లాది రూపాయల ప్రజాధనం కొల్లగొట్టేందుకు పక్కా స్కెచ్‌తో వైద్య పరికరాల నిర్వహణ తంతు నడిపినట్టు నిర్థారణ అవుతోంది. అప్పటి సీఎం చంద్రబాబు, కామినేని శ్రీనివాస్‌తోపాటు వైద్య, ఆరోగ్య శాఖ కీలక అధికారుల అండతోనే అవినీతి, అక్రమాలు జరిగినట్టు సీఐడీ అంచనాకు వచ్చింది. బెంగళూరుకు చెందిన టీబీఎస్‌ ఇండియా టెలీమాటిక్, బయో మెడికల్‌ సర్వీసెస్‌ సంస్థకు 2015లో ఏడాది మాత్రమేనంటూ టెండర్‌ ఖరారు చేసిన నాటి నుంచి.. నిబంధనలకు విరుద్ధంగా ఐదేళ్లు కొనసాగించడం వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దల ప్రయోజనాలు దాగి ఉన్నాయనేది బహిరంగ రహస్యమే.

రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో ఉన్న వైద్య పరికరాల మొత్తం విలువకు 7.45 శాతం చొప్పున నిర్వహణ రుసుం చెల్లించే ఒప్పందంతో ఈ కుంభకోణానికి బీజం పడింది. టెండర్‌ దక్కించుకున్న సంస్థ ఉపకరణాల విలువను మార్కెట్‌ ధర కంటే ఎన్నో రెట్లు పెంచేసి మోసానికి పాల్పడింది. వాస్తవానికి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రభుత్వాస్పత్రుల్లో ఉన్న పరికరాలు మొత్తం విలువ రూ.300 కోట్లు లోపే ఉంటుందని, దాన్ని ఏకంగా రూ.508 కోట్లుగా చూపించి ఆ మొత్తానికి 7.45 శాతం చొప్పున నిర్వహణ సేవల పేరుతో నిధులు కొల్లగొట్టారు. ఇందుకోసం ఆ సంస్థకు ఏడాదికి రూ.38.22 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగించిన ఐదేళ్ల కాంట్రాక్ట్‌లో భాగంగా తొలి ఏడాది చెల్లించిన రూ.38.22 కోట్లకు అదనంగా ఏటా పది శాతం చొప్పున నిర్వహణ సేవల మొత్తాన్ని చెల్లించారు. 

మరికొన్ని అక్రమాలు ఇలా..
ప్రకాశం జిల్లా కంభం కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ (సీహెచ్‌సీ)లో రూ.లక్ష విలువైన స్కానింగ్‌ మెషిన్‌ను రూ.2.40 లక్షలుగా చూపించి నిర్వహణ చార్జీలు వసూలు చేశారు. వాస్తవానికి దీనికి గతం నుంచి కృష్ణా డయాగొస్టిక్స్‌ అనే సంస్థ నిర్వహణ కాంట్రాక్ట్‌ కలిగి ఉంది. అంటే ఒకే స్కానింగ్‌ మెషిన్‌కు రెట్టింపు ధర చూపడమే కాకుండా రెండు సంస్థలు బిల్లులు పెట్టుకునే మోసాలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో 200 పైగా వెంటిలేటర్లు ఉన్నట్టు లెక్కల్లో చూపించారు. ఒక్కొక్క వెంటిలేటర్‌ విలువ సుమారు రూ.7.10 లక్షలు కాగా.. రూ.11 లక్షలుగా చూపించారు. వాస్తవానికి వీటికి వారంటీ ఉన్నందున నిర్వహణ వ్యయం అవసరం లేదు. అయినా ధర అధికంగా చూపించి నిర్వహణ చార్జీల మోత మోగించారు. ప్రభుత్వ వైద్యశాలలు, ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య పరికరాల నిర్వహణకు టెక్నీషియన్లు, తగిన విద్యార్హతలు కలిగిన సిబ్బందిని నియమించాలి. అందుకు విరుద్ధంగా నాన్‌ టెక్నీషియన్లను, డిగ్రీ చదివిన వారిని నియమించుకుని తక్కువ జీతాలతోనే ఐదేళ్లు నెట్టుకొచ్చి కోట్లు కొల్లగొట్టినట్టు సీఐడీ పరిశీలనలో తేలింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement