ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ సమయంలో ఏర్పాటు చేసిన 104 కాల్ సెంటర్ లక్షలాది మందికి సంజీవనిలా ఉపయోగపడింది. కోవిడ్ తీవ్ర వ్యాప్తి సమయంలో ప్రభుత్వాస్పత్రుల్లో మినహా ప్రైవేటు ఆస్పత్రులన్నీ ఔట్ పేషెంటు సేవలు మూసేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఫోన్ చేస్తే చాలు సేవలు అందేలా 104 కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయడమే కాక, భారీగా వైద్యులను నియమించారు. వీరు రోజూ వేలాదిమంది రోగులకు ఫోన్ ద్వారా వైద్య సలహాలు, సూచనలు అందించేవారు. ఇలా 104 కాల్‌సెంటర్ ద్వారా ఈనెల 24వ తేదీ నాటికి 11,69,805 మందికి వైద్యసేవలు అందించారు.
కోవిడ్ సోకి హోం క్వారంటైన్ (ఇంట్లోనే ఉండి చికిత్స పొందేవారు)లో ఉన్న వారికి ఇతోధిక సేవలు అందాయి. ఇంట్లో చికిత్స పొందుతూ వైద్యుల సలహాలు, సూచనలు తీసుకున్న వారే 8.36 లక్షల మంది ఉన్నారు. ఇక వివిధ దశల్లో జరిగిన ఫీవర్ సర్వే ద్వారా కోవిడ్ లక్షణాలున్న వారికీ 104 కాల్‌సెంటర్ వైద్యులే వైద్యసహాయం చేశారు. ఇంట్లో చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వమే ఉచితంగా ఐసొలేషన్ కిట్‌లు అందించింది. ఇంత పెద్ద స్థాయిలో ఏ రాష్ట్రంలోనూ కోవిడ్ బాధితులు ఒక కాల్‌సెంటర్ ద్వారా వైద్యసేవలు పొందిన దాఖలాలు లేవని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment