సాక్షి, అమరావతి: రాష్ట్ర విమానయాన రంగానికి కోవిడ్ దెబ్బ గట్టిగానే తగిలింది. ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. 2020–21లో రాష్ట్ర విమాన ప్రయాణికుల్లో ఏకంగా 57 శాతం క్షీణత నమోదైంది. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన గణాంకాల ద్వారా ఈ విషయం వెల్లడైంది. 2020–21లో కోవిడ్ వల్ల విమాన సర్వీసులపై ఆంక్షలు ఉండటంతో ప్రయాణికులు స్వేచ్ఛగా ఎగరలేకపోయారు. రాష్ట్రంలోని విజయవాడ, విశాఖ, రాజమండ్రి, తిరుపతి, కడప ఎయిర్‌పోర్టుల గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. 2019–20లో ఈ 5 ఎయిర్‌పోర్టుల నుంచి 51.65 లక్షల మంది ప్రయాణించగా.. అది 2020–21లో 22.27 లక్షలకు పరిమితమైంది.
ఇదే సమయంలో దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికుల సంఖ్య ఏకంగా 34.10 కోట్ల నుంచి 11.53 కోట్లకు పడిపోయింది. రాష్ట్రంలోని ఐదు విమానాశ్రయాల నుంచి గతేడాది కేవలం 29,874 విమానాలు మాత్రమే ఎగిరాయి. అంతకుముందు ఏడాది 57,680 సర్వీసులతో పోలిస్తే 48.21 శాతం క్షీణత నమోదయ్యింది. ఇక దేశవ్యాప్తంగా విమాన సర్వీసుల సంఖ్య 25.87 లక్షల నుంచి 11.96 లక్షలకు పరిమితమయ్యాయి. దేశీయ విమానయాన రంగం మెల్లగా కోలుకుంటోంది అనుకుంటున్న తరుణంలో కరోనా సెకండ్ వేవ్ రూపంలో ముప్పు ముంచుకొచ్చింది. ఈ ఏడాది కూడా విమాన సర్వీసులు పూర్తిస్థాయిలో నడిచే అవకాశాలు కనిపించడం లేదని విమానయాన సంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు.
విశాఖకు ఆగిపోయిన విదేశీ విమానాలు..
రాష్ట్రంలో 3 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నప్పటికీ.. కేవలం విశాఖకు మాత్రమే అంతర్జాతీయ సర్వీసులు నడుస్తుండేవి. 2019లో విజయవాడ నుంచి సింగపూర్‌కు ఒక ఆరు నెలల పాటు వీజీఎఫ్ కింద విమాన సర్వీసులు నడిపారు. ఆ తర్వాత ఆ స్కీం ఆగిపోవడంతో.. విజయవాడకు అంతర్జాతీయ సర్వీసులు ఆగిపోయాయి. కోవిడ్ వల్ల అనేక అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం ఉండటంతో.. విశాఖకు వచ్చే విదేశీ విమానాల సంఖ్య భారీగా పడిపోయింది. 2019–20లో విశాఖకు 1,885 అంతర్జాతీయ సర్వీసులు నడిస్తే.. ఇప్పుడు ఆ సంఖ్య 89కి పరిమితమయ్యింది. గతంతో పోలిస్తే కేవలం 5 శాతం విదేశీ విమానాలు మాత్రమే గాలిలోకి ఎగిరాయి. దీంతో ప్రయాణికుల సంఖ్య 95 శాతం క్షీణించి.. 1,43,535 నుంచి 7,581కి పడిపోయింది.
విజయవాడకు విదేశీ విమానాల జోరు..
విజయవాడకు 2020–21లో భారీగా విదేశీ విమానాలు వచ్చి వాలాయి. 2019–20లో కేవలం సింగపూర్ నుంచి 52 సర్వీసులు నడవగా.. 2020–21లో ఏకంగా 40కిపైగా దేశాల నుంచి 560కి పైగా విదేశీ విమాన సర్వీసులు నడిచాయి. దీంతో ప్రయాణికుల సంఖ్య కూడా 5,032 నుంచి 72,478కి పెరిగింది. లాక్‌డౌన్‌తో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాస భారతీయులను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ కింద ప్రత్యేక విమాన సర్వీసులు నడిపింది. మన రాష్ట్రానికి వచ్చే వారికోసం అత్యధిక సర్వీసులు విజయవాడ విమానాశ్రయానికి వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment