విశాఖలో మీడియాతో మాట్లాడుతున్న నిర్మలా సీతారామన్. చిత్రంలో మంత్రి బుగ్గన, ఎంపీలు జీవీఎల్, సత్యవతి, ఎమ్మెల్సీ మాధవ్
సాక్షి, విశాఖపట్నం: జూలై నాటికి దేశంలో లక్ష్యానికి మించి వ్యాక్సినేషన్ పూర్తిచేసినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. విశాఖ పట్నంలోని చినవాల్తేరు పట్టణ ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆదివారం ఆమె పరిశీలించారు. అనంతరం నర్సీపట్నం నియోజకవర్గం కేడీ పేటలో విప్లవయోధుడు అల్లూరి సీతారామరాజు సమాధి వద్ద పూలమాలలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అక్కడ నుంచి కశింకోట మండలం తాళ్లపాలెంలో పీడీఎస్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రధానమంత్రి గరీబ్‌కళ్యాణ్ అన్న యోజన ఉచిత బియ్యం పథకం కింద లబ్ధిదారులందరికీ సక్రమంగా అందజేయాలని అధికారులను ఆదేశించారు. రేషన్ డీలర్‌ను పంపిణీ వ్యవస్థపై వివరాలడిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ఇప్పటివరకు సుమారు 50 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసినట్లు చెప్పారు. ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి అయ్యే వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే భరిస్తోందని తెలిపారు.
రానున్న రెండునెలల్లో వ్యాక్సిన్ల సరఫరా పెరుగుతుందన్నారు. దేశీయంగా సరఫరా పెంచడంతోపాటు విదేశీ వ్యాక్సిన్లకు కూడా అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ వివరాలను కలెక్టర్ ఎ.మల్లికార్జున మంత్రికి వివరించారు. రాష్ట్రంలో 2.36 కోట్ల మందికి వ్యాక్సిన్ వేశారని, వారిలో 1.74 కోట్ల మందికి మొదటిడోస్, మిగిలినవారికి రెండు డోస్‌లు వేసినట్లు చెప్పారు. జిల్లాలో 22 లక్షల మందికి వ్యాక్సిన్ వేయగా అందులో 17 లక్షల మందికి మొదటిడోస్, 5 లక్షల మందికి రెండు డోసులు వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఎంపీలు గొడ్డేటి మాధవి, భీశెట్టి సత్యవతి, జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నాథ్, కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్‌గణేష్, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, జాయింట్ కలెక్టర్లు వేణుగోపాలరెడ్డి, అరుణ్‌బాబు, ఆర్డీవో సీతారామారావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు.
అరకు కాఫీ రుచిని ఆస్వాదించిన కేంద్రమంత్రి
కొయ్యూరు: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం అరకు ఎంపీ గొడ్డేటి మాధవి ఏర్పాటు చేసిన తేనేటి విందుకు హాజరయ్యారు. అరకు కాఫీ రుచిని ఆస్వాదించారు. కృష్ణదేవిపేటలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు సమా«ధిని దర్శించి నివాళులర్పించిన మంత్రి అనంతరం అక్కడే ఉన్న ఎంపీ మాధవి అత్తగారి ఇంటికి వచ్చారు. అక్కడ అరకు కాఫీ తాగారు. ఈ సందర్భంగా మన్యం ప్రత్యేకతను, ఇక్కడి వాతావరణ పరిస్థితులను, గిరిజనుల జీవనశైలిని ఎంపీ వివరించారు. ఆమె వెంట రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కూడా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment