
సాక్షి, తిరుపతి: అసెంబ్లీలోనే విపక్షం, స్వపక్షాలు అనే మాట. బయట అందరు ఒకరితో ఒకరు కలిసిపోతారు. ఎక్కడో కొందరు నేతలు మాత్రం బయట కూడా ద్వేషాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇప్పుడిదంతా ఎందుకంటే.. తాజాగా సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఓ ఫోటోపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వివరాలు..
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్‌ను కకావికలం చేసిన సంగతి తెలిసిందే. ఊళ్లకు ఊళ్లే నీట మునిగాయి. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని రాయల చెరువు.. చుట్టుపక్కల ప్రాంత ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది. పై నుంచి వస్తోన్న వరద కారణంగా చెరువు ఎప్పుడు తెగుతుందో అర్థం కాక చుట్టూ పక్కల ఊర్ల జనాలు సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు.
(చదవండి: ప్రమాదకరంగా రాయలచెరువు.. రాత్రంతా చెరువు వద్దే ఎమ్మెల్యే చెవిరెడ్డి)
ఈ క్రమంలో సీపీఐ నాయకుడు నారాయణ బుధవారం రాయలచెరువు సందర్శనకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన అనుకోకుండా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న తిరుపతి ఎంపీ డాక్టర్ గురిమూర్తి నారాయణకు వైద్యం చేశారు.
ఇందుకు సంబంధించిన ఫోటోను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మార్గాని భరత్ రామ్ తన ట్విటర్‌లో షేర్ చేయగా ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. గురుమూర్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు.