శాంతి భద్రతలపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు శ్వేతపత్రం..
నేటి నుంచి కఠినంగా వ్యవహరిస్తాం
ప్రజలు కక్ష తీర్చుకోమని అధికారం అప్పగించలేదు..
గత ప్రభుత్వ హయాంలో నేరాలు పెరిగిపోయాయి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నేటి నుంచి నేరాలు జరిగితే సహించబోమని.. ఎంతటి వారైనా, ఏ పార్టీకి చెందిన వారైనా కఠినమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. గత ఐదేళ్లలో గాడి తప్పిన శాంతి భద్రతలను గాటన పెడతానన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు, నేర చరితులకు స్థానం లేదని చెప్పారు. ప్రజలు కక్ష తీర్చుకోమని మనకు అధికారం ఇవ్వలేదని, రాజకీయ కక్షలు తీర్చుకోవాలనుకోవడం సరి కాదని సూచించారు. పోలీస్ శాఖలో మార్పు తీసుకొచ్చి కొత్త క్రిమినల్ చట్టాలపై అవగాహన పెంచుతామన్నారు. 2019–24 వరకు రాష్ట్రంలో శాంతి భద్రతలు, గంజాయిపై గురువారం శాసనసభలో సీఎం శ్వేతపత్రం విడుదల చేశారు.
రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని, హైదరాబాద్‌లో మతకల్లోలాలను తానే అరికట్టానని చెప్పారు. 2019–24 మధ్య రాష్ట్రంలో చీకటి పాలన నడిచిందని, పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్య పునాదులపై దాడులు చేశారని ఆరోపించారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై తప్పుడు కేసులు పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేశారని, రామతీర్థం విషయంలో అశోక్‌గజపతిరాజుపై కేసులు పెట్టారని చెప్పారు. శస్త్ర చికిత్స చేయించుకున్న అచ్చెన్నాయుడిని అరెస్టు చేసి 600 కి.మీ తరలించారన్నారు.
ప్రశ్నపత్రం లీకైందని పొంగూరు నారాయణపై కేసు పెట్టారని, రఘురామకృష్ణరాజును అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారని ఆరోపించారు. సభలో ఉన్న కూటమి సభ్యుల్లో 80 శాతం మందిపై గత ప్రభుత్వం కేసులు పెట్టిందంటూ ప్రజెంటేషన్ ఇచ్చారు. వినుకొండలో ఇద్దరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గంజాయి మత్తులో దాడులు చేసుకోగా ఒకరు హత్యకు గురైనట్లు మాజీ ఎమ్మెల్యే సైతం ఒప్పుకోగా మాజీ సీఎం మాత్రం శాంతి భద్రతలు విఫలమయ్యాయని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో ప్రతిపక్షాలను నియంత్రించేందుకు జీవో నం.1 తెచ్చి టీడీపీ నాయకులపై 591 కేసులు, జనసేనపై 24 కేసులు పెట్టారన్నారు.
అంగళ్లు, పుంగనూరు దాడుల ఘటనల్లో తిరిగి తనపైనే కేసులు పెట్టారన్నారు. ఐదేళ్లల్లో మహిళలు, ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగిపోయాయని, 300 మంది బీసీలు హత్యకు గురయ్యారని చెప్పారు. గత ఐదేళ్లలో ఎస్సీలపై 10,377, ఎస్టీలపై 1,768, మహిళలపై 89,875, చిన్నారులపై 8,641 ఫోక్సో కేసులు, నేరాలు జరిగాయన్నారు. ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment