
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రారంభించిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పంచాయతీ ఎన్నికలు.. ఒకేసారి రెండూ ఎలా నిర్వహించాలో మార్గనిర్దేశం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16న దేశవ్యాప్తంగా ప్రారంభించిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం రాష్ట్రంలో చురుగ్గా కొనసాగుతోందని పేర్కొంది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్‌తోపాటు న్యాయస్థానాల మార్గదర్శకాల నేపథ్యంలో రాష్ట్రంలో త్వరలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని నివేదించింది. ఈ రెండు లక్ష్యాలను ఏకకాలంలో ఎలా సాధించాలో మార్గదర్శనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్‌కు సోమవారం లేఖ రాశారు. అందులో ముఖ్యాంశాలు ఇవీ...
వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోంది
‘ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 16న దేశవ్యాప్తంగా ప్రారంభించిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొనసాగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో 3.8 లక్షల మంది ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సినేషన్ పూర్తి చేశాం. తరువాత 73,188 మంది పోలీసు సిబ్బందితోపాటు మరో 7 లక్షల మంది ఫ్రంట్‌లైన్ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ చేయించాల్సి ఉంది. పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ విభాగాలతోపాటు ఫ్రంట్‌లైన్ ఉద్యోగులకు 2,041 ప్రదేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించాం.
వ్యాక్సిన్లూ వారికే... ఎన్నికల విధులూ వారే
ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించి ప్రక్రియ ప్రారంభించింది. రాష్ట్రంలో దాదాపు 1,35,000 పోలింగ్ కేంద్రాలుండగా ఐదు లక్షల మందికిపైగా పోలీసు, పంచాయతీరాజ్, రెవెన్యూ, విద్యా శాఖ ఉద్యోగులను ఎన్నికల విధులకు నియోగించాల్సి ఉంది. వారందరూ కోవిడ్ నియంత్రణలో ఫ్రంట్‌లైన్‌లో ఉన్నవారే. అదే ఫ్రంట్‌లైన్ ఉద్యోగులను ఎన్నికల విధుల కోసం వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో నియోగించాల్సి ఉంది. పోలీసు సిబ్బంది విషయంలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో 73,188 మంది మాత్రమే ఉన్న పోలీసు సిబ్బంది 1,35,000 పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంది. వారిలోనే కొంతమందిని ఎన్నికల నియమావళి పరిశీలన, నాన్ బెయిలబుల్ వారంట్ల జారీ లాంటి విధుల్లో నియోగించాల్సి ఉంది. దీంతో ఒక్కొక్కరికి సగటున వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న మూడేసి పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల విధులు కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం పోలింగ్ సిబ్బందిని వారు పనిచేస్తున్న, నివసిస్తున్న ప్రాంతాలకు దూరంగా ఉన్న కేంద్రాల్లో విధులు కేటాయించాలి.
పనిచేసే చోట వ్యాక్సిన్... మరోచోట విధులు
పోలింగ్ విధుల కోసం పెద్ద ఎత్తున అధికారులు, సిబ్బందిని తరలించడంలో పలు సమస్యలు తలెత్తనున్నాయి. ఉద్యోగులకు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న ప్రదేశాల్లోనే వ్యాక్సినేషన్ వేయాల్సి ఉంది. కానీ ఉద్యోగులను పోలింగ్ విధుల కోసం ఇతర ప్రాంతాలకు తరలిస్తే వారికి వ్యాక్సినేషన్ సాధ్యపడదు. కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు ఒక కేంద్రంలో తీసుకున్న సిబ్బంది రెండో డోసు కోసం అదే కేంద్రంలో అందుబాటులో ఉండరు. ఆ తరువాత వారిని కొంతకాలం వైద్య, ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలో ఉంచడం సాధ్యం కాదు. ఏఈఎఫ్‌ఐ (యాంటీ ఎఫెక్ట్స్ ఫాలోయింగ్ ఇమ్యూనైజేషన్) ప్రోటోకాల్ ప్రకారం వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎలాంటి అవాంఛనీయ సమస్యలు తలెత్తకుండా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ఒకరు, దేశంలో మరికొందరు వ్యాక్సిన్ తీసుకున్న వారు మృత్యువాత పడ్డారన్న విషయం మీకు తెలిసిందే. వ్యాక్సిన్ తీసుకున్నవారు ఎలాంటి ఒత్తిడికి గురి కాకూడదు, ప్రశాంత వాతావరణంలో ఉండాలి, వైద్య ఆరోగ్య సిబ్బంది పరిశీలనలో ఉంచాలని కోవిడ్ ప్రోటోకాల్ సూచిస్తోంది.
ఎలా చేయాలో మీరే చెప్పండి..
హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు, కోవిడ్ వ్యాక్సిన్ రెండూ నిర్వహించాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఓవైపు పంచాయతీ ఎన్నికల నిర్వహణ, మరోవైపు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కొనసాగించడం అనే రెండు లక్ష్యాలను సాధించడం ఎలాగో రాష్ట్ర ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేయాల్సిందిగా కోరుతున్నా.
Comments
Please login to add a commentAdd a comment