
గౌరవ వందనం స్వీకరిస్తున్న సీఎస్ సమీర్‌శర్మ
సాక్షి, అమరావతి: భారత గణతంత్రదిన వేడుకలను బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్‌శర్మ జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మన రాజ్యాంగం దేశంలోని పౌరులందరికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పించిందని చెప్పారు. స్వాతంత్య్ర సమరయోధులు, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ సహా ఇతర ప్రముఖుల త్యాగాలను, వారి కృషిని ప్రతి ఒక్కరూ మననం చేసుకోవాల్సిన తరుణమిదని పేర్కొన్నారు.
రెండేళ్లుగా కరోనా పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ సమస్యలను అధిగమించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు విశేషకృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లి సకాలంలో ప్రజలకు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఎనలేని కృషిచేస్తోందని కొనియాడారు. రానున్న రోజుల్లో అధికారులు, సిబ్బంది మరింత చిత్తశుద్ధి, అంకితభావాలతో పనిచేసి ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలందించేందుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. సచివాలయం చీఫ్ సెక్యూరిటీ అధికారి కృష్ణమూర్తి, సచివాలయ అధికారులు, ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి పెద్దిరెడ్డి
గణతంత్ర దినోత్సవం సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ, అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
బాపు మ్యూజియంలో..
విజయవాడ బాపు మ్యూజియంలో దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య 1921లో ఆ జెండాను మహాత్మాగాంధీకి బాపు మ్యూజియం ప్రాంగణంలో అందజేశారు.
బస్ భవన్‌లో..
ఆర్టీసీ ప్రధాన కార్యాలయం విజయవాడలోని బస్‌భవన్ ప్రాంగణంలో ఆర్టీసీ ఈడీ ఎ.కోటేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈడీలు కె.ఎస్.బ్రహ్మానందరెడ్డి, పి.కృష్ణమోహన్, ఆర్థిక సలహాదారు ఎన్.వి.రాఘవరెడ్డి, ఏడీ (విజిలెన్స్–సెక్యూరిటీ) శోభామంజరి తదితరులు పాల్గొన్నారు.
టిడ్కో ఉత్తమ ఉద్యోగులకు సత్కారం
ఈ ఏడాది చివరినాటికి టిడ్కో ద్వారా చేపట్టిన పేదల ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా లబ్ధిదారులకు అందజేసేందుకు కృషిచేయాలని టిడ్కో చైర్మన్ ప్రసన్నకుమార్, ఎండీ సీహెచ్ శ్రీధర్.. అధికారులను, సిబ్బందిని కోరారు. ఏపీ టిడ్కో కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో వారు ప్రసంగించారు. ఉత్తమ సేవలు అందించిన చీఫ్ ఇంజినీర్ గోపాలకృష్ణారెడ్డి, జీఎం హరినాథ్, లైసనింగ్ అధికారి విజయకుమార్, వివిధ విభాగాలకు చెందిన 40 మంది అధికారులు, సిబ్బందిని సత్కరించారు. టిడ్కో డైరెక్టర్లు రాఘవరావు, నాగేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఏపీపీఎస్సీ, ఎస్సెస్సీ బోర్డుల్లో..
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కార్యాలయంలో కమిషన్ చైర్మన్ ఎ.వి.రమణారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సభ్యుడు సలాంబాబు, అధికారులు పాల్గొన్నారు. ఎస్సెస్సీ బోర్డులో డైరెక్టర్ దేవానందరెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. బోర్డు అధికారులు పాల్గొన్నారు.
పవన్‌కళ్యాణ్ పతాకావిష్కరణ
హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్, మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాసయాదవ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
Comments
Please login to add a commentAdd a comment