అంగన్‌వాడీలకు సైబర్‌ నేరగాళ్ల కాల్స్‌ | Cybercriminal calls to Anganwadis Andhra Pradesh | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీలకు సైబర్‌ నేరగాళ్ల కాల్స్‌

Published Thu, Sep 9 2021 3:28 AM | Last Updated on Thu, Sep 9 2021 8:37 AM

Cybercriminal calls to Anganwadis Andhra Pradesh - Sakshi

ప్రత్తిపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్త శోభారాణి, వీవోఏ పద్మ

‘‘హలో మేడం.. మేం సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వైద్య శాఖ సిబ్బంది మాట్లాడుతున్నాం. మీరు సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి దరఖాస్తు చేసుకున్నారు కదా! మీకు అమౌంట్‌ పంపిస్తున్నాం. మీ ఫోన్‌పే నంబరు చెప్పండి. మీరు చెప్పే ఫోన్‌పే నంబరులో కనీసం రూ.మూడు వేలు బ్యాలెన్స్‌ ఉంటేనే నగదు బదిలీ చేయగలం...’’          – ఓ అంగన్‌వాడీ కార్యకర్తకు సైబర్‌ నేరగాడి ఫోన్‌ కాల్‌ 

ప్రత్తిపాడు: గుంటూరు జిల్లాలో సోమవారం పలుచోట్ల సైబర్‌ నేరగాళ్ల నుంచి బాధితులకు ఇలాంటి ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. దీన్ని నమ్మి మోసగాడికి ఓటీపీ వివరాలు వెల్లడించడంతో బ్యాంకు ఖాతా నుంచి క్షణాల్లో డబ్బులు గల్లంతయ్యాయి. ప్రత్తిపాడు మండలంలో ఇద్దరు అంగన్‌వాడీ కార్యకర్తలు, ఒక వీవోఏ ఖాతాల నుంచి సుమారు లక్ష రూపాయల వరకు నగదును కాజేశారు. తమ ఖాతాలో బ్యాలెన్స్‌ లేదని బాధితులు చెప్పడంతో స్నేహితుల ఖాతా వివరాలు ఇవ్వాలని మోసగాడు సూచించాడు. కేవలం మహిళల ఖాతాలకు మాత్రమే డబ్బులు బదిలీ చేస్తామంటూ వల విసిరాడు.  

ఢిల్లీ నుంచి ఫోన్‌ కాల్స్‌.. 
బొర్రావారిపాలెం అంగన్‌వాడీ కార్యకర్తకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి డబ్బులిస్తామంటూ మోసగాడు కాల్‌ చేశాడు. దీన్ని నమ్మిన బాధితురాలు ఫోన్‌పే లేకపోవడంతో తొలుత తన భర్త ఖాతా నుంచి స్నేహితురాలైన వీవోఏ ఖాతాకు రూ.8 వేలు బదిలీ చేసింది. ఆ తరువాత ఫోన్‌కి వచ్చిన ఓటీపీ వివరాలను నేరగాడికి వెల్లడించింది. అంతే రూ.8 వేలతో పాటు వీవోఏ ఖాతాలో ఉన్న రూ.39,996 కూడా కలిపి మొత్తం రూ.47,996 మాయమయ్యాయి. పాతమల్లాయపాలెం గ్రామానికి చెందిన అంగన్‌వాడీ కార్యకర్త అనూరాధకు ఇన్సూరెన్స్‌ డబ్బులు ఇస్తామంటూ ఫోన్‌ కాల్‌ వచ్చింది. సైబర్‌ నేరగాడు ఫోన్‌పే నంబరు అడగడంతో తన కుమారుడికి ఫోన్‌ చేసింది. ఫోన్‌ ఎంగేజ్‌ రావడంతో స్నేహితురాలైన కొత్తమల్లాయపాలెం అంగన్‌వాడీ కార్యకర్త మేడా సీతామహాలక్ష్మి ఫోన్‌పే నెంబరు నేరగాడికి తెలియచేసింది.

ఇక్కడా కూడా సేమ్‌సీన్‌ రిపీట్‌. బాధితుల ఖాతా నుంచి రూ.33,997 మాయమయ్యాయి. ఇది అంతటితో ఆగలేదు. హైదరాబాద్‌లో ఉండే తన సోదరుడు కుంభా వెంకటేశ్వర్లు ఫోన్‌పే నంబరు కూడా ఇవ్వడంతో ఆయన ఖాతా నుంచి రూ.12,990 గల్లంతయ్యాయి. గనికపూడికి చెందిన మరో అంగన్‌వాడీ కార్యకర్తకు నేరగాడు ఫోన్‌ చేసి మీ కుమార్తె ప్రసవానికి రూ.పాతిక వేలు ఇస్తామంటూ నమ్మబలికాడు. ఆమెకు ఫోన్‌పే లేకపోవడంతో తిక్కిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన మరో అంగన్‌వాడీ కార్యకర్త ఫోన్‌పే నంబరును ఇచ్చింది. ఆమె ఖాతా నుంచి రూ.11,999 కట్‌ అయ్యాయి. వీరేకాకుండా గొట్టిపాడు, గనికపూడి గ్రామాలకు చెందిన మరికొందరికి కూడా ఇలాంటి ఫోన్‌ కాల్సే వచ్చినట్లు తెలిసింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అశోక్‌ బుధవారం తెలిపారు. బాధితుల కాల్‌ డేట్‌ను పరిశీలించగా ఢిల్లీ నుంచి ఫోన్‌ కాల్స్‌ వచ్చినట్లు సమాచారం. సైబర్‌ నేరగాడు మాయం చేసిన నగదును తన ఖాతాకు బదిలీ చేసుకోకుండా నేరుగా ఆన్‌లైన్‌ షాపింగ్‌ (పీవోఎస్‌ ట్రాన్సాక్షన్‌) చేసినట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement