సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారికి నగర సీపీ బత్తిన శ్రీనివాసులు, దుర్గగుడి ఈవో సురేష్ బాబు దంపతులు తొలి పూజ నిర్వహించారు. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్న 10వేలమంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి, శనివారం నుంచి మల్లేశ్వరస్వామి వారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తున్నారు. అలాగే పదేళ్లలోపు పిల్లలకు, 60ఏళ్లు పైబడిన వారికి దర్శనానికి అనుమతి నిరాకరిస్తున్నారు. అలాగే కేశఖండన, ఘాట్ల వద్ద స్నానాలు నిషేధం విధించారు. (ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి శరన్నవరాత్రులు)
మూల నక్షత్రం(అక్టోబర్ 21) రోజున తెల్లవారుజమున 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తారు. 24వ తేదీ అమ్మవారిని రెండు అలంకారాలలో భక్తులు దర్శంచుకోనున్నారు. ఉదయం దుర్గాదేవిగా, మధ్యాహ్నం నుంచి మహిసాసురమర్ధని దేవిగా అలంకరిస్తారు. 25వ తేదీ (విజయదశమి) రోజున దుర్గాదేవి శ్రీరాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.
శరన్నవరాత్రి వైభవం - మొదటి రోజు
ఆశ్వయుజు శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు శరన్నవరాత్రులుగా మనం జరుపుకునే దసరా ఉత్సవాలలో శక్తి స్వరూపిణి అయిన దుర్గామాతను వివిధ రూపాలలో ప్రత్యేక విధి విధానాలతో పూజిస్తాం. ప్రథమంగా పాడ్యమి నాడు బెజవాడ కనకదుర్గమ్మని స్వర్ణకవచాలంకారంతో షోడశోపచారాలతో పూజిస్తారు. ఆ రోజు చేమంతి పూలను వినియోగిస్తారు. దుర్గా అష్టోత్తర నామాలతో పూజ చేసి, పులిహోరను నివేదించి అమ్మను స్తుతిస్తారు.
దేవీస్తుతి: సర్వ మంగళమాంగల్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్య్రమ్బకే దేవి నారాయణి నమోస్తుతే
ఈ నవరాత్రి వ్రతం చేయువారు ఉదయం సాయంత్రం విధివిధానాలతో పూజించాలి. నవరాత్రులలో ఇంటికి వచ్చే ముత్తయిదువులకు యధాశక్తి తాంబూలం సమర్పించుకోవాలి.
ఈ వేళ శ్రీశైల భ్రమరాంబికను శైలపుత్రిగా అలంకరిస్తారు.
శ్లోకం: ప్రథమా శైలపుత్రీచ, ద్వితీయ బ్రహ్మచారిణి, తతీయ చంధ్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకీ, పంచమా స్కంద మాతేతి, షష్టా కాత్యాయనేతిచ, సప్తమా కాళరాత్రీచ, అష్టమాచాతి భైరవీ, నవమా సర్వసిద్ధిశ్చాత్నవదుర్గా ప్రకీర్తితా’’.
– డా. దేవులపల్లి పద్మజ
Comments
Please login to add a commentAdd a comment