సాక్షి, విశాఖపట్నం: ‘పరిపాలన రాజధానిగా విశాఖకే జై కొడతాం.. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం వికేంద్రీకరణకే సై అంటాం..’ అంటూ విశాఖ సహా ఉత్తరాంధ్ర అభివృద్ధిని కాంక్షించే మేధావి, వ్యాపార, పారిశ్రామిక, విద్యా, ఉద్యోగ, కార్మిక, కర్షక లోకం గొంతెత్తుతోంది. వికేంద్రీకరణ వద్దంటూ అమరావతి రైతుల పేరిట చేస్తున్న యాత్రపై భగ్గుమంటోంది. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధిని కాదని, కేవలం అమరావతి ప్రాంత అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ నేతలు నడిపిస్తున్న ఈ యాత్రను ఉత్తరాంధ్రలోకి చొరబడనీయమని స్పష్టం చేస్తోంది. వడ్డించిన విస్తరిలాంటి విశాఖలో తక్కువ పెట్టుబడితోనే పాలన రాజధానికి అవసరమైన అన్ని సదుపాయాలూ కల్పించవచ్చని వివరిస్తోంది.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయానికి ముక్త కంఠంతో మద్దతు పలుకుతోంది. విశాఖను పాలన రాజధాని చేయడం చారిత్రక అవసరమని నినదిస్తోంది. ఒకే ప్రాంతంలో రాజధాని ఉంటే రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ను కోల్పోయిన వైనాన్ని గుర్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో వికేంద్రీకరణకు మద్దతుగా శనివారం విశాఖ నగరంలో భారీగా నిర్వహించ తలపెట్టిన ‘విశాఖ గర్జన’ను విజయవంతం చేస్తామని ప్రతి గొంతూ గర్జిస్తోంది. అదే సమయంలో అమరావతి యాత్రను తక్షణమే విరమించుకోవాలని అభ్యర్థిస్తోంది. లేదంటే విశాఖ పరిపాలన రాజధాని అయ్యే వరకు మున్ముందు ఎలాంటి ఉద్యమాలకైనా, త్యాగాలకైనా సిద్ధమని, వెనకడుగు వేయబోమని ప్రతిన బూనుతోంది. వికేంద్రీకరణ, విశాఖ పాలన రాజధాని ఆవశ్యకతపై వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.
చారిత్రక అవసరం..
విశాఖను పరిపాలన రాజధానిగా చేయడం చారిత్రక అవసరం. అప్పుడే ఈ ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది. యువతకు ఉపాధి అవకాశాలు పెరిగి, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోతుంది. వలసల నిర్మూలనకు వీలవుతుంది. రాజధానికి అవసరమైన అన్ని హంగులూ విశాఖలోనే ఉన్నాయి. ఇన్నాళ్లూ గత పాలకులు ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోలేదు. ఇప్పుడు వికేంద్రీకరణలో భాగంగా విశాఖను పరిపాలన రాజధాని చేయాలన్న సీఎం వైఎస్ జగన్ నిర్ణయం హర్షణీయం.
– కృష్ణమోహన్, జేఏసీ సభ్యుడు, న్యాయవాది, ఏపీ బార్ కౌన్సిల్
విశాఖ అంటే వడ్డించిన విస్తరి
రాజధానిగా విశాఖ ఎంతో అనుకూలం. విశాఖ అంటే వడ్డించిన విస్తరి. రాజధానికి అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. రైలు, వాయు, రోడ్డు, సముద్ర మార్గాలున్న ఏకైక నగరమిది. పరిశ్రమలతోపాటు అన్ని రంగాలు అభివృద్ధి చెందడానికి ఎన్నో అవకాశాలున్నాయి. రాష్ట్రంలో అత్యధిక రెవెన్యూ లభిస్తున్న నగరం విశాఖపట్నం. రాష్ట్రంలో వచ్చే ప్రతి వంద రూపాయల్లో 75 రూపాయలు ఇక్కడ్నుంచే వస్తున్నాయనడం అతిశయోక్తి కాదు.
– సత్యనారాయణరెడ్డి (రఘు), చైర్మన్, ఐలా, గాజువాక
వైద్యులందరి మాటా అదే..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ముందుచూపుతో మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. వికేంద్రీకరణతో విశాఖ సహా అన్ని ప్రాంతాలు అభివృద్ధికి నోచుకుంటాయి. సీఎం నిర్ణయానికి మా వైద్యుల సంఘం సంపూర్ణంగా మద్దతు తెలుపుతోంది. విశాఖ గర్జనను అన్ని వర్గాలూ విజయవంతం చేసి విశాఖ రాజధాని ఆవశ్యకతను చాటాలి.
– డా.సుందరరాజు, అధ్యక్షుడు, ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం కేజీహెచ్ యూనిట్
మూడు రాజధానులతో మేలు
వికేంద్రీకరణతో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఇక్కడ పెట్టుబడులు పెరుగుతాయి. ఫలితంగా ఉపాధి, ఉద్యోగావకాశాలతో పాటు మౌలిక వసతులు వృద్ధి చెందుతాయి. ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో వెనుకబడిన ఈ ప్రాంతంలో ఆర్థిక అసమానతలు రూపుమాపడానికి దోహదపడుతుంది. ప్రభుత్వ విధానాన్ని మా చాంబర్ ఆఫ్ కామర్స్ పూర్తిగా స్వాగతిస్తోంది.
– సతీష్, అధ్యక్షుడు, ది వైజాగ్ చాంబర్ ఆఫ్ కామర్స్
హైదరాబాద్ గుణపాఠం కావాలి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ ఒక్కటే రాజధానిగా ఉండటంతో అభివృద్ధి అంతా హైదరాబాద్‌కు పరిమితమైంది. దీంతో రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు అమరావతి ఒక్కటే రాజధాని అయితే మళ్లీ అదే ప్రమాదం పొంచి ఉంది. భవిష్యత్తులో మళ్లీ రాష్ట్ర విభజన సమస్యలు తలెత్తితే మిగిలిన ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయి. గతాన్ని చూసైనా వికేంద్రీకరణకు అందరూ మద్దతివ్వాలి.
– డి.వి.రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి, డీవీఆర్ స్టీల్ ఎంప్లాయిస్ యూనియన్
పారిశ్రామికంగా మరింత అభివృద్ధి
రాష్ట్రంలో మూడు రాజధానుల ఆవశ్యకత ఎంతో ఉంది. విశాఖ పరిపాలన రాజధాని అయితే పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో కొన్ని పరిశ్రమలు వచ్చాయి. విశాఖ పరిసరాల్లో అనేక పరిశ్రమలు రావడానికి ఆసక్తి చూపుతున్నాయి. రాజధాని అయితే మరిన్ని పరిశ్రమలు రావడంతో పాటు ఉత్తరాంధ్రలో అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. విశాఖ పరిపాలనా రాజధాని అయ్యే వరకు ఉద్యమానికి వెనకాడం.
– మంత్రి రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శి, ఐఎన్‌టీయూసీ
ఉత్తరాంధ్రులు ఉద్యమించాల్సిన తరుణమిదే
ఉత్తరాంధ్ర ఎప్పట్నుంచో వెనుకబాటుతో ఉంది. ఈ ప్రాంతీయుల్లో అధికులు పేదలు. విశాఖ పాలన రాజధాని అయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. రాజధానిగా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు. విశాఖ పాలన రాజధాని, వికేంద్రీకరణ కోసం పార్టీలకు అతీతంగా ఉద్యమించాల్సిన తరుణమిదే. ఇది ఉత్తరాంధ్రలో ప్రతి ఒక్కరి బాధ్యత. శనివారం నాటి విశాఖ గర్జనలో వికేంద్రీకరణ కోసం అంతా నినదించాలి.
– పైడిరాజు, రాష్ట్ర కార్యదర్శి, ఎస్‌టీయూ
అన్ని విధాలా ఉత్తరాంధ్ర అభివృద్ధి
విశాఖ కార్యనిర్వాహక రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది. విశాఖలో వ్యాపారాలు మరింతగా విస్తరించి మరెందరికో ఉపాధి లభిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ హోల్‌సేల్ మార్కెట్లు లేవు. విజయవాడ, హైదరాబాద్‌లలో మాత్రమే ఉన్నాయి. ఇక్కడ రాజధాని ఏర్పాటు చేస్తే అవి కూడా వస్తాయి. హైదరాబాద్‌ను మించి ఇక్కడ వ్యాపారాలు జరుగుతాయి. హెల్త్ సిటీగా విశాఖ మరింత ప్రాచుర్యం పొందుతుంది.
– రాపర్తి సుబ్బారావు, వస్త్ర వ్యాపారి, గాజువాక.
విశాఖ గర్జనలో పాల్గొంటున్నాం
మాది గుంటూరు జిల్లా. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో న్యాయ విద్య అభ్యసిస్తున్నాను. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందితేనే అందరికీ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వికేంద్రీకరణతోనే అది సాధ్యం. గతంలో ఒక్క హైదరాబాద్‌నే అభివృద్ధి చేయడం వల్ల విభజనతో అన్నింటినీ వదిలేసి రావాల్సి వచ్చింది. ఆ తప్పు పునరావృతం కాకూడదు. అందువల్లే మేమంతా వికేంద్రీకరణకు మద్దతు తెలుపుతూ శనివారం జరిగే విశాఖ గర్జనలో పాల్గొంటున్నాం.
– కర్నేటి సాయికృష్ణ, న్యాయ విద్యార్థి, ఏయూ, విశాఖపట్నం
వికేంద్రీకరణతో ఏపీ అభివృద్ధి
రాజధానికి కావాల్సిన అన్ని అర్హతలున్న నగరం విశాఖ. ఓ వైపు అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఆరు వరుసల జాతీయ రహదారి, రైలు, జల రవాణా ఉన్న ఏకైక సిటీ. పర్యాటకంగా ఎంతో అభివృద్ధి సాధించింది. విద్య, వైద్య రంగాలకు పెట్టింది పేరు. అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల వారిని అక్కున చేర్చుకుంటున్న వైజాగ్.. పరిపాలన రాజధానిగా మారితే ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. దేశంలోనే ఆత్యధిక జీడీపీ కలిగిన పది నగరాల్లో మన విశాఖ ఒకటి. విశాఖ రాజధాని కావాలి. ఇందుకు అందరూ మద్దతు పలకాలి.
– మేడపాటి రమేష్ రెడ్డి, ఎండీ, స్వాతి ప్రమోటర్స్
Comments
Please login to add a commentAdd a comment