సాక్షి, అమరావతి: ఏపీలో కుల గణన చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం చరిత్రాత్మకమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం అధ్యక్షుడు ఎన్.మారేష్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ బీసీ సంఘాల నాయకులు క్షీరాభిషేకం చేశారు.
అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీలకు మేలు చేసే విషయంలో సీఎం జగన్ దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. కుల గణనను పూర్తి పారదర్శకంగా జరిపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీని వల్ల ఏ కుల జనాభా ఎంత అనేది స్పష్టంగా తెలుస్తుందన్నారు. తద్వారా వారికి దక్కాల్సిన ఫలాలు అందుతాయన్నారు. సీఎం జగన్ గత నాలుగేళ్ల పాలనలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు.
అలాగే పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టించడం ద్వారా దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారేష్ మాట్లాడుతూ.. సర్పంచ్ నుంచి రాజ్యసభ స్థానాల వరకు బీసీలకు రాజ్యాధికారంలో 65 శాతానికి పైగా వాటా ఇచ్చిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందన్నారు. ఇప్పుడు కుల గణన చేపట్టడం బీసీల జీవితాల్లోనే మర్చిపోలేని అంశమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభివృద్ధి ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాల నాయకులు రాజేందర్, వెంకట సుబ్బారావు, జనార్ధన్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment