ఆరిలోవ(విశాఖ తూర్పు): డీఈవో జాయింట్ అకౌంట్‌లోని అమ్మఒడి సొమ్ము రూ.3.42 కోట్లు భద్రంగా ఉందని జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. ఈ ఖాతా నుంచి రూ.30 లక్షలు విత్‌డ్రా చేసి దుర్వినియోగం చేశారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో అమ్మ ఒడి పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్టు చెప్పారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన చేపట్టినప్పటి నుంచి వరుసగా రెండేళ్ల పాటు జిల్లాలో అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేశామన్నారు. 2019–20లో పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ, ఇతర అవసరాల కోసం విద్యార్థుల తల్లులు స్వచ్ఛందగా రూ.1000 చొప్పున అందజేశారని తెలిపారు. ఈ మొత్తాన్ని డీఈవో జాయింట్ అకౌంట్‌లో జమ చేశామన్నారు.
ప్రస్తుతం ఆ నగదు రూ.3.42 కోట్లు పదిలంగా ఉన్నట్టు చెప్పారు. ఈ ఖాతా నుంచి రూ.30 లక్షలు విత్‌డ్రా చేసి దుర్వినియోగం చేశారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఈ నగదు నిల్వపై ఇంతవరకు ఎలాంటి ఆడిట్ జరగలేదన్నారు. ప్రస్తుతం నాడు–నేడు నిధులతో జిల్లాలోని పాఠశాలల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఈ పథకంలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నట్టు వివరించారు.
దీంతో ప్రత్యేకంగా ఎక్కడా అమ్మ ఒడికి సంబంధించిన డబ్బులు వినియోగించలేదని స్పష్టం చేశారు. ఎప్పుడైనా వాటి అవసరం వస్తే ప్రభుత్వం ఆదేశాల మేరకు.. విత్ డ్రా చేసి పాఠశాలల్లో పనులు జరిపిస్తామన్నారు. దీనికి సంబంధించిన వాస్తవాలు తెలుసుకోకుండా మాజీ మంత్రి అధికారులపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు.
చదవండి: భావోద్వేగాలను రెచ్చగొట్టడం తగదు
Comments
Please login to add a commentAdd a comment