సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరిశ్రమలకు అవసరమైన నిపుణుల వివరాలను తెలుసుకోవడానికి పరిశ్రమల శాఖ భారీ సర్వేను చేపట్టింది. ఇందుకోసం ‘సమగ్ర పరిశ్రమ సర్వే’ యాప్‌ను అభివృద్ధి చేసింది. దీని ద్వారా రాష్ట్రంలో 900 మెగా, లార్జ్ కంపెనీలతోపాటు 97 వేలకుపైగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) నుంచి వివరాలు సేకరిస్తారు.
► సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు.. వచ్చే మూడేళ్లలో ఎంత మంది ఉద్యోగులు అవసరమవుతారు? ఏయే రంగాల్లో నైపుణ్యం ఉన్నవారు కావాలనే వివరాలను పరిశ్రమల నుంచి సేకరించనున్నట్లు పరిశ్రమల శాఖ జేడీ ఉదయ్‌భాస్కర్ ‘సాక్షి’కి తెలిపారు.
► ఇప్పటికే పరిశ్రమ ఆధార్ పేరుతో యూనిట్లకు సంబంధించిన 70 కాలమ్స్‌లో సమాచారాన్ని సేకరిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు ఈ యాప్ ద్వారా మరో 30 కాలమ్స్‌తో అదనపు సమాచారం సేకరించనుంది.
► ప్రతి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద సర్వే నిర్వహించనున్నారు.
► ఈ సమగ్ర సర్వే కోసం జిల్లాలవారీగా జిల్లా సంయుక్త కలెక్టర్–2 చైర్మన్‌గా జేసీ–3 వైస్ చైర్మన్‌గా, పరిశ్రమల శాఖ జీఎం కన్వీనర్‌గా ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో శిక్షణ
► రాష్ట్రంలోని పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
► పరిశ్రమలకు నైపుణ్యం కలిగిన యువతను అందించడానికి 30 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.
► ఈ సర్వేలో వచ్చిన సమాచారం ఆధారంగా కంపెనీలకు కావాల్సిన రంగాల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో యువతకు శిక్షణ ఇస్తారు.
► ఇందుకోసం ఆయా కంపెనీలు.. నైపు ణ్యాభివృద్ధి కేంద్రాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి.
► రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమలకు నైపుణ్యం కలిగిన వారిని అందించడంతోపాటు వాటి అవసరాలను గుర్తించి.. పారిశ్రామిక విధానాల్లో మార్పులు చేర్పులు చేయాలన్నదే సర్వే లక్ష్యమని అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment