నరసన్నపేట: ఎర్రగా మండే నిప్పులు.. పైన వెదురుపుల్లలకు గుచ్చిన చిన్నచిన్న మాంసపు ముక్కలు.. వాటిపై నిమ్మరసం చుక్కలు.. ఈ వంటకం సిక్కోలు ఈవినింగ్ స్నాక్. పేరు చీకులు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో లభిస్తున్నా ‘నరసన్నపేట చీకులది’ మాత్రం ప్రత్యేక రుచి అంటున్నారు మాంసాహార ప్రియులు. దీనిని ఆరగించేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు ఒడిశాలోని పర్లాకిమిడి, బరంపురం, గుణపురం నుంచి వచ్చి లొట్టలేసుకుంటూ తింటున్నారు భోజనప్రియులు.
పక్కా లోకల్..
స్థానికంగా లభించే కారం, మసాలా దినుసుల్నే చీకుల తయారీకి వినియోగిస్తామని చెబుతున్నారు వ్యాపారులు. మార్కెట్‌లో లభించే ఎలాంటి కృత్రిమ మసాలాలు గానీ, హానికరమైన రంగులు, ఇతర పదార్థాలను వాడమని అందుకే వీటి రుచి విభిన్నమైనదనేది వారి మాట.
తయారీ ఇలా..
మాంసపు ముక్కల్ని చిన్నగా ఒకటే సైజ్‌లో కట్ చేస్తారు. వాటిని మసాలా, కారం ఇతర పదార్థాలతో చేసిన మిశ్రమంలో నాలుగు గంటల సేపు ఉంచుతారు. తరువాత వెదురుపుల్లలకు ఈ ముక్కల్ని గుచ్చి.. ఎర్రగా కాలుతున్న బొగ్గులపై పెడతారు. 10 నిమిషాలు సేపు బాగా ఉడికిన తరువాత వడ్డిస్తారు.
ఏఏ రకాలు..
►చికెన్, లివర్, రొయ్యలతో చీకులను తయారు చేస్తారు. ఒక్కో రకానిదీ ఒక్కో రేటు.
►నరసన్నపేట బజారు వీధిలో 20 ఏళ్ల నుంచి చీకుల్ని విక్రయిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment