సాక్షి, అమరావతి బ్యూరో/ జి.కొండూరు/ మైల వరం/హనుమాన్ జంక్షన్: ప్రశాంతంగా ఉన్న కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావును హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో పోలీసులు మంగళవారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. తన అనుచరులను, టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి గడ్డమణుగు గ్రామస్తులపై దాడి చేయించిన ఉమాకు మైలవరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తన హయాంలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి దేవినేని ఉమా కొంతకాలంగా స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌పై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు. వాటిని ఆధారాలతో సహా ఎమ్మెల్యే తిప్పికొట్టడంతో ఉమా నియోజకవర్గంలో అల్లర్లకు కుట్ర పన్నారు.
కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయంటూ హంగామా మొదలుపెట్టారు. వాస్తవానికి అక్కడ తవ్వకాలకు అనుమతులను టీడీపీ హయాంలో దేవినేని ఉమానే ఇప్పించాడు. తన బండారం ఎక్కడ బయటపడుతుందోనన్న ఉద్దేశంతో దేవినేని వ్యూహాత్మకంగా మంగళవారం కొండపల్లిలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి కొండపల్లి రిజర్వ్ ఫారెస్టుకు వెళ్లి.. వైఎస్సార్‌సీపీ నేతల ప్రోద్బలంతోనే తవ్వకాలు జరుగుతున్నాయంటూ ముందే సిద్ధం చేసుకున్న స్క్రిప్ట్ ప్రకారం ఎల్లో మీడియాలో ఊదరగొట్టించారు. ఈ విషయం తెలుసుకున్న జి.కొండూరు మండలం గడ్డమణుగు గ్రామస్తులు మంగళవారం రాత్రి దేవినేని ఉమాను అడ్డుకున్నారు.
‘నువ్వు అధికారంలో ఉండగా చేసిన అడ్డగోలు పనులను ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌కు అంటగడుతున్నావ్.. దీనికి సంజాయిషీ చెప్పాలి’ అంటూ ఉమాను నిలదీశారు. పోలీసులు వెంటనే స్పందించి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఘటనపై ఫిర్యాదు చేసేందుకు గ్రామస్తులతో పాటు వైఎస్సార్‌సీపీ నాయకుడు పాలడుగు దుర్గాప్రసాద్ జి.కొండూరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. దేవినేని ఉమా కూడా తన అనుచరగణంతో పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. 4 గంటలకు పైగా పోలీస్‌స్టేషన్ వద్ద కారులోనే ఉన్న ఉమా తన అనుచరులను రెచ్చగొట్టారు. దీంతో వారంతా కలిసి పాలడుగు దుర్గాప్రసాద్‌తో పాటు ఆయన డ్రైవర్ సురేష్ తదితరులపై దాడి చేశారు. పోలీస్‌స్టేషన్ ముందే దుర్గాప్రసాద్ కారును ధ్వంసం చేశారు. దళితుడైన సురేష్ తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి అదుపు తప్పడంతో దేవినేని ఉమాను పోలీసులు అరెస్టు చేసి నందివాడ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో అశాంతి రేపడానికి దేవినేని ఉమా, టీడీపీ నాయకులు ఎత్తుగడ వేశారని గడ్డమణుగు గ్రామస్తులు మండిపడ్డారు.
వర్చువల్‌గా కోర్టుకు హాజరు..
మైలవరం కోర్టుకు ఉమాను తీసుకొస్తారన్న సమాచారం తెలుసుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు బుధవారం పెద్ద ఎత్తున కోర్టుకు చేరుకొని హల్‌చల్ చేశారు. దీంతో పోలీసులు దేవినేని ఉమాను నందివాడ నుంచి హనుమాన్ జంక్షన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచే జూమ్ యాప్ ద్వారా వర్చువల్‌గా మైలవరం న్యాయమూర్తి షేక్ షెరీన్ ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం దేవినేని ఉమాకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఆయనతో పాటు నిందితులుగా ఉన్న తెలుగు యువత నాయకుడు లీలా ప్రసాద్, డ్రైవర్ ప్రసాద్‌ను పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment