సైకిల్ పార్టీలో ఆయనో సీనియర్ నాయకుడు. అంతా నాకే తెలుసు .. నాకు మాత్రమే తెలుసనుకునే ఆ నేతను ఇప్పుడు సొంత కేడరే వద్దనుకుంటుందట. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిని మార్చాల్సిందే అని స్థానిక నేతలు గట్టిగా పట్టపడుతున్నారట. కేడర్‌లో పెరుగుతున్న అసంతృప్తిని ఆశావహులు మరింత రెచ్చగొడుతున్నారు. టిక్కెట్ రేస్‌లో ఉన్నామనే సంకేతాలు పంపుతున్నారట. ఆ నాయకుడెవరో? ఆ నియోజకవర్గం ఎక్కడుందో ఓ లుక్కేద్దాం.
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో తనకు ఎదురే లేదని చెప్పుకునే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సొంత నియోజకవర్గంలోనే ఎదురుగాలి వీస్తోందట. నియోజకవర్గాల పునర్విభజనతో దేవినేని ఉమా నందిగామ నుంచి మైలవరానికి వలస వచ్చారు. స్థానిక నేత కాకపోయినా మైలవరం నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు, ప్రజలు ఉమాను ఆదరించి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. అయితే మంత్రి అయిన తర్వాత, గత ఐదేళ్ల కాలంలో పార్టీ కేడర్‌ను దేవినేని ఉమ అసలు పట్టించుకోలేదని.. ఒంటెద్దు పోకడలు పోతూ.. అంతా తనకే తెలుసనే అహంభావంతో మెలిగాడని మైలవరం టీడీపీలో టాక్ నడుస్తోంది. దీంతో చాలామంది కార్యకర్తలు, స్థానిక నేతలు ఆయనకు దూరమైపోయారట. 2019 ఎన్నికల్లో ఓడిపోవడంతో ఇక ఉమా మైలవరాన్ని పూర్తిగా పట్టించుకోవడం మానేశారట. ఏవైనా పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలుంటే మాత్రం వచ్చి అటెండెన్స్ వేయించుకుని వెళ్లిపోతున్నారట. ఈక్రమంలోనే ఉమాతో పార్టీ కేడర్‌కు దూరం బాగా పెరిగి ఈసారి ఉమా మాకొద్దు అనే స్థాయికి చేరిందట. వలస వచ్చిన నాయకుడైనా నెత్తిన పెట్టుకున్నందుకు కనీసం తమకు అండగా నిలవని ఉమా తమకు వద్దే వద్దంటూ అధినేత చంద్రబాబుకు తేల్చి చెప్పేశారట మైలవరం యెల్లో కేడర్.
మైలవరం సీటు నాకే ఇవ్వాలి..
ఇదిలా ఉంటే.. ఇటీవల మైలవరంలో దేవినేని ఉమాకు బొమ్మసాని సుబ్బారావు కంట్లో నలుసులా మారారట. ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న బొమ్మసాని సుబ్బారావు ఈసారి మైలవరం టిక్కెట్ దక్కించుకోవాలని తహతహలాడుతున్నారట. అందుకే గత ఆరునెలలుగా ఉమాకు వ్యతిరేకంగా నియోజకవర్గ నేతల్ని తనవైపునకు తిప్పుకుంటూ.. మైలవరంలో సెపరేటుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట. కేవలం పార్టీ కార్యక్రమాలకే పరిమితం కాకుండా.. ఈసారి తనకే టిక్కెట్టివ్వాలని.. అడిగే హక్కు తనకే ఉందని బహిరంగంగానే పోటీ గురించి దేవినేనికి సంకేతాలు పంపిస్తున్నారట. ఆ మధ్య ఆత్మీయ సమావేశంలో తన మద్దతుదారులతో బలప్రదర్శన చేసి సక్సెస్ అయ్యాడట సుబ్బారావు. తాజాగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం విడిగా నిర్వహించడంతో పాటు బూత్ లెవల్ మీటింగ్ లు పెట్టి మైలవరంలో పోటీకి నేనూ అర్హుడినే అంటూ ఓపెన్ గానే తన వాయిస్ వినిపించారట. దేవినేని ఉమాకోసం ఎంతో చేశా.. ఎప్పుడూ వేరే వాళ్లకోసం కష్టపడటమేనా పార్టీ తన వంటి సీనియర్లను గుర్తించాలి. మైలవరం సీటు తనకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట.
తన వెనుక, ముందు జరుగుతున్న పరిణామాలతో దేవినేని ఉమాలో కలవరం మొదలైందనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే కేడర్‌కు తనపై ఉన్న అసంతృప్తిని ఎలా తగ్గించుకోవాలో తెలియక సతమతమవుతుంటే.. ఇప్పుడు బొమ్మసాని ఓపెన్ ఛాలెంజ్‌లు ఉమాను మరింతగా టెన్షన్ పెడుతున్నాయట.
Comments
Please login to add a commentAdd a comment