పోలవరం రూరల్/ గోపాలపురం/బుట్టాయగూడెం : ముందస్తు సమాచారం ఇవ్వకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పరిశీలిస్తామంటూ టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ, టీడీపీ నేత బొరగం శ్రీనివాసరావులు పోలవరం ఏటిగట్టు సెంటర్‌కు చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. శనివారం ఉదయం 10 గంటల సమయంలో రహస్యంగా మాజీ మంత్రి ఏజెన్సీ గ్రామాల్లోని రోడ్డు మార్గం మీదుగా మోటార్ సైకిల్‌పై స్థానిక ఏటిగట్టు సెంటర్‌కు చేరారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది.
టీడీపీ హయాంలో పనులు జరిగాయని, ఇప్పుడు ఎంతవరకు జరిగాయో చూస్తామంటూ వాదించారు. ఈ క్రమంలో డీఎస్పీ కె.శ్రీనివాసులు, సీఐ కె.విజయబాబులు వారిద్దరినీ పోలీస్ వాహనంలో ఎక్కించి బుట్టాయగూడెం స్టేషన్‌కు తరలించారు. కన్నాపురం అడ్డరోడ్డు వద్ద టీడీపీ మాజీ మంత్రి కేఎస్ జవహర్‌ను కూడా అడ్డుకుని అక్కడ నుంచే పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
ఇదిలా ఉండగా, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామారాయుడు, మాజీ ఎమ్మెల్యేలు గన్ని వీరాంజనేయులు, బడేటి చంటి, ముప్పిడి వెంకటేశ్వరరావు, గోపాలపురం నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి మద్దిపాటి వెంకటరాజులు పోలవరం ప్రాజెక్టు వద్దకు ఏలూరు నుంచి బయలు దేరారు. గోపాలపురం మండలం కొవ్వూరుపాడు వద్దకు చేరు కోగానే పోలీసులు వారిని అడ్డుకుని, గోపాలపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అనంతరం పలువురు టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని హడావుడి చేశారు. తర్వాత పోలీసులు టీడీపీ నేతలను విడుదల చేశారు. అనంతరం ఉమ మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అన్యాయం జరుగుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment