తుగ్గలి సమీపంలో వజ్రాన్వేషణ చేస్తున్న జనం (ఫైల్)
తుగ్గలి: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో తాజాగా మరో రెండు వజ్రాలు లభ్యమైనట్లు తెలిసింది. పొలం పనులకు వెళ్లిన ఓ కూలీకి దొరికిన ఒక వజ్రాన్ని అదే గ్రామానికి చెందిన వజ్రాల వ్యాపారి రూ.70 వేలకు కొనుగోలు చేయగా, ఇంకో వ్యక్తికి దొరికిన మరో వజ్రాన్ని మద్దికెర మండలం పెరవలి గ్రామానికి చెందిన వ్యాపారి రూ.40 వేలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. గురువారం ఇదే గ్రామంలోని ఓ రైతుకు పొలంలో రూ.1.2 కోట్ల విలువైన వజ్రం దొరికినట్లు వార్తలు వెలువడ్డాయి. రెండ్రోజుల వ్యవధిలో మూడు వజ్రాలు లభ్యమవడంతో జనం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పొలాల్లో వాలి పోతున్నారు. ఏటా తొలకరి వర్షాలకు ఈ ప్రాంతంలో చిన్నా పెద్దా 50 దాకా వజ్రాలు లభ్యమవుతుంటాయి.
దొరికేది ఇక్కడే..
తుగ్గలి మండలంలోని జొన్నగిరి, చిన్న జొన్నగిరి, రామాపురం, జి.ఎర్రగుడి, గిరిజన తండాలు, పగిడిరాయి, బొల్లవానిపల్లి, ఉప్పర్లపల్లి, పి.కొత్తూరు, చెన్నంపల్లి, గిరిగెట్ల, తుగ్గలి, ఉసేనాపురం, రాంపల్లి, రామలింగాయపల్లితో పాటు మద్దికెర మండలంలో పెరవలి, బసినేపల్లి ప్రాంతాల్లో వజ్రాలు లభ్యమవుతుంటాయి.
ఇదీ చరిత్ర..
రాయల కాలంలో ఇక్కడ రత్నాలు, వజ్రాలను రాశులుగా పోసి అమ్మే వారని నానుడి. జొన్నగిరిని స్వర్ణగిరి అని పిలిచే వారని చెబుతారు. అశోకుడు జొన్నగిరికి రెండు కిలోమీటర్ల దూరంలో కొండలో పెద్ద బండరాళ్లపై శాసనాలను చెక్కించారు.
ఏటా వజ్రాలు లభ్యం..
ప్రతి ఏటా తొలకరి వానలు కురవగానే ఈ ప్రాంతంలో వజ్రాన్వేషణ కొనసాగుతుంది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్ జిల్లా నుంచి జనం ఇక్కడి వచ్చి వజ్రాన్వేషణ చేస్తుంటారు. కొందరు రెండు మూడు నెలల పాటు ఇక్కడే ఉంటూ వెతుకుతారు. పొలం పనులు చేసే సమయంలోనూ కూలీలు, రైతులకు వజ్రాలు దొరుకుతుంటాయి. తెలుపు, ఎరుపు, తేనె వర్ణం వంటి రంగులలో వజ్రాలు లభిస్తుంటాయి. రూ.2వేల నుంచి లక్షల విలువ చేసే వజ్రాలు ఏటా దాదాపు 20 నుంచి 50కి పైగా దొరుకుతుంటాయి.
ఆధారాలు ఉండవని అధికారులు పట్టించుకోరు..
వజ్రం దొరికినట్లు ఎలాంటి ఆధారాలు దొరకక పోవడంతో అధికారులు ఏమీ చేయలేక పోతున్నారు. వజ్రం దొరికినట్లు తెలుస్తుందే తప్ప అమ్మకం తర్వాత దొరకలేదని, వజ్రం కాదన్నారని చెబుతుండడంతో అధికారులు ఏమీ చేయలేక పోతున్నారు. వజ్రం దొరికితే పోలీసులు, రెవెన్యూ అధికారులకు వ్యాపారుల నుంచి కమీషన్ అందుతుందనే ఆరోపణలు ఉన్నాయి.
గుట్టుగా విక్రయం..
దొరికిన వజ్రాలను కొందరు గుట్టుగా అమ్ముకుంటారు. మరికొందరు ధర నచ్చక పోతే టెండరు పద్ధతిలో అమ్ముతారు. తుగ్గలి మండల జొన్నగిరి, మద్దికెర మండలం పెరవలి, అనంతపురం జిల్లా గుత్తికి చెందిన వజ్రాల వ్యాపారులు వజ్రాలు కొనుగోలు చేస్తుంటారు. వీరు సీజన్‌లో వజ్రాల సమాచారం తెలుసుకునేందుకు కొందరిని నియమించుకొని వారిని అన్ని విధాలా చూసుకుంటారు. వజ్రాలను కొనుగోలు చేసిన వ్యాపారులు ముంబయి, చెన్నై, బెంగళూరు తదితర రాష్ట్రాల్లో అమ్ముతారు. క్యారెట్ల రూపంలో లెక్కించి వజ్రాలను కొనుగోలు చేస్తారు. ఒక్కోసారి వ్యాపారులు కుమ్మక్కై వజ్రాలను తక్కువ ధరకే కొనుగోలు చేస్తారు. దాని విలువ ఎవరికీ తెలియక పోవడంతో ఒక్కోసారి వజ్రం దొరికిన వారు మోస పోతుంటారు.
చదవండి: ఖాకీ దందా: చిన్నసారు.. పంచాయితీ!
రహదారుల అభివృద్ధికి రూ.6,421 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment