దాచేపల్లి మండలం అంజనాపురంలో విజృంభించిన అతిసారం
ఇద్దరు మృతి.. ఆసుపత్రుల్లో మరో 14 మందికి చికిత్స
జూలైలోనే డయేరియాకు 3 మండలాల్లో 10 మంది మృతి
కలుషితనీరు, అపారిశుద్ధ్యం కారణమని అధికారుల నిర్ధారణ
సరైన చర్యలు చేపట్టని ప్రభుత్వం
ఇప్పుడు మరోసారి డయేరియా విజృంభణ
సాక్షి, నరసరావుపేట, దాచేపల్లి: చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో డయేరియా వేగంగా విస్తరిస్తోంది. విజయనగరం జిల్లా గుర్ల మండలంలో 14 మందిని బలితీసుకున్న అతిసారం.. ఇప్పుడు పల్నాడు జిల్లాలోనూ మృత్యు ఘంటికలు మోగిస్తోంది. దాచేపల్లి మండలంలో బుధవారం వ్యాధి ప్రబలి, ఇద్దరు చనిపోగా, 14 మంది ఆస్పత్రుల పాలయ్యారు.
జూలై నెలలోనే పల్నాడు జిల్లా దాచేపల్లి, పిడుగురాళ్ల, కారంపూడి మండలాల్లో డయేరియా కేసులు నమోదై, పలువురు మరణించారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో చర్యలు చేపట్టకపోవడంతో ఇప్పుడు దాచేపల్లి మండలంలో మరోసారి వ్యాధి విజృంభించింది. దాచేపల్లి పంచాయతీ అంజనాపురంలో బుధవారం నుంచి వాంతులు, విరేచనాలతో అనేక మంది ఆస్పత్రులపాలయ్యారు. వీరిలో బండారు చిన్న వీరయ్య(58), తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటేష్ (21) బుధవారం రాత్రి మృతి చెందారు.
వీరిలో చిన్న వీరయ్య మంగళవారం నుంచే వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వెంకటేశ్వర్లు బుధవారం మధ్యాహ్నం వ్యాధి బారిన పడ్డారు. కుటుంబ సభ్యులు స్థానికంగా చికిత్స చేయించి, మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట తరలిస్తుండగా దారి మధ్యలోనే చనిపోయాడు.
తాగు నీరు కలుషితం అవడంవల్లే..
తారు నీరు కలుషితం కావడం వల్లే డయేరియా వ్యాప్తి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అంజనాపురం కాలనీ ప్రజలకు తాగు నీరు అందించే బోరు సమీపంలో సెప్టిక్ ట్యాంక్ నీళ్లు, మురికి కాలువల్లోని నీరు చేరటం వల్లే కలుషితమైనట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు గ్రామంలో పారిశుధ్యం నిర్వహణ కూడా అధ్వానంగా ఉంది. మురికి కాలువల్లో చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోంది.
పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్‌బాబు గురువారం అంజనాపురం కాలనీలో పర్యటించి బాధితులతో మాట్లాడారు. సురక్షితమైన తాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. కా>గా, అంజనాపురంలో డయేరియాతో ఇద్దరు మృతికి కూటమి ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బాధ్యత వహించాలని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్‌కు సీఎం ఆదేశం
సాక్షి, అమరావతి: పల్నాడు జిల్లాలో అతిసారంపై సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. దాచేపల్లిలో పరిస్థితి, ప్రభుత్వపరంగా తీసుకున్న చర్యలను కలెక్టర్ సీఎంకు వివరించారు. ఆ ప్రాంతంలో సాధారణ స్థితి వచ్చేంతవరకు నిత్యం పర్యవేక్షించాలని సీఎం సూచించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని సీఎం ఆదేశించారు.
జూలైలో వ్యాధి ప్రబలినా సరైన చర్యలు చేపట్టని సర్కారు
జూలై నెలలోనే జిల్లాలో అతిసారం వ్యాధి వ్యాప్తి చెందిందని, అప్పుడే చంద్రబాబు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు వ్యాపించి ఉండేది కాదని స్థానికులు చెబుతున్నారు. ఆ నెలలో దాచేపల్లి మండలం కేసానుపల్లిలో డయేరియాకు వంగూరి నాగమ్మ అనే మహిళ మృతి చెందగా, మరో 30 మంది ఆస్పత్రి పాలయ్యారు. అదే సమయంలో పిడుగురాళ్ల, కారంపూడి మండలాల్లోనూ పదుల సంఖ్యలో డయేరియా బారినపడ్డారు.
9 మంది మృత్యువాత పడ్డారు. అప్పట్లో మంత్రి నారాయణ ఒకరోజు హడావుడి చేసి వెళ్లిపోయారు. తాగునీరు కలుషితమవడం, పారిశుధ్య నిర్వహణ సరిగాలేకపోవడమే డయేరియాకు కారణమని నిర్ధారణకు వచ్చారు. అయినా, రక్షిత నీరు అందించడానికి, పారిశుద్ద్యం మెరుగుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. దీంతో మరోసారి జిల్లాలో డయేరియా వ్యాప్తి చెందింది.
Comments
Please login to add a commentAdd a comment