కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కేఎస్ జవహర్‌కు మరోసారి అసమ్మతి సెగ తగిలింది. ఫ్లెక్సీల ఏర్పాటుపై దొమ్మేరు గ్రామంలో ఆ పార్టీ నాయకులు శుక్రవారం సమావేశమై ఆయనపై బహిరంగంగా విమర్శనా్రస్తాలు సంధించగా.. ఇప్పుడు అధిష్టానం పెద్దలకు శనివారం రాత పూర్వకంగా ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నవేళ టికెట్ ఖరారయ్యే అభ్యర్థుల జాబితాలో ఈయన పేరు పరిశీలనకు వచ్చిన తరుణంలో ఈ పరిస్థితి తలెత్తడం విశేషం. కొవ్వూరు పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో శనివారం సాయంత్రం నిర్వహించిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో నియోజకవర్గ ద్విసభ్య కమిటీకి స్థానిక నాయకులు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జవహర్ స్థానిక నాయకత్వాన్ని సంప్రదించకుండా నియోజకవర్గంలో కొందరికి పదవులు కట్టబెట్టారని, అధిష్టానం ఆదేశాలను కూడా లెక్క చేయకుండా కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జోన్–2 ఇన్‌చార్జి మందలపు రవి, నియోజకవర్గ పరిశీలకుడు గొర్రెల శ్రీధర్‌కు ఫిర్యాదు చేయగా, నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ ఆదేశించారని, అయినప్పటికీ ఆయన నాయకుల మధ్య కలహాలు పెడుతున్నారని ఆరోపించారు.
తన పుట్టిన రోజు సందర్భంగా స్థానిక నాయకుల ప్రమేయం లేకుండా నియోజకవర్గంలో జవహర్ శుక్రవారం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని చెప్పారు. ఇకపై కొవ్వూరు నియోజకవర్గంలో ఆయన ప్రమేయం లేకుండా చూడాలని కోరారు. ఈ సందర్భంగా జవహర్ అనుకూల, ప్రతికూల నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ పరిణామాలపై ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment