ఆస్పత్రి సిబ్బంది సంరక్షణలో ఉన్న చిన్నారి
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్): దిశ యాప్ ఒక మహిళ ప్రాణాలు కాపాడింది. మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ చివరిక్షణంలో దిశకు సమాచారం అందించటంతో పోలీసులు నిమిషాల వ్యవధిలోనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఏడాది వయసున్న ఆమె కుమార్తెను సంరక్షించారు. ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. సేకరించిన, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ న్యూరాజరాజేశ్వరీపేటకు చెందిన జ్ఞానప్రసన్న (31) కృష్ణలంకలోని ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. కొన్నేళ్ల కిందట భర్తతో విభేదాలు రావడంతో ఒంటరిగా జీవిస్తోంది. చదవండి: కృష్ణా జలాల వివాదం తెలుగు రాష్ట్రాలకే పరిమితం
ఈ నేపథ్యంలో ప్రైవేటు బ్యాంకుల్లో రికవరీ ఏజెంట్‌గా పనిచేసే సింగ్‌నగర్ లూనా సెంటర్‌కు చెందిన షేక్ అఖిల్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరూ సహజీవనం సాగిస్తున్నారు. అఖిల్‌కు అతడి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లు తెలిసిన ప్రసన్న లూనాసెంటర్‌లోని అతడి ఇంటికి వెళ్లి ప్రశ్నించింది. అఖిల్, అతడి కుటుంబసభ్యులు ఆమెను తిట్టి, కొట్టి అక్కడి నుంచి పంపేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె బుధవారం అర్థరాత్రి 12 గంటల సమయంలో ఇంట్లో ఉన్న శానిటైజర్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. తాను మోసపోయానని, ఆత్మహత్య చేసుకుంటున్నానని చివరి క్షణంలో దిశ యాప్‌కు సందేశం పంపింది.
చికిత్స పొందుతున్న జ్ఞాన ప్రసన్న
క్షణాల్లో స్పందించిన పోలీసులు
ప్రసన్న ఫోన్ నుంచి వచ్చిన సందేశంతో డీజీపీ కార్యాలయంలో దిశ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆమె ఫోన్ సిగ్నల్ ద్వారా న్యూరాజరాజేశ్వరీపేటలో ఉన్నట్లు గుర్తించి సమీపంలోని అజిత్‌సింగ్‌నగర్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడే విధుల్లో ఉన్న ఏఎస్‌ఐ హేమచంద్, కానిస్టేబుల్ ప్రకాష్, హోంగార్డ్ చంద్రశేఖర్ 10 నిమిషాల్లోనే ప్రసన్న ఇంటికి చేరుకున్నారు. చదవండి: రూ.789 కోట్లతో 48 లక్షలమంది పిల్లలకు ‘కానుక’
అపస్మారకస్థితిలో ఉన్న ఆమెను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఏడాది వయసున్న ఆమె కుమార్తెను కూడా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రసన్న ప్రాణాపాయస్థితి నుంచి బయటపడింది. ఆమె కుమార్తెను వైద్యసిబ్బంది సంరక్షిస్తున్నారు. ప్రసన్న ఇంకా మాట్లాడే స్థితికి రాకపోవడంతో పోలీసులకు పూర్తి వివరాలు తెలియలేదు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఉన్న ప్రసన్న తల్లిదండ్రులకు, బంధువులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
దిశ అధికారులు, పోలీసులకు ప్రశంసలు
కేవలం ఓ సందేశం ద్వారా నిమిషాల వ్యవధిలో మహిళ ఇంటికి చేరుకుని మృత్యువాత పడకుండా ఆమెను కాపాడిన దిశ కార్యాలయం అధికారులు, అజిత్‌సింగ్‌నగర్ పోలీసులను పోలీసు ఉన్నతాధికారులు, ప్రజలు ప్రశంసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment