విజయనగరం జిల్లా ధర్మపురి గ్రామంలో వేకువజామున నారాయణమ్మకు పింఛన్ ఇస్తున్న వలంటీర్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ శరవేగంతో జరుగుతోంది. అవ్వాతాతలు, వికలాంగులు ఇతర లబ్ధిదారులు ఎక్కడ ఉంటే అక్కడికి వలంటీర్లు వెళ్లి పింఛన్ డబ్బును అందజేస్తున్నారు. ఆదివారం రాత్రి 7 గంటల వరకు 82.04 శాతం లబ్ధిదారులకు పెరిగిన పింఛన్ అందజేశారు. మొత్తం 50,65,597 మందికి రూ.1,288.86 కోట్ల మొత్తాన్ని అందజేశారు. జనవరి ఒకటో తేదీన 25 లక్షల మందికి పంపిణీ జరగ్గా, రెండో రోజు ఆదివారం సెలవు దినం అయినప్పటికీ, పలుచోట్ల స్థానిక ప్రజా ప్రతినిధులు వలంటీర్లతో కలిసి లబ్ధిదారుల వద్దకే వెళ్లి పింఛన్లు అందజేశారు. మరో మూడు రోజుల పాటు వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని సెర్ప్ అధికారులు వెల్లడించారు.
పాలాభిషేకంతో సీఎం జగన్‌కు అవ్వాతాతల దీవెన
పింఛను రూ. 2,500కు పెంచడంపై అవ్వాతాతలు, ఇతర లబ్ధిదారులు ఆదివారం వివిధ రూపాల్లో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల అవ్వాతాతలు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తూ దీవెనలందించారు. ఈ నెలలో కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులు, పెరిగిన పింఛన్ డబ్బులు అందుకున్న పలువురు ఆదివారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రొంపిచెర్ల మండలంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిలు కొత్తగా ఎంపికైన లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు పత్రాలను అందజేశారు.
కృష్ణా జిల్లా విజయవాడలో రూ.2,500 పెన్షన్‌ను వృద్ధురాలైన వేపూరి దుర్గాంబకు అందజేస్తున్న వలంటీర్
► శ్రీకాకుళం జిల్లా పొలకి మండలంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు లబ్ధిదారులతో ముఖాముఖీ నిర్వహించి, సీఎం జగన్ రాసిన లేఖ ప్రతులను అందజేశారు. సంతకవిటి మండలంలో పింఛన్ల పెంపు కార్యక్రమంలో రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్ సిరిపురపు జగన్మోహనరావు పాల్గొన్నారు.
► విజయవాడ నగరం 52వ వార్డులో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు స్థానిక ప్రజాప్రతినిధులు, వలంటీర్లతో కలిసి ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేశారు. కృష్ణా జిల్లా నూజివీడు రూరల్ మండలంలో స్థానిక ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో లబ్ధిదారులతో మండల పరిషత్ పాఠశాలలో సమావేశమయ్యారు. కొత్తగా పింఛన్లు మంజూరైన వారికి మంజూరు పత్రాలను అందజేశారు.
► వైఎస్సార్ జిల్లా రాయచోటిలో ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి కొత్తగా ఎంపికైన లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు.
► నెల్లూరు జిల్లా వాకాడులో సర్పంచ్ వెంకట రత్నం, ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో గ్రామ సచివాలయ కార్యదర్శి ఉమామహేశ్వర రావు, ఇతర సిబ్బంది కొత్తగా ఎంపికైన లబ్ధిదారులకు వారి ఇళ్ల వద్దే పింఛను మంజూరు పత్రాలను అందజేశారు.
నువ్వు లేకపోతే ముసలోళ్లం లేము నాయనా...
పింఛన్ పెంపుపై ఓ వృద్ధురాలి మనోగతం.. సోషల్ మీడియాలో వైరల్
పుట్లూరు: ‘నువ్వు లేకపోతే ముసలోళ్లం లేము నాయనా..’ అంటూ అనంతపురం జిల్లాకు చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీ ప్రకారం వృద్ధులకు అందించే పింఛను మొత్తాన్ని రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా పుట్లూరు మండలం గరుగుచింతలపల్లికి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు ఎర్రక్క.. సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు చెబుతూ మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. జై జగన్..జైజై జగన్ అంటూ ‘నువ్వు లేకపోతే ముసలోళ్లం లేము నాయనా.. చక్కని తండ్రి.. బంగారు తండ్రి.. మా కోసమే జన్మించినావు..’ అంటూ ఎర్రక్క సంతోషం వ్యక్తం చేసింది. ఆమె భర్త చనిపోవడంతో గరుగుచింతలపల్లి అంబేడ్కర్ కాలనీలో ఒంటరిగా జీవిస్తోంది. ప్రభుత్వం అందించే పింఛన్ మాత్రమే ఆమెకు జీవనాధారం. పెరిగిన పింఛన్ అందుకున్న ఎర్రక్క తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.
నడుపల్లిలో వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న పింఛనుదారులు
ఇచ్చిన మాట నెరవేర్చే నాయకుడు జగన్
పింఛన్ల పెంపుపై లబ్ధిదారుల హర్షం.. వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులుపెరవలి: ఇచ్చిన మాటను నెరవేరుస్తూ సీఎం వైఎస్ జగన్ పింఛన్ సొమ్మును పెంచడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం నడుపల్లి గ్రామంలోని వృద్ధులు ఆదివారం వైఎస్సార్ విగ్రహం వద్ద ఘన నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. రెండున్నరేళ్ల కిందటి వరకు ఓట్ల కోసం మోసపు హామీలిచ్చిన నాయకులను చూశామన్నారు. గతంలో పింఛన్ మంజూరు చేసేందుకు లంచాలు తీసుకున్న వారు కూడా ఉన్నారన్నారు. కానీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి నెలా మొదటి తేదీనాడే పింఛన్ ఇస్తున్నారని చెప్పారు. కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఇంటికే పింఛన్ పంపిస్తున్న మహానుభావుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. సర్పంచ్ బీరా సత్యవతి రాజు పాల్గొన్నారు.
వైఎస్సార్ జిల్లా కడప రవీంద్రనగర్‌లో రహిమూన్‌కు వితంతు పెన్షన్ అందిస్తున్న వలంటీర్
Comments
Please login to add a commentAdd a comment